రెండు సైన్యాల మధ్య ఓ అర్ధరాత్రి గోడ..!
అవలోకనం
మనం మరొక స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, భారత జాతీయవాదపు మూడు అంశాలకేసి దృష్టి సారించాలని అనుకుంటు న్నాను. మొదటిది ఏమిటంటే మనకు ఇన్నాళ్లూ బోధిస్తూ వచ్చిన భారత మ్యాప్‌కి సంబంధించిన సగుణవాది స్వభావం (మానవ లక్షణాలను కలిగి ఉం డటం అని అర్థం)
మదరిండియా లేక భారతమాత చిత్రం దేశ భౌగోళిక చిత్రపటంకి సంబం ధించిన భౌతిక రేఖలను పోలి ఉంటుంది. మన దేశాన్ని చీరకట్టులోని మహిళగా కూడా చూపిస్తుంటారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం ఈ చిత్రం తలను పోలి ఉంటుంది. దక్షిణాదిన ఉన్న ఓ చిన్న ద్వీపకల్పం అతి ఇరుకైన భాగం ఆమె కాలి అందియలు, పాదాలను పోలి ఉంటుంది. కెరటంలా లేచే ఆమె చీర కొంగు ఈశాన్య రాష్ట్రాల రూపం దాల్చి ఉంటుంది. 40 సంవత్సరాల క్రితం నాటి మ్యాప్‌లను కూడా నేను స్పష్టంగా గుర్తించుకోగలిగేవాడిని. ఎందుకంటే ప్రజల హృదయాల్లో అవి ప్రతి ధ్వనిస్తుండేవి. కాబట్టే అవి చాలా కాలం అందరి జ్ఞాపకాల్లో ఉండేవి.
దీని విశిష్ట గుణం ఏమిటంటే, ఇండియా మ్యాప్‌లో ఏమాత్రం మార్పు చేసినా సరే దేశంలోని ఏ వ్యక్తికీ అది ఆమోదనీయం కాదు. ఎందుకంటే దీర్ఘ కాలంగా వారు భారత మ్యాప్‌ని మానవరూపంలో, సజీవమైన అర్థంలో చూస్తూ వస్తున్నారు. భారత మ్యాప్ ఏవో కొన్ని రేఖలు, స్థల వర్ణనతో కూడిన అంశాల కలయిక కాదు. అందుకే, ఆ మ్యాప్‌లో ఎలాంటి మార్పులనైనా తీసుకురావటం ప్రభుత్వానికి కష్టమయ్యేది.
చైనాతో సరిహద్దు సమస్య కానీ, కశ్మీర్‌లో చాలా భాగం పాకిస్తాన్ ఆక్రమ ణలో ఉందన్న వాస్తవం కానీ మన అధికారిక మ్యాప్‌ల నుంచి కనుమరుగు కావ డం కష్టం. మనకు వెలుపలి ప్రపంచం ప్రచురించే ఇండియన్ మ్యాప్‌ల భౌతిక రూపాన్ని సవరిస్తూ, వాటిపై అధికారిక స్టాంపులను ముద్రిస్తూ ఉండటంలో మన ప్రభుత్వం ఎల్లప్పుడూ తలమునకలవుతూ ఉంటుంది. వాటిలోని తప్పులు ఎంతో అభ్యంతరకరమైనవని చూపడమే ప్రభుత్వ ఉద్దేశం. కాని అలాంటి మ్యాప్‌లు చాలా తరచుగా కనబడుతుంటాయి. వాటిని ఎవరైనా తెలిసో తెలి యకో ఉపయోగిస్తున్నట్లయితే మన మీడియా అలాంటి ఘటనలపై ఆగ్రహం ప్రదర్శిస్తుంటుంది. భారతమాత చిత్రపటంలో ఏ కొంచెం మార్పులు చేసినా సరే చాలామంది భారతీయులకు అది తీవ్రమైన నేరంగా కనిపిస్తుంటుంది. ఆమె రూపం విషయంలో ఎలాంటి ఉల్లంఘనలూ జరగకూడదు మరి.
మనం అర్థం చేసుకోవలసిన రెండో అంశం ఏమిటంటే ఆ మ్యాప్ చరిత్రే. 1947లో భారత్‌కు వారసత్వంగా వచ్చినది వలస రాజ్యమే. దీనికి అత్యంత దూకుడుతో కూడిన విస్తరణ స్వభావం ఉండేది. మొఘలులు సైతం ఎన్నడూ స్వాధీనపర్చుకోనంత పెద్ద భూభాగాన్ని, ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతం మొత్తాన్ని ఇది కైవసం చేసుకుంది. మొఘలులు లేదా వారి వారసులు ఈశాన్య ప్రాంతాన్ని స్వాధీనపర్చుకోలేకపోయారు అంటే అర్థం ఈ ప్రాంతాలు ఒక కొత్తవైన, అసలు ఒప్పందాల మాటున భద్రంగా ఉండేవి. శాశ్వతమైన, పొందికైన దేశంలో భాగం గా మనం భావిస్తున్న పలు భూభాగాలను బ్రిటిష్ భారతీయ సైన్యం పోరాడి గెలుచుకుంది. ఈ వాస్తవాంశాన్ని భారతీయులకు ఎవరూ బోధపర్చలేదు.
వలస సైన్యం ఆక్రమణకు లోబడినవి కాబట్టే ఆ ప్రాంతాల్లో భారత్‌పట్ల అంతటి శత్రుభావం, తిరుగుబాట్లు చోటు చేసుకుంటూ వచ్చాయి. కానీ నాగాల సమస్యపట్ల మహాత్మా గాంధీకి కాస్త సానుభూతి ఉండేదని తెలుసుకుంటే కొంతమందికి ఆశ్చర్యం కలుగవచ్చు. ఏదేమైనప్పటికీ, వలసపాలనా కాలంలో వలే, కఠిన చట్టాలకింద మగ్గిపోతున్న భారత్‌లోని ఒక భాగం పట్ల సగటు భార తీయుడికి ఏమంత సానుభూతి ఉండేది కాదు. ఈ చట్టాలవల్లే భారతీయ సైన్యం ఆ ప్రాంతంలో తాను చేసే తప్పులకు శిక్షలన్నవే లేకుండా, పూర్తి రక్షణతో కార్య కలాపాలు కొనసాగిస్తోంది. మన జాతీయ వాదానికి అది సంరక్షకురాలు అనే భావనతో మెజారిటీ భారతీయులు భారత సైన్యం చర్యల పట్ల పెద్ద పట్టింపు లేకుండా గడిపేస్తుంటారు.
ఇక మూడో అంశం ఏమిటంటే భారత సైన్యపు జాతీయవాద స్వభావం ఒక భ్రమ అన్నదే. వలసపాలనలో భారత్‌లో ఉన్నది ఒక కిరాయి సైన్యం. 1947 ఆగ స్టు నెలలో ఓ అర్ధరాత్రి అది ఉన్నట్లుండి జాతీయ సైన్యంగా మారిపోయిందన్నది వాస్తవం. పాకిస్తాన్ కూడా ఇదే ప్రక్రియలోకి వెళ్లింది. ఆగస్టు 14కి ముందు నాటి బ్రిటిష్ సైన్యానికి (బలూచ్ రెజిమెంట్‌కు చెందిన పంజాబీలు, గూర్ఖా రెజిమెం టుకు చెందిన నేపాలీలే అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో నిరాయుధులైన సిక్కులు, హిందువులు, ముస్లింలను వందలాదిగా కాల్చిచంపారు), ఆగస్టు 15 నాటి భారతీయ స్వేచ్ఛా సైన్యానికి ఏమాత్రం వ్యత్యాసం ఉండేది కాదు.
భారతీయ సైన్యం దీర్ఘకాలంగా గర్వించదగిన సమరోచిత సైనిక వార సత్వాన్ని కలిగి ఉండేదని నా భావన. అదే సమయంలో పుట్టుకతోనే పూర్తిగా కిరాయి స్వభావంతో కూడిన చరిత్ర దానికుండేది. క్రీస్తుకు ముందు నాలుగో శతా బ్దంలో గ్రీకు చరిత్రకారుడు అరియన్, అలెగ్జాండర్ ది గ్రేట్ సైనిక దండయాత్రల గురించి రాశాడు. దీనికోసం ఇతడు జనరల్ టాలమీ (ఇతడు క్లియోపాత్రతో ముగిసిన గ్రీక్-ఈజిప్షియన్ ఫారోల వంశక్రమాన్ని కనుగొన్నాడు) రాసిన చరి త్రను ప్రధానంగా ఉపయోగించుకున్నాడు.
పంజాబ్‌లో మాసిడోనియన్ సైన్యం సాగించిన అతి కష్టమైన దండయాత్ర గ్రామీణులు కిరాయికి కుదుర్చుకున్న కిరాయి సైనికులకు వ్యతిరేకంగా నడిచింది. అంతకు వందేళ్లకు క్రితం గ్రీకు చరిత్ర కారుడు హెరోడోటస్ కూడా ఇదే విషయాన్ని నివేదిస్తూ.. ప్లేషియా యుద్ధ రంగంలో పర్షియన్ సేనలో భారతీయ కిరాయిసేనల రెజిమెంట్ ఉండేదని రాశాడు. ఈ విభాగం ధరించిన దుస్తులు, ఆయుధాల గురించి హెరోడోటస్ వర్ణిం చాడు. ఇక మొఘల్ కాలంలో అయితే, జాట్‌ల నుంచి మరాఠాలు, సిక్కుల దాకా ఎవరు ఎక్కువ కిరాయి చెల్లిస్తే వారి తరపున పోరాడేందుకు భారతీయులు అందుబాటులో ఉండేవారన్నది అందరికీ తెలిసిన విషయమే.
భారత్‌పై విదేశీ దురాక్రమణతో సంబంధమున్న ప్రతి సమరంలోనూ అంటే ప్లాసీ లేదా హల్దీఘాటీ వంటి యుద్ధాలన్నింటిలోనూ విజయం సాధించిన పక్షంలో మెజారిటీ పోరాటయోధులుగా భారతీయులే ఉండేవారు. భారతీయ సైన్యం జాతీయవాద స్వభావంతో కూడి నదనే మన సంప్రదాయిక విశ్వాసానికి ఈ ఉదాహరణలు ఏమంత అనుగుణంగా ఉండటం లేదు కదా.
కానీ మనం బాల్యం నుంచి పాఠశాలల్లో నేర్చుకుంటూ వచ్చిన పాఠాల్లో ఈ చరిత్ర లేదు. మన వాస్తవ చరిత్ర తెలిసిన వారు మాత్రం తాము తప్పక సమా ధానపడవలసిన రెండు విభిన్న వర్ణనలతో నిత్యం ఘర్షిస్తుంటారు.
మన సంస్కృతి స్వభావం, దాని సున్నితత్వాల సుతిమెత్తనితనం నేప థ్యంలో పైన పేర్కొన్న మూడు అంశాలూ సమీప భవిష్యత్తులో మార్పు చెందు తాయని నేను భావించడం లేదు. కాని ఒక చిన్నదైన, తెలివైన శ్రోతల బృందానికి ఒక కాలమిస్టు రాసి పంచుకోగలిగిన విషయంగా ఈ మూడు అంశాలు ఉనికిలో ఉండవచ్చు మరి.
- ఆకార్ పటేల్
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com