స్టింగ్ జర్నలిజం శకం ముగిసిపోయిందా? | Is sting journalism era over, Akarpatel writes | Sakshi
Sakshi News home page

స్టింగ్ జర్నలిజం శకం ముగిసిపోయిందా?

Published Sat, Mar 26 2016 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

స్టింగ్ జర్నలిజం శకం ముగిసిపోయిందా?

స్టింగ్ జర్నలిజం శకం ముగిసిపోయిందా?

అవలోకనం
 
తెహెల్కాతో ప్రారంభమైన స్టింగ్ జర్నలిజం శకం ఒకప్పుడు ఉండేదని చెబుతాను. ఇప్పుడు తెహెల్కాయే వెనుకబడిపోయింది. ఇప్పుడు అవినీతి అంతం కాలేదు కానీ ప్రభుత్వంలోని వ్యక్తులు మరింత జాగ్ర త్తగా ఉంటున్నారన్నదే వాస్తవం. లంచం అనేది ఎవరైనా సరే బతకడానికి ఒక మార్గంలా కనిపిస్తోంది. ఇలాంటి వారు లంచగొండులని, అవినీతిపరులని స్టింగ్ ఆపరేషన్ల ద్వారా చూపించడం వల్ల ఇలాంటి సంస్కృతిపై తగినంత ప్రభావం చూపడం లేదు.
 
ప్రస్తుతం ‘స్టింగ్’ అనే పదం ‘ఎన్‌కౌంటర్’ అనే పదంలాగే తన విలువను కోల్పోయింది. అంటే జరిగిన ఒక చర్యకు మనం సాక్ష్యులమైనప్పటికీ, బ్లాక్ అండ్ వైట్‌లోని ఒక చర్య ప్రదర్శనకు అది సరిపోదని నేననుకుంటున్నాను. దాన్ని వీడియోలో చిత్రీకరించి ఉండవచ్చు కానీ అది సత్యానికి ఒక వైపు మాత్రమే. ఎందుకలా? దీనిపై దృష్టి సారించి, ఈ రెండు పదాలు తమ విశ్వసనీయతను ఎలా కోల్పోయాయో తెలుసుకుందాం.

ఖలిస్తాన్ కోసం సిక్కు వేర్పాటువాద ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు, 1980లలో ఎన్‌కౌంటర్ అనే పదం భారతీయులకు సుపరిచి తమైంది. ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు హతమైన వార్తలు అప్పట్లో సర్వసాధా రణమైపోయాయి. ముంబైలో 1990లలో పోలీసులు మాఫియాలో కిందిస్థాయి భాగస్వాములను వరుస ఎన్‌కౌంటర్లలో చంపేశారు. చేతులకు బేడీలు వేసి ఉన్న మనుషులపై ట్రిగ్గర్ నొక్కడానికి ఇష్టపడే అధికారులు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులుగా మారారు. ఈ క్రమంలో కొంతమంది అమాయకుల్ని కూడా చంపేశారు. అందుకే ‘ఉస్కా ఎన్‌కౌంటర్ హో గయా’ అనే పదబంధానికి ఎవరో ఒకరిని ఉద్దేశ పూర్వకంగా ఎంపిక చేసుకుని తర్వాత వారిని చంపేశారనే అర్థం వచ్చేసింది.

అయితే స్టింగ్ అనే పదం కూడా ఎన్‌కౌంటర్ పదంలాగా ఎందుకు విశ్వస నీయత కోల్పోయింది. మీడియాలో 15 ఏళ్ల క్రితం తెహెల్కా పత్రిక చేపట్టిన భారీ స్థాయి పరిశోధనతో స్టింగ్ ఆపరేషన్‌ల సంప్రదాయం ప్రారంభమైంది. వీడియో కెమెరాలను సూక్ష్మరూపంలోకి తీసుకువచ్చి సైనిక, నిఘా సాంకేతిక జ్ఞానాన్ని వాణిజ్య అప్లికేషన్లకు బదిలీ చేయడం వల్లే ఈ తరహా పరిశోధన సాధ్యమైంది. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి మహమ్మద్ అజారుద్దీన్ వంటి ప్రముఖ క్రీడాకారుల గురించి బీసీసీఐ అధికారులు, క్రికెటర్లు మాట్లాడుతుండటాన్ని తెహెల్కా రికార్డు చేసింది.

తర్వాతేం జరిగింది? విదేశీ క్రీడాకారులు (దక్షిణాఫ్రికా ప్రముఖ క్రికెటర్ హాన్సీ క్రోన్యే) బెట్టింగ్ ఆరోపణలలో చిక్కుకుని తప్పును అంగీకరించడం, శిక్షలకు గురవడం జరగ్గా భారత్‌లో మాత్రం ఇలాంటి ఉదంతాలు అస్పష్టంగానే ముగిసి పోయాయి. అజారుద్దీన్‌పై నిషేధం ఎత్తివేశారు. అతడు రాజకీయనేతగా అవతారమెత్తి ఎంపీ స్థానం గెల్చుకున్నాడు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యం ఉన్నప్పటికీ తాను తప్పు చేసినట్లు అతడు ఎన్నడూ అంగీకరించలేదు. తప్పించు కోవడం క్రోన్యేకి సాధ్యం కానప్పటికీ అజారుద్దీన్ మాత్రం బయటపడగలిగాడు. బెట్టింగ్ ఆరోపణల్లో చిక్కుకున్న ప్రముఖ క్రికెటర్లలో ఏ ఒక్కరూ దెబ్బతినలేదు.

తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పుడు నేను ముంబైలో ఒక వార్తాపత్రికను ఎడిట్ చేస్తు ఉండేవాడిని. తెహెల్కా బయటపెట్టిన విషయం మమ్మల్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే ఆ పరిశోధనా ప్రతులను మొత్తంగా ప్రచురించాము. భారతీయ క్రికెట్‌కు చెందిన గొప్ప, మంచి క్రికెటర్లు అవినీతి గురించి ఎంతో తేలిగ్గా మాట్లాడుతున్న మాటలను బయటపెట్టిన ప్రతులవి. కానీ ఈ స్టింగ్ వల్ల తర్వాత జరిగిందేమిటి? చెప్పడానికి ఇది కష్టమే. ప్రపంచంలోనే అత్యంత అవినీతి లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్‌తోపాటు క్రికెట్‌లో అవినీతి కొనసాగుతోంది. క్రికెటర్లు సస్పెండ్ అవుతూనే ఉన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు గాను శిక్షల పాలవుతున్నారు.

అయితే స్పష్టమైన తీర్పులను సాధించలేని ఈ స్టింగ్‌ల వైఫల్యం అన్నిచోట్లా కనబడుతుంది. ఈ నెలలో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఒక స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కుకుంది. పార్టీకి చెందిన డజనుకు ైపైగా సభ్యులు నగదు, హామీలు పొందుతున్న దృశ్యాలను ఈ స్టింగ్‌లో చిత్రీకరించారు. ఎంపీలు, ఎమ్మె ల్యేలతోపాటు వీరిలో అందరూ ఉన్నతాధికారులే ఉన్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ స్పందన ఏమిటి? ఈ వ్యవహారంలో వాస్తవానికి తామే బాధితులమని, శత్రువులు తమైపై చేసిన విష ప్రచారమని ఆ పార్టీ ప్రకటించింది.

భారత్‌లో స్టింగ్ ఆపరేషన్ల సాధారణ వైఫల్యానికి రెండు కారణాలున్నాయి. మన కోణంలో నైతిక బాధ్యత భావన ఏమంత పటిష్టమైనది కాకపోవడం అతి ప్రధాన కారణం. ఎందుకంటే మన నీతిసూత్రాలు చాలా సరళతతో, వెసులు బాటుతో ఉంటాయని చెప్పాలి,

లాలూ ప్రసాద్ యాదవ్ ప్రదర్శిస్తున్నట్లుగా.. అవినీతి నేతలుగా ప్రదర్శి తమైన వారు, చివరకు నేరస్థులుగా శిక్షపడిన వారు రాజకీయాల్లో కొనసాగగలరు. అలాగని లాలూ ఒక్కరే కాదు. ఏదీ వాస్తవంగా పనిచేయని వ్యవస్థలో, మధ్యవర్తి చట్టబద్ధత కలవాడిగా మారుతున్నాడు. ఇక లంచం అనేది ఎవరైనా సరే బతక డానికి ఒక మార్గంలా కనిపిస్తోంది. ఇలాంటి వారు లంచగొండులని, అవినీతి పరులని స్టింగ్ ఆపరేషన్ల ద్వారా చూపించడం వల్ల మన సంస్కృతిపై తగినంత ప్రభావం చూపడం లేదు.

అధికారంలో ఉన్న అనేకమంది వ్యక్తులు స్టింగ్ ఆపరేషన్ల బారినపడ్డారు కానీ, తమకు వ్యతిరేకంగా సాక్ష్యాలను వీరు సులువుగా తోసిపుచ్చుతున్నారు. ఉదాహరణకు, సాహెబ్ (నరేంద్రమోదీ) డిమాండ్ చేశారు కాబట్టి ఒక యువ మహిళపై నిఘా ఉంచవలసిందిగా గుజరాత్ పోలీసు అధికారులను ఆదేశించిన అమిత్‌షా కుంభకోణం ఉంది. బీజేపీ నాటి అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ఒక స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయి అవినీతికి గాను శిక్షపడి జైలు పాలైనప్పటికీ, అతి తక్కువ కాలం మాత్రమే కారాగారంలో ఉండి తర్వాత బెయిల్ తెచ్చుకుని ఇంట్లో ఉండి చనిపోయారు.

ఇక స్టింగ్  ఆపరేషన్లు వాస్తవంగానే పనిచేయవు అనేందుకు మరో కారణం ఏదంటే మీడియా తరచుగా రాజీపడిపోవడమే. ఒక కార్పొరేట్ సంస్థ నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేస్తూ స్టింగ్ వీడియోకు దొరికిపోయిన జీ టీవీ ఎడిటర్ స్వయంగా అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నాడు. ఇందుకుగాను అతడు అరెస్టయినప్పటికీ తన స్థానంలో కొనసాగుతూనే ఉన్నాడు. చివరకు తెహెల్కా సంస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ అనైతిక చర్యల కారణంగా ఆ పత్రిక సైతం తన ప్రతిష్టను పూర్తిగా పోగొట్టుకుంది. అయితే స్టింగ్ ఆపరేషన్ల వల్ల ప్రజలు అలసి పోయారని నా అనుమానం. కారణం ఏదైనా కావచ్చు. సంతృప్తికరమైన ఫలి తాలను ఇవ్వకుండా ముగిసిపోయే కథనాల పట్ల కొద్దికాలం తర్వాత ఆసక్తి తగ్గిపోతుంది. తెహెల్కా మాజీ ఉద్యోగుల్లో ఒకరైన అనిరుద్ధ బహల్ తరచుగా స్టింగ్ జర్నలిజం చేస్తుంటారు కాని తన కృషికి పెద్దగా కవరేజ్ దొరకలేదు.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత, తన ప్రభుత్వంలోని అధికారులు లంచం తీసుకుంటుంటే వాటిని రహస్యంగా రికార్డు చేయాలని, అప్పుడే వారిని తాను శిక్షించగలనని అరవింద్ కేజ్రీవాల్ పౌరులను ప్రోత్సహించారు. ఇందుకు సంబంధించిన ప్రచారాన్ని భారీస్థాయిలో నిర్వహించారు కానీ అదెలా ముగిసి పోయిందో స్పష్టం కాలేదు. దీనివల్ల నాకు తెలిసి పెద్ద ఫలితం రాలేదు.

పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన తాజా స్టింగ్ ఆపరేషన్ అక్కడ త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీని దెబ్బతీస్తుందంటే నేను ఆశ్చర్యపోతాను. తెహెల్కాతో ప్రారంభమైన స్టింగ్ జర్నలిజం శకం ఒకప్పుడు ఉండేదని చెబుతాను. ఇప్పుడు తెహెల్కాయే వెనుకబడిపోయింది. ఇప్పుడు అవినీతి అంతం కాలేదు కానీ ప్రభుత్వంలోని వ్యక్తులు మరింత జాగ్ర త్తగా ఉంటున్నారన్నదే వాస్తవం.
 
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement