సాక్షి, కృష్ణా: కులం, డబ్బు, మతం కారణంగా అసమానతలు ఉండకూడదని, స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కలలు కంటున్నామని, కానీ.. అసమానతలు లేని పాలన నాడు వైఎస్సార్.. నేడు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ.. వెనుకబాటుతనాన్ని రూపుమాపాలన్నదే సీఎం వైఎస్ జగన్ తపన అని ఉద్ఘాటించారు. గతంలో ఎందరో పాలకులున్నా ఎవరికీ ఈ తరహా ఆలోచనలు రాలేదు. రాజకీయాలలో కూడా అణగారిన వర్గాలకి ఎక్కువ అవకాశం ఇచ్చింది నాడు వైఎస్సార్.. నేడు సీఎం వైఎస్ జగన్. కౌన్సిల్‌లో 18 మంది బలహీన వర్గాలు.. ఆరుగురు ఎస్సీలు, నలుగురు మైనార్టీలకి అవకాశమిచ్చారు సీఎం జగన్.
అదే చంద్రబాబును చూసుకుంటే.. 2014 నుంచి 2019 వరకు గిరిజలకి, మైనార్టీలకి చంద్రబాబు అవకాశమివ్వలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.. అధికారిక హోదాలో 50 శాతం మహిళలకి అవకాశం ఇచ్చారు సీఎం జగన్. ఇక ఏజెన్సీ ప్రాంతంలో నూటికి నూరుశాతం గిరిజనులకే అధికారం. గిరిజనుల ప్రాంతంలో ఆసుపత్రులకి స్పెషలిస్ట్ లకి ఇచ్చిన అత్యధిక జీతం రూ. 6 లక్షలు. ఏజెన్సీ ప్రాంతంలో కూడా వాలంటీర్ల ద్వారా ఇంటికే పాలన అందిస్తున్నాం. విద్య, వైద్యంలో తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులతో ఏజెన్సీ ప్రాంతాల రూపురేఖలే మారిపోతున్నాయి అని సజ్జల వివరించారు.
కుంభా రవిబాబు సమర్థుడు
గిరిజనులకే కాకుండా అన్ని వర్గాలకి దగ్గర వ్యక్తి కుంభా రవిబాబు. కుంభా రవిబాబు ఎస్టీ కమీషన్ చైర్మన్ గా ఇప్పడివరకు సమర్దవంతంగా పనిచేశారు. ఇపుడు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందన్నారు.
బాబు కనీసం ఆ పుణ్యమైనా కట్టుకోవాల్సింది
ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా నాడు వైఎస్సార్ ప్రారంభిస్తే.. నేడు సీఎం వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మాణంతో నిరుపేదలకి ముంపు బెడద తప్పింది. ప్రపంచస్ధాయిలో పోటీపడేలా ఇంగ్లీష్ మీడియం బోధన కొనసాగుతోంది. వచ్చే పదేళ్లలో ఏపీ రూపురేఖలే మారిపోతాయి. 2004 నుంచి 2009 మధ్యలో సిఎం వైఎస్సార్ పాలన తర్చాత వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు వినియోగించుకోలేదు. చంద్రబాబు 2014 లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకి భూపంపిణీ చేసి ఎందుకు పుణ్యం కట్టుకోలేదు.
చేసింది లేదు కాబట్టే తప్పుడు ప్రచారం
వైఎస్సార్ తన అయిదేళ్ల పాలనలో 6 లక్షల ఎకరాలు గిరిజనులకి పంపిణీ చేస్తే...సిఎం వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో నాలుగు లక్షల ఎకరాలు గిరిజనులకి ఇచ్షారు. చంద్రబాబు ఎందుకు ఇలా పంపిణీ చేయలేకపోయారు. ఎన్నికలు దగ్గరపడ్డాయి కాబట్టి చంద్రబాబు పగటి వేషంతో తిరుగుతున్నాడు. ఒకవైపు సొంత పుత్రుడు.. రెండో వైపున దత్తపుత్రుడు.. చంద్రబాబు.. ముగ్గురూ రాష్ట్రమంతా ఎడాపెడా తిరుగుతూ అబద్దాలతో ప్రజలని మభ్యపెట్డాలని చూస్తున్నారు. చంద్రబాబు తనపాలనలో చేసిందేమీ లేదు కాబట్టే సీఎం వైఎస్ జగన్ పై అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 175కి 175 సీట్లు రావాలి. నిలువు దోపిడీ చేసే చంద్రబాబు లాంటి వ్యక్తులని రాజకీయంగా శాశ్వతంగా దూరం పెట్టాలి అని సజ్జల ఏపీ ప్రజలకు పిలుపు ఇచ్చారు.
గవర్నరు కోటా ఎమ్మెల్సీల ప్రమాణం
గవర్నరు కోటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి సభ్యులుగా నియమితులైన శ్రీమతి కర్రి పద్మశ్రీ , డా.కుంభా రవిబాబులు శుక్రవారం ఉదయం ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు తమ చాంబరులో వీరిరువురితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. శాసన మండలి సభ్యులుగా వారు పాటించాల్సిన నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిదానాలు, నిర్వర్తించాల్సిన కార్యకలాపాలు తదితర విషయాలను తెలిపే పుస్తకాలతో కూడిన కిట్లను అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు వారికి అందజేస్తూ అభినందనలు తెలిపారు. వీరిద్దరికీ డిప్యూటీ సీఎం (గిరిజన సంక్షేమ శాఖ మంత్రి) పీడిక రాజన్న దొర, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణా రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పాలకొండ శాసన సభ్యురాలు విశ్వసరాయి కళావతి తదితరులు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ సెక్రటరీ జనరల్ డా.పి.పి.కె. రామాచార్యులు, రాష్ట్ర శాసన మండలి ఓ.ఎస్.డి. సత్యనారాయణ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment