మొత్తం ఉత్తీర్ణత.. 72.07 శాతం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మళ్లీ అమ్మాయిలదే పైచేయి. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు బాగా వెనుకబడ్డారు. ఈ పరీక్షల్లో మొత్తం 72.07 శాతం మంది ఉత్తీర్ణులవగా.. 74.80 శాతం ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో నిలిచారు. బాలుర ఉత్తీర్ణత 69.43 శాతమే. మంగళవారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు. ఫస్టియర్ ఫలితాల్లో తెలంగాణలో 55 శాతం మంది ఉత్తీర్ణులవగా.. ఏపీలో 61 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ తెలంగాణ(63 శాతం) కంటే ఏపీలో 9 శాతం అధికంగా 72.07 శాతం ఉత్తీర్ణత సాధించామని తెలిపారు. విద్యారంగంలో ఏపీ నంబర్‌వన్‌గా ఎదుగుతోందని ఆయన చెప్పారు.
72 శాతం మంది ఉత్తీర్ణత!
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,03,496 మంది హాజరవగా.. ఇందులో 2,90,789 మంది ఉత్తీర్ణత(72.07 శాతం) సాధించారని మంత్రి తెలిపారు.
కృష్ణా ఫస్ట్... వైఎస్సార్ జిల్లా లాస్ట్!
మొదటి సంవత్సరం ఫలితాల మాదిరిగానే కృష్ణా జిల్లా 83 శాతం ఉత్తీర్ణతతో మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. రెండో స్థానంలో 77 శాతంతో నెల్లూరు జిల్లా, 76 శాతం ఉత్తీర్ణతతో విశాఖపట్నం, గుంటూరు జిల్లాలు మూడో స్థానంలో నిలిచాయన్నారు.
2 నుంచి మెమోల జారీ
ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆయా కాలేజీల్లో మే 2వ తేదీ నుంచి మెమోలను తీసుకోవచ్చునని మంత్రి గంటా వివరించారు. ఫెయిలైన విద్యార్థులకోసం మే 1 నుంచి మూడు వారాలపాటు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఇందుకోసం పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 5 ఆఖరు తేదీ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, ఇంటర్ బోర్డు కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్‌లో బాలికలే బెస్ట్
Published Wed, Apr 29 2015 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM
Advertisement
Advertisement