అమ్మాయిలు అదుర్స్‌ | Girls itself top in the first and second year | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు అదుర్స్‌

Published Mon, Apr 17 2017 2:39 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM

అమ్మాయిలు అదుర్స్‌ - Sakshi

అమ్మాయిలు అదుర్స్‌

- ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌లో వారిదే పైచేయి
- ఫలితాలు విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం


సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. బాలురకంటే అధిక ఉత్తీర్ణత శాతంతో ముందు స్థానంలో నిలిచారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో బాలికలు 63.38 శాతం ఉత్తీర్ణత సాధించగా... బాలురు 50.18 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ బాలికలు 71.63 శాతం ఉత్తీర్ణులు కాగా.. బాలురు 61.02 శాతంతో సరిపెట్టుకున్నారు. సెకండియర్‌ ఎంపీసీలో ఖమ్మం జిల్లాకు చెందిన కొండా నిఖిత 993 మార్కులతో ప్రథమ స్థానంలో నిలువగా.. బైపీసీలో 991 మార్కులతో మంచిర్యాల జిల్లాకు చెందిన పిట్టల లక్ష్మి భవాని ప్రథమ స్థానంలో నిలిచింది.

రాష్ట్రవ్యాప్తంగా గతనెల 1 నుంచి 14 వరకు నిర్వహించిన ఇంటర్మీడియెట్‌ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. హైదరాబాద్‌లోని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. గతేడాది మాదిరే ఈసారి కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ సంవత్సర (జనరల్, వొకేషనల్‌) పరీక్షలకు 4,75,874 మంది విద్యార్థులు హాజరు కాగా.. 2,70,738 మంది (56.89 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు (జనరల్, వొకేషనల్‌) 4,14,213 మంది విద్యార్థులు హాజరు కాగా 2,75,273 మంది (66.45) శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

గతేడాదికంటే పెరిగిన ఉత్తీర్ణత
గతేడాది కంటే ఈసారి ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది జనరల్, వొకేషనల్‌ ద్వితీయ సంవత్సరంలో 62.95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. ఈసారి 66.45 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో గత ఏడాది (జనరల్, వొకేషనల్‌) 54 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈసారి 56.89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఒక్క జనరల్‌లో చూస్తే.. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,36,727 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 2,50,589 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌ పరీక్షలకు 39,147 మంది విద్యార్థులు హాజరు కాగా 20,149 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర జనరల్‌ పరీక్షలకు 3,83,182 మంది హాజరు కాగా 2,55,296 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే వొకేషనల్‌లో 31,031 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 19,977 మంది ఉత్తీర్ణులయ్యారు.

మేడ్చల్‌ ఫస్ట్‌.. రంగారెడ్డి సెకండ్‌..
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వచ్చిన ఫలితాలు కావడంతో జిల్లాల వారీగా ఉత్తీర్ణతపై కాస్త ఆసక్తి నెలకొంది. ఈసారి ప్రథమ సంవత్సర (జనరల్‌) ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా 75 శాతంతో ప్రథమస్థానంలో ఉండగా, రంగారెడ్డి జిల్లా 69 శాతంతో ద్వితీయ స్థానంలో ఉంది. ఇక 34 శాతంతో మహబూబాబాద్‌ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అయితే వొకేషనల్‌లో 74 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్‌ ప్రథమ స్థానంలో నిలవగా.. 66 శాతంతో కుమ్రం భీం జిల్లా రెండో స్థానంలో ఉంది. 32 శాతంతో మహబూబాబాద్‌ చివరి స్థానంలో ఉంది. ద్వితీయ సంవత్సరంలోనూ (జనరల్‌) 82 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్‌ ప్రథమ స్థానంలో నిలువగా.. 78 శాతంతో రంగారెడ్డి ద్వితీయ స్థానంలో ఉంది. 44 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్, మహబూబాబాద్, గద్వాల జిల్లాలు చివరన నిలిచాయి. వొకేషనల్‌లో 82 శాతంతో కుమ్రం భీం జిల్లా ప్రథమస్థానంలో ఉండగా.. 81 శాతంతో మేడ్చల్‌ రెండో స్థానంలో నిలిచింది. 37 శాతం ఉత్తీర్ణతతో గద్వాల చివరి స్థానంలో ఉంది.

ప్రథమ సంవత్సర జనరల్‌ విద్యార్థుల్లో ఉత్తీర్ణులు గ్రేడ్‌లవారీగా..
‘ఎ’ గ్రేడ్‌లో: 1,26,957 (50.66 శాతం)
‘బి’ గ్రేడ్‌లో: 71,318 (28.46 శాతం)
‘సి’ గ్రేడ్‌లో: 35,820 (14.29 శాతం)
‘డి’ గ్రేడ్‌లో: 16,494 (6.58 శాతం)

ద్వితీయ సంవత్సర జనరల్‌ విద్యార్థుల్లో ఉత్తీర్ణులు గ్రేడ్‌లవారీగా..
‘ఎ’ గ్రేడ్‌లో: 1,36,549 (53.48 శాతం)
‘బి’ గ్రేడ్‌లో: 75,956 (29.75 శాతం)
‘సి’ గ్రేడ్‌లో: 32,427 (12.7 శాతం)
‘డి’ గ్రేడ్‌లో: 10,364 (4.05 శాతం)

వచ్చే ఏడాది 75% లక్ష్యం: కడియం
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరంలో వచ్చే ఏడాది 75 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరంలో 65 శాతం ఫలితాల సాధనకు కృషి చేస్తామన్నారు. ఆదివారం ఇంటర్మీడియెట్‌ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అకడమిక్‌ ఇన్‌స్పెక్షన్స్‌ పెంచుతామని, లెక్చరర్లకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని, ఇందుకు ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది ప్రభుత్వ కాలేజీల్లో 1.73 లక్షల మంది విద్యార్థులను చేర్పించగా ఈసారి 2 లక్షల మంది విద్యార్థులను చేర్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 390 కాలేజీలకు సొంత భవన నిర్మాణాలు, మరమ్మతులు, ల్యాబ్‌ తదితర సదుపాయాల కల్పనకు రూ.306 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ పనులు జూలై, ఆగస్టు నాటికి పూర్తవుతాయన్నారు. మరో 14 కాలేజీలకు స్థలాలు లేవని, వాటికి స్థలాలు ఇవ్వాలని కలెక్టర్లకు లేఖలు రాస్తున్నామన్నారు. అవి రాగానే నిధులను మంజూరు చేసి, నిర్మాణాలు చేపడతామన్నారు. 2017–18లో అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, బయోమెట్రిక్‌ హాజరు విధానం ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. తద్వారా విద్యార్థులు డ్రాపవుట్స్‌ కాకుండా చర్యలు చేపడతామన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ కూడా త్వరలోనే అవుతుందన్నారు. ఈ విషయంలో కోర్టుకు అప్పీల్‌ చేశామన్నారు.

దేశంలోనే బెస్ట్‌ ఇంటర్మీడియెట్‌ బోర్డుగా నిలబెట్టేందుకు చర్యలు చేపట్టామని, అందులో భాగంగా జాతీయ స్థాయి అవార్డు లభించిందన్నారు. వచ్చేనెల 11న ఆ అవార్డును అధికారులు అందుకుంటారని వివరించారు. అనంతరం ఇంటర్‌ విద్యా జేఏసీ రూపొందించిన ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ పోస్టర్‌ను కడియం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి అశోక్, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ సుశీల్‌కుమార్, ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రు ల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు జిల్లాల్లో ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ ఉంటుందని ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. కాలేజీ బాట పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement