గ్రేటర్ జిల్లాల్లో బాలికలదే హవా
►మూడు జిల్లాల ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా
►తొలి స్థానంలో మేడ్చల్, రెండోస్థానం రంగారెడ్డి జిల్లా
►ఫలితాలు మెరుగుపడినా.. ర్యాంకింగ్‌లో హైదరాబాద్ వెనుకంజే...
సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక ఫలితాల్లో గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో బాలికలు సత్తా చాటారు. బాలురకంటే అత్యధిక సంఖ్యలో పాసై హవా కొనసాగించారు. ఫస్ట్ ఇయర్‌లో బాలురతో పోలిస్తే మేడ్చల్ జిల్లాలోని బాలికలు అత్యధికంగా 81 శాతం ఉత్తీర్ణత సాధించగా, రంగారెడ్డిలో 74 శాతం, హైదరాబాద్‌లో 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్‌లో మేడ్చల్ 86 శాతం, రంగారెడ్డిలో 81 శాతం, హైదరాబాద్‌లో 75 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించి తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇక ఉత్తీర్ణత ర్యాంకింగ్ విషయానికి వస్తే కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లా అందరికంటే ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించి రాష్ట్రంలోనే నెంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, రంగారెడ్డి రెండో ర్యాంక్‌ను దక్కించుకుంది.
ఇక హైదరాబాద్ జిల్లా ఎనిమిదో ర్యాంక్‌కు పరిమితమైంది. హైదరాబాద్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం కొంత మెరుగు పడినా ర్యాంకింగ్‌లో వెనుకబడే ఉంది. మొత్తం ఉత్తీర్ణత విషయానికొస్తే హైదరాబాద్ జిల్లాలో ఫస్టియర్‌లో 57 శాతం, సెకండియర్‌లో 67 శాతం, రంగారెడ్డిలో ఫస్టియర్‌లో 69 శాతం, సెకండియర్‌లో 78 శాతం, మేడ్చల్ జిల్లాలో ఫస్టియర్‌లో 75 శాతం, సెకండియర్‌లో 82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.