జూనియర్ ఇంటర్‌లో మనమే టాప్
- జిల్లాలో 74 శాతం ఉత్తీర్ణత
- బాలురు 73 శాతం, బాలికలు 75 శాతం
సాక్షి, విజయవాడ : జూనియర్ ఇంటర్ ఫలితాలలో వరుసగా పదేళ్లు అగ్రస్థానంలో నిలిచి ఇంటర్మీడియెట్‌లో ఎదురులేదని జిల్లా నిరూపించుకుంది. విద్యలవాడగా తన పేరు నిలబెట్టుకుంటూ విజయపరంపర కొనసాగించింది. సోమవారం ప్రకటించిన జూనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
రాష్ట్రవ్యాప్త సగటు కేవలం 55.84 శాతం ఉండగా దాదాపు 20 శాతం ఎక్కువ సగటు అంటే 74 శాతం ఉత్తీర్ణతతో జిల్లా విద్యార్థులు ఈ ఘనత సాధించారు. గత సంవత్సరం కూడా జిల్లా విద్యార్థులు 74 శాతం ఉత్తీర్ణత పొందారు. జిల్లాలో ఈ సంవత్సరం 64,110 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 47,307 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య కూడా మూడువేలకు పైగా పెరిగింది. 34,627 మంది బాలురు పరీక్షలు రాయగా 25,109 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు.
29,483 మంది బాలికలు పరీక్షలు రాయగా 22,198 మంది పాసై 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణతా శాతం గత ఏడాది 76 శాతం ఉండగా, ఈ ఏడాది 75 శాతంగా ఉంది. జిల్లాలో ఉత్తీర్ణతా శాతంలో బాలికలే ముందంజలో ఉన్నట్లయింది. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి పరీక్షలు రాసిన 1495 మందిలో 887 మంది పాసై 55 శాతం ఉత్తీర్ణతను సాధించారు.
జనరల్ కేటగిరిలో రాష్ట్రస్థాయిలో ఉత్తీర్ణతా శాతం 55.84 ఉండగా, కృష్ణాజిల్లా 74 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. కార్పొరేట్ కళాశాలలు తమ హవాను కొనసాగించాయి. శ్రీ చైతన్య విద్యార్థులు బైపీసీలో కె.సైదు భార్గవి, పీ ఆదర్ష్‌వర్ధన్, వీ అక్షయలు 436 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, అదే విద్యా సంస్థకు చెందిన ఎన్ కృష్ణ విక్రాంత్‌కుమార్, బీ నరశింహారెడ్డిలు ఎంపీసీలో 467/470 మార్కులు సాధించారు.
ప్రభుత్వ కళాశాలల్లో తగ్గిన ఉత్తీర్ణత...
ఈ సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఉత్తీర్ణతా శాతం గత ఏడాదికంటే తగ్గింది. గత ఏడాది 46.1 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 37.81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత మూడేళ్లుగా జిల్లాలోని ప్రభుత్వ కళాశాల ఫలితాలు మెరుగ్గా వస్తున్నప్పటికీ, ఈ ఏడాది తగ్గాయి. ఉత్తీర్ణతా శాతంలో రుద్రపాక జూనియర్ కళాశాల 87 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. మొవ్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల 75.33 శాతంతో రెండో స్థానం సాధించింది. కంచికచర్ల జూనియర్ కళాశాల 7.69 శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది.