ఇంటర్‌ ఫలితాల్లో బాలికలు భేష్‌ | Girls Itself toppers in Inter results | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలు భేష్‌

Published Sat, Apr 13 2019 5:33 AM | Last Updated on Sat, Apr 13 2019 5:33 AM

Girls Itself toppers in Inter results - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో బాలికలు తమ సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెండింటిలోనూ బాలురకన్నా ఎంతో ముందంజలో నిలిచారు. ఈ ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి శుక్రవారం సచివాలయంలోని కాన్ఫరెన్సు హాలులో విడుదల చేశారు. మొత్తం 9.65 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 6.3 లక్షల మంది పాసయ్యారు. 3.3 లక్షల మంది ఫెయిలయ్యారు. 52 వేల మంది గైర్హాజరయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం చూస్తే ఇంటర్‌ ఫస్టియర్‌లో జనరల్‌లో 60 శాతం, వొకేషనల్‌లో 49 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో జనరల్‌లో 72 శాతం, వొకేషనల్‌లో 69 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా, ఇంటర్‌ ఫస్టియర్‌లో 4,76,419 మంది హాజరవ్వగా 2,86,899 (60శాతం) మంది పాసయ్యారు. సెకండియర్లో 4,31,739 పరీక్ష రాయగా 3,09,613 (72శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. గతంలో ఫెయిలై పరీక్ష రాసిన ప్రైవేటు అభ్యర్థులు సెకండియర్లో 48,949 మంది ఉండగా వీరిలో 15,834 మంది ఉత్తీర్ణులయ్యారు.  

సెకండియర్‌ ఫలితాల తీరిదీ 
ఇంటర్‌ సెకండియర్‌ (జనరల్‌)లో బాలికలు 75 శాతం మంది, బాలురు 68 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి మూడుస్థానాల్లో కృష్ణా 81 శాతం, చిత్తూరు 76 శాతంతో తొలి రెండుస్థానాల్లో ఉండగా 61 శాతంతో కడప జిల్లా చిట్టచివరన ఉంది.  

ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల్లో ఉత్తీర్ణత ఇలా.. 
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 65.65 శాతం ఉత్తీర్ణత సాధించగా విజయనగరం జిల్లా 77 శాతం, చిత్తూరు 70 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. గుంటూరు 58 శాతం, విశాఖపట్నం 57 శాతంతో చివరి స్థానాల్లో ఉన్నాయి. ఎయిడెడ్‌ కాలేజీలు 56.16 శాతం ఉత్తీర్ణత సాధించగా చిత్తూరు 75 శాతం, కృష్ణా 68 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. తూర్పుగోదావరి 45 శాతం, విజయనగరం 35 శాతంతో చివరి స్థానంలో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీలు 76.68 శాతం ఉత్తీర్ణతలో ఉండగా కృష్ణా 85 శాతం, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలు  79 శాతంతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కడప 62 శాతం, శ్రీకాకుళం 62 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఏపీఆర్‌జేసీ సంస్థలు 96 శాతం, సోషల్‌ వెల్ఫేర్‌ కాలేజీలు 83.68 శాతం, గిరిజన సంక్షేమ కాలేజీలు 91.49 శాతం, సెంట్రల్‌ గవర్నమెంటు కాలేజీలు 44.44 శాతం, మోడల్‌ స్కూళ్లు 78.10 శాతం, బీసీ రెసిడెన్షియల్‌ కాలేజీలు 89.08 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 

వొకేషనల్‌లోనూ బాలికలే ముందంజ 
ఇంటర్‌ వొకేషనల్‌ విభాగంలోనూ బాలికలే ముందు వరుసలో ఉన్నారు. సెకండియర్లో 69 శాతం మంది ఉత్తీర్ణులవ్వగా వారిలో బాలురు 64 శాతం మంది కాగా బాలికలు 74 శాతం మంది. ఫస్టియర్లో మొత్తం 49 శాతం మంది ఉత్తీర్ణులవ్వగా బాలురు 42 శాతం, బాలికలు 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 

గ్రూపుల వారీగా ఎంపీసీలో ఫెయిల్‌ ఎక్కువ 
ఇక గ్రూపుల వారీగా చూస్తే ఎంపీసీలో ఫెయిలైన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎంపీసీలో 78,421 మంది, బైపీసీలో 23,833 మంది, ఎంఈసీలో 3925 మంది, హెచ్‌ఈసీలో 9,479 మంది, సీఈసీలో 39,038 మంది ఫెయిలయ్యారు. 

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ దరఖాస్తు గడువు 22 
ఈ పరీక్షల్లో విద్యార్థులు రీ కౌంటింగ్, స్కాన్డ్‌ కాపీ కమ్‌ రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేయగోరే వారు ఈనెల 22లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఉదయలక్ష్మి పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఆఫ్‌లైన్లోని దరఖాస్తులను ఆమోదించబోమని స్పష్టంచేశారు. రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.260 చొప్పున, స్కాన్డ్‌ కాపీ, రీవెరిఫికేషన్‌కు అయితే ఒక్కో పేపర్‌కు 1300 చొప్పున చెల్లించాలన్నారు.

మే 14న అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష 
ఫెయిలైన అభ్యర్థులు, ఇంప్రూవ్‌మెంటు కోసం పరీక్ష రాయగోరే అభ్యర్థుల కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షను మే 14న నిర్వహించనున్నట్లు ఉదయలక్ష్మి తెలిపారు. ఈ పరీక్షలకు ఈనెల 24వ తేదీలోగా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.  

ఫస్టియర్‌లోనూ బాలికలదే పైచేయి.. 
కాగా, ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్లో మొత్తం 4,76,419 మంది హాజరవ్వగా 2,86,899 (60 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. కృష్ణా 72 శాతం, పశ్చిమగోదావరి 69 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. అనంతపురం 50 శాతం, కడప 49 శాతంతో చివరి స్థానాల్లో ఉన్నాయి. ఫస్టియర్లో కూడా బాలికలే బాలురకన్నా పైచేయిలో ఉన్నారు. బాలురు 56 శాతం మంది ఉత్తీర్ణులవ్వగా బాలికలు 64 శాతం మంది పాసయ్యారు. ఫస్టియర్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 42.28 శాతం ఉత్తీర్ణత సాధించగా అందులో విజయనగరం 59 శాతం, నెల్లూరు 55 శాతంతో ముందంజలో ఉన్నాయి. గుంటూరు 35 శాతం, విశాఖపట్నం 34 శాతంతో చివరి స్థానాల్లో ఉన్నాయి.

ఎయిడెడ్‌ కాలేజీలు 38.03 శాతం ఉత్తీర్ణత సాధించగా.. పశ్చిమ గోదావరి 53 శాతం, చిత్తూరు, కృష్ణా 51 శాతంతో మొదటి రెండు స్థానాల్లో.. ప్రకాశం 26 శాతం, విజయనగరం 21 శాతంతో చివరి స్థానాల్లో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీలు 66.78 శాతం ఉత్తీర్ణత సాధించగా కృష్ణా 78 శాతం, పశ్చిమ గోదావరి 75 శాతంతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కడప 54 శాతంతో, శ్రీకాకుళం 53 శాతంతో చివరి స్థానాల్లో ఉన్నాయి. ఏపీఆర్‌జేసీ కాలేజీలు 92.41 శాతం, సాంఘిక సంక్షేమ కాలేజీలు 67.55 శాతం, గిరిజన సంక్షేమ కాలేజీలు 77.06 శాతం, కేంద్ర ప్రభుత్వ కాలేజీలు 35.59 శాతం, మోడల్‌ స్కూళ్లు 61.77 శాతం, బీసీ రెసిడెన్షియల్‌ కాలేజీలు 76.37 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ ఏడాది నుంచి కస్తూరిబా బాలికా విద్యాలయాల్లోనూ ఇంటర్మీడియెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ కాలేజీల్లో 30.29 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement