
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల తప్పులతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు బోర్డు నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తులను స్వీకరించిన బోర్డు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం అవుతోంది. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అనేక మంది విద్యార్థుల నుంచి డబ్బు లు కట్ అయినా వారి అప్లికేషన్ నంబరు జనరేట్ కాలేదు. కనీసం బోర్డు హెల్ప్‌లైన్ కేంద్రానికి ఫోన్ చేసి తెలుసుకుందామన్నా అదీ పని చేయకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తమ హెల్ప్‌లైన్ కేంద్రానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని బోర్డు వెబ్‌సైట్‌లో సూచించింది. కానీ అది పని చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వ్యయ ప్రయాసలకోర్చి ఇంటర్ బోర్డుకు వస్తే అక్కడా లోపలికి రానివ్వకపోవడంతో ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇలా అనేక మంది విద్యార్థులకు ఈ సమస్య రావడంతో రీవెరిఫికేషన్ అవుతుందా లేదా అని గందరగోళంలో పడ్డారు. చివరకు హెల్ప్‌డెస్క్ మెయిల్ ఐడీకి ఫిర్యాదు పంపించినా కనీసం దానికి కూడా స్పందన లేదు. పేపర్ వెరిఫికేషన్ కోసం దాదాపు 42 వేల మంది దరఖాస్తు చేసుకుని రుసుం చెల్లించారు. డబ్బులు కట్ అయినా అప్లికేషన్ నంబరు జనరేట్ కాలేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పడ్డారు. తమ జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేస్తారా.. లేదా అన్న ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment