హైదరాబాద్: విధి పరీక్షను చిరునవ్వుతో ఎదుర్కొంటూనే విద్యాభ్యాసం కొనసాగిస్తున్న అవిభక్త కవలలు వీణావాణీలు చదువులో మరో మెట్టెక్కారు. తాజాగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఫస్ట్‌క్లాస్ మార్కులతో (బీ–గ్రేడ్)లో ఉత్తీర్ణులయ్యారు. వీరు మెహిదీపట్నం ఆసిఫ్‌నగర్‌లోని ప్రియాంక మహిళా జూనియర్ కాలేజీలో ఇంటర్ సీఈసీ సబ్జెక్టు చదివారు. వార్షిక పరీక్షలు మాత్రం ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా స్టేట్‌హోంలోని ఆశ్రమంలోనే స్పెషల్ అధికారుల మధ్య నిర్వహించింది.
మారగాని వీణ 707 మార్కులు సాధించగా, మారగాని వాణి 712 మార్కులతో బీ–గ్రేడ్‌లో పాసయ్యారు. పరీక్ష రాసేందుకు వీరిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం స్క్రైబర్స్‌ను ఏర్పాటు చేసినప్పటికీ వారిద్వారా పరీక్ష రాసేందుకు వీణావాణీలు తిరస్కరించారు. విడదీయలేనంతగా తలలు అతుక్కుని జన్మించిన వీణావాణీల స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వీరిశెట్టి గ్రామం. వీరు తొలుత గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి, ఆ తర్వాత హైదరాబాద్ నిలోఫర్‌లో వైద్య చికిత్సలు పొందుతూ వచ్చారు.
ఆస్పత్రుల్లో ఉంటూనే ఇద్దరూ తమ చదువును కొనసాగించారు. 2017 జనవరి నుంచి హైదరాబాద్ వెంగళరావునగర్ స్టేట్ హోంలోని బాలసదన్‌లో ఉంటూ విద్యాభ్యాసం సాగిస్తున్నారు. వీరు ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించడం పట్ల గిరిజన మహిళా, శిశుసంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అభినందించారు.
చదవండి: (TS TET 2022: టెట్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment