veena - vaani
-
దేవుడు అన్యాయం చేసినా.. సీఎం న్యాయం చేస్తున్నారు
వెంగళరావునగర్: అవిభక్త కవలలైన వీణావాణీలకు దేవుడు కొంత అన్యాయం చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన వంతుగా తగిన న్యాయం చేస్తున్నారని మం త్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్ పరీక్షల్లో వీణావాణీలు ఫస్ట్‌క్లాస్ మార్కులతో బీ–గ్రేడ్‌లో పాసైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధ వారం మధురానగర్‌లోని మహిళా శిశుసం క్షేమ శాఖ కార్యాలయం శిశువిహార్‌లో ఆశ్రయం పొందుతున్న వీరిని మంత్రులు కలిశారు. తొలుత వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత చదువులు ఏం చదవాలని అనుకుంటు న్నారని వీణావాణీలను ప్రశ్నించగా.. దానికి వారు తాము సీఏ చదవాలని అనుకుంటున్నామని సమాధానం చెప్పారు. కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే పరిస్థితి లేని కారణంగా సీఏ చదివితే ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వారి మాటలకు స్పందించిన మంత్రులు తప్పనిసరిగా మీ చదువులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే వీణావాణీల తల్లికి ఇక్కడే ఉద్యోగం ఇచ్చారు. వీణావాణీలు సీఏ చదవడానికి శ్రీమేధ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా కోర్సులు ఇప్పిస్తున్నామని, వారికి కావాల్సిన ల్యాప్‌టాప్‌లు కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్లో ఫస్ట్‌క్లాస్ సాధించిన అవిభక్త కవలలు వీణ-వాణి
హైదరాబాద్: విధి పరీక్షను చిరునవ్వుతో ఎదుర్కొంటూనే విద్యాభ్యాసం కొనసాగిస్తున్న అవిభక్త కవలలు వీణావాణీలు చదువులో మరో మెట్టెక్కారు. తాజాగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఫస్ట్‌క్లాస్ మార్కులతో (బీ–గ్రేడ్)లో ఉత్తీర్ణులయ్యారు. వీరు మెహిదీపట్నం ఆసిఫ్‌నగర్‌లోని ప్రియాంక మహిళా జూనియర్ కాలేజీలో ఇంటర్ సీఈసీ సబ్జెక్టు చదివారు. వార్షిక పరీక్షలు మాత్రం ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా స్టేట్‌హోంలోని ఆశ్రమంలోనే స్పెషల్ అధికారుల మధ్య నిర్వహించింది. మారగాని వీణ 707 మార్కులు సాధించగా, మారగాని వాణి 712 మార్కులతో బీ–గ్రేడ్‌లో పాసయ్యారు. పరీక్ష రాసేందుకు వీరిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం స్క్రైబర్స్‌ను ఏర్పాటు చేసినప్పటికీ వారిద్వారా పరీక్ష రాసేందుకు వీణావాణీలు తిరస్కరించారు. విడదీయలేనంతగా తలలు అతుక్కుని జన్మించిన వీణావాణీల స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వీరిశెట్టి గ్రామం. వీరు తొలుత గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి, ఆ తర్వాత హైదరాబాద్ నిలోఫర్‌లో వైద్య చికిత్సలు పొందుతూ వచ్చారు. ఆస్పత్రుల్లో ఉంటూనే ఇద్దరూ తమ చదువును కొనసాగించారు. 2017 జనవరి నుంచి హైదరాబాద్ వెంగళరావునగర్ స్టేట్ హోంలోని బాలసదన్‌లో ఉంటూ విద్యాభ్యాసం సాగిస్తున్నారు. వీరు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించడం పట్ల గిరిజన మహిళా, శిశుసంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అభినందించారు. చదవండి: (TS TET 2022: టెట్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక ప్రకటన) -
స్వయంగా పరీక్ష రాసిన వీణావాణీలు
వెంగళరావునగర్: విధి పరీక్షను చిర్నవ్వుతో ఎదుర్కొంటూనే పాఠాలు నేర్చుకున్న అవిభక్త కవలలైన వీణావాణీలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన టెన్త్ పరీక్షలకు హాజరై తమ ఆత్మస్థైర్యాన్ని చాటి తమలాంటి మరెందరికో స్ఫూర్తినిచ్చారు. స్టేట్‌హోంలోని బాలసదన్ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలో ఉన్న ప్రతిభా హైస్కూల్లోని పరీక్షా కేంద్రానికి ఉదయం 8.45 గంటలకు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా వీరిని తీసుకొచ్చారు. బాలసదన్ ఇన్చార్జి సఫియా బేగంతో పాటు మరో సహాయకురాలు వీరితో పాటు వెంటవచ్చారు. పరీక్ష రాసేందుకు వీరిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం స్క్రైబర్స్‌ను ఏర్పాటు చేసినప్పటికీ వారిద్వారా పరీక్ష రాసేందుకు వీణావాణీలు తిరస్కరించారు. దీంతో వీణావాణీలు స్వయంగానే తెలుగు పరీక్షను రాశారు. నంబర్లు కన్పించక కొద్దిసేపు అయోమయం కాగా, పరీక్షలు రాయడానికి ఏర్పాటు చేసిన గదులు, విద్యార్థుల హాల్‌టికెట్ల నంబర్లతో అంటించిన నోటీసు బోర్డులో వీణావాణీల హాల్ టికెట్ నంబర్లు లేకపోవడంతో కొద్దిసేపు అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రతిభా హైస్కూల్లో 11 గదులను (2022188183 నుంచి 2022188402 వరకు) ఏర్పాటు చేశారు. అయితే వీణావాణీల నంబర్ మాత్రం 2022188403/404గా ఉన్నాయి. వారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో నోటీసుబోర్డులో అంటించలేదని స్కూల్ నిర్వాహకులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
గంట ముందే రండి
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం పూర్తి చేసింది. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్ష సమయం కంటే కనీసం గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆలస్యంగా వెళ్లి నష్టపోవద్దని స్పష్టం చేశారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు మాస్క్‌లు ధరించాలని, వాటర్ బాటిళ్లను అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సబ్బులు, లిక్విడ్ సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్న వారు ప్రత్యేక గదుల్లో పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ఎవరి సంతకం అవసరం లేకుండానే అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సమస్యలు ఉంటే తమ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌కు (040–23230942) ఫోన్ చేయవచ్చని సూచించారు. అవిభక్త కవలలు వీణావాణీలకు స్టేట్ హోం సమీపంలోని పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, వారు సొంతంగా పరీక్ష రాస్తామని మొదట్లో చెప్పినా అది సాధ్యమయ్యే పరిస్థితి లేదన్నారు. అందుకే వారి విజ్ఞప్తి మేరకు సహాయకులను (స్క్రైబ్స్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణ పరీక్ష సమయం కంటే వారికి అదనంగా అరగంట సమయం ఇస్తామని తెలిపారు. -
మేమే రాస్తాం.. సాయం వద్దు!
సాక్షి, హైదరాబాద్/వెంగళ్రావునగర్: అవిభక్త కవలలు వీణావాణిలు ఈ నెల 19 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యాశాఖ వేర్వేరుగా జారీ చేసిన హాల్ టికెట్లను పాఠశాల అధ్యాపకులు శుక్రవారం వారికి అందజేశారు. జబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వీణావాణిలకు మినహాయింపునిచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు వారిద్దరికీ వెంగళ్ రావునగర్ స్టేట్‌హోంకు సమీపంలోని మధురానగర్‌కాలనీలో ప్రతిభా హైస్కూల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. అధికారుల పర్యవేక్షణలో నేలపై కూర్చొని పరీక్ష రాయనున్నారు. వేర్వేరు హాల్‌టికెట్లు.. మహిళా శిశుసంక్షే మ అధికారులు 2018లో వీణావాణిలకు వెంగళ్రావునగర్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కల్పించారు. వీరికి వేర్వేరు అడ్మిషన్ నంబర్లు ఇచ్చారు. ఇటీవల వారు ఎస్ఎస్సీ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా, పరీక్ష రాసే అర్హత, శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నట్లు నిర్ధారించుకున్న అధికారులు ఇద్దరికీ వేర్వేరు హాల్‌టికెట్లు జారీ చేశారు. వారు కోరితే స్క్రైబ్(సహాయకులు)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమకు ఎవరి సహాయం అవసరం లేదని, తామే స్వయంగా పరీక్ష రాస్తామని వీణావాణిలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రత్యేక గదిని సిద్ధం చేస్తాం వీణావాణిలు మా పాఠశాలలో పరీక్షలు రాయనున్నట్లు ఈరోజే తెలిసింది. విద్యాశాఖ వారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయమని సూచిస్తే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. – రాంబాబు, ప్రతిభా హైస్కూల్ చైర్మన్ -
మా ఇద్దరి కోరిక అదే!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని ఉందని అవిభక్త కవలలు వీణా– వాణీ తెలిపారు. భవిష్యత్తులో ఇంజినీర్, సైంటిస్ట్ కావాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న వీరి బాగోగులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటోంది. ఆపరేషన్ చేసి వీణా– వాణీలను విడదీయాలని ప్రభుత్వానికి తండ్రి మురళి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది తన పిల్లలిద్దరూ విడివిడిగా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అవిభక్త కవలలుగా పుట్టిన వీణా-వాణీలను విడదేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలించలేదు. విదేశాల నుంచి కూడా వైద్యులు వచ్చి వీరిని పరీక్షించారు. కానీ వారికి ఆపరేషన్ చేస్తే బతికే అవకాశాలు తక్కువని వైద్యులు అభిప్రాయపడడంతో వెనకడుగు వేయాల్సి వచ్చింది. పుట్టినప్పటి నుంచి నీలోఫర్ ఆసుపత్రిలోనే ఎక్కువ కాలం గడిపిన ఈ చిన్నారులను తర్వాత స్టేట్‌హోం తరలించారు. గతేడాది ఐదో తరగతి చదివిన వీణా–వాణీలకు ఐక్యూ బాగుండటంతో ఈ ఏడాది ఏడో తరగతికి ప్రమోట్ చేశారు. -
వీణా-వాణిల ఆపరేషన్‌పై త్వరలో నిర్ణయం
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా - వాణిల ఆపరేషన్ కు సంబంధించిన నివేదికను లండన్ వైద్యులు...హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి పంపించారు. లండన్ వైద్యుల నుంచి అందుకున్న ఈ నివేదికను నిలోఫర్ వైద్యులు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు వీణా - వాణిల ఆపరేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. వీణా-వాణీలకు దాదాపు ఐదు విడతల్లో సర్జరీలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు 9 నుంచి 12 నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉందని లండన్ వైద్యులు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. తాము ఇప్పటివరకు రెండుసార్లు అవిభక్త కవలలకు ఆపరేషన్లు చేశామని, వేరుపడ్డ ఆ నలుగురు కవలలు ఇప్పుడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. -
వీణా-వాణిల ఆపరేషన్‌పై త్వరలో నిర్ణయం