
సాక్షి, హైదరాబాద్/వెంగళ్‌రావునగర్: అవిభక్త కవలలు వీణావాణిలు ఈ నెల 19 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యాశాఖ వేర్వేరుగా జారీ చేసిన హాల్ టికెట్లను పాఠశాల అధ్యాపకులు శుక్రవారం వారికి అందజేశారు. జబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వీణావాణిలకు మినహాయింపునిచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు వారిద్దరికీ వెంగళ్ రావునగర్ స్టేట్‌హోంకు సమీపంలోని మధురానగర్‌కాలనీలో ప్రతిభా హైస్కూల్‌లో పరీక్ష కేంద్రం కేటాయించారు. అధికారుల పర్యవేక్షణలో నేలపై కూర్చొని పరీక్ష రాయనున్నారు.
వేర్వేరు హాల్‌టికెట్లు..
మహిళా శిశుసంక్షే మ అధికారులు 2018లో వీణావాణిలకు వెంగళ్‌రావునగర్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కల్పించారు. వీరికి వేర్వేరు అడ్మిషన్ నంబర్లు ఇచ్చారు. ఇటీవల వారు ఎస్‌ఎస్‌సీ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా, పరీక్ష రాసే అర్హత, శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నట్లు నిర్ధారించుకున్న అధికారులు ఇద్దరికీ వేర్వేరు హాల్‌టికెట్లు జారీ చేశారు. వారు కోరితే స్క్రైబ్(సహాయకులు)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమకు ఎవరి సహాయం అవసరం లేదని, తామే స్వయంగా పరీక్ష రాస్తామని వీణావాణిలు స్పష్టం చేసినట్లు తెలిసింది.
ప్రత్యేక గదిని సిద్ధం చేస్తాం
వీణావాణిలు మా పాఠశాలలో పరీక్షలు రాయనున్నట్లు ఈరోజే తెలిసింది. విద్యాశాఖ వారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయమని సూచిస్తే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం.
– రాంబాబు, ప్రతిభా హైస్కూల్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment