
కడప సిటీ: ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు జూన్ 7 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో పదో తరగతి సిలబస్ మొత్తం పూర్తయినందున విద్యార్థులకు మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులను ఇస్తున్నామన్నారు. జూన్ 1 నుంచి టీచర్లు బడికి రావాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేశారన్నారు. కడప కలెక్టరేట్‌లో సోమవారం కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సురేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 30 జూనియర్ కళాశాలలకు, పదో తరగతి విద్యార్థులకు చివరి పని దినమని చెప్పారు. విద్యార్థులు సెలవుల్లో ఇంటి పట్టునే ఉండి పరీక్షలకు బాగా సిద్ధమవ్వాలని సూచించారు. అవసరమైన మేరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. కోవిడ్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ›ప్రభుత్వం అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఎల్లో మీడియా కావాలనే కోవిడ్‌పై రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.