సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను జూలై 10 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన విద్యా శాఖ.. కరోనా నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. 11 పేపర్లను ఆరుకు కుదించిన ఎస్‌ఎస్‌సీ బోర్డు అందుకు సంబంధించిన సెక్షన్లు, ప్రశ్నల తీరు, మార్కులు ఎలా ఉంటాయో పేర్కొంటూ ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ మాదిరి పత్రాలను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. శనివారం తెలుగు, హిందీ మార్కుల మాదిరి పత్రాలతో పాటు ఆయా పేపర్లకు సంబంధించిన మాదిరి ప్రశ్నపత్రాలను కూడా విడుదల చేసినట్లు బోర్డు డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు.
ఆ వివరాలివీ..
► తెలుగు పేపర్ సమయం 3.15 గంటలు. గతంలోని రెండు పేపర్లను కలిపి 100 మార్కులకు ఒకే పేపర్‌గా ఉంటుంది. విభాగం–1లో అవగాహన, ప్రతిస్పందన కింద 32 మార్కులకు ప్రశ్నలుంటాయి. వీటిలో 4 వ్యాసరూప ప్రశ్నలు కాగా.. ఒక్కో దానికి 8 మార్కులు ఇస్తారు. పేపర్–1 నుంచి 16 మార్కులకు, పేపర్–2 నుంచి 16 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
► విభాగం–2లో వ్యక్తీకరణ, సృజనాత్మకత కింద 36 మార్కులకు ప్రశ్నలుంటాయి. వీటిలో లఘు సమాధాన ప్రశ్నలు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 3 ఉంటాయి. ఇదే విభాగంలో ఒక్కొక్కటి 8 మార్కుల చొప్పున 3 వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఇందులోనూ పేపర్–1 నుంచి 16 మార్కులకు, పేపర్–2 నుంచి 20 మార్కులకు ప్రశ్నలుంటాయి.
► విభాగం–3లో 36 మార్కులకు పలు భాషాంశాల ప్రశ్నలను అడుగుతారు. అతి లఘు, లక్ష్యాత్మక ప్రశ్నలుగా ఇవి ఉంటాయి. పేపర్–1 మార్కులకు, పేపర్–2 నుంచి 14 మార్కులకు ప్రశ్నలుంటాయి.
► హిందీ పేపర్‌లోని మార్కుల మాదిరి ప్రశ్నపత్రాన్ని బోర్డు విడుదల చేసింది. ఇందులో 4 నిబంధనాత్మక ప్రశ్నలు 36 మార్కులకు ఉంటాయి. లఘు ఉత్తరాత్మక ప్రశ్నలు 28 మార్కులకు 6 ఉంటాయి. అతి లఘు ఉత్తరాత్మక ప్రశ్నలు 8 ఉప విభాగాలుగా 24 మార్కులకు ఉంటాయి. లక్ష్యాత్మక ప్రశ్నలు 12 మార్కులకు ఉంటాయి.
ఇవీ మార్గదర్శకాలు
► టెన్త్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు అన్ని జిల్లాల డీఈవోలకు మార్గదర్శకాలు పంపింది.
► కోవిడ్–19 నేపథ్యంలో అదనంగా పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు వీలుగా అనువైన పాఠశాలలతోపాటుజూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలను కూడా గుర్తించాలని పేర్కొంది. ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని సంస్థలను కూడా గుర్తించాలని స్పష్టం చేసింది.
► డిప్యూటీ డీఈవో, ఎంఈవో, హెడ్మాస్టర్లతో కూడిన బృందం కోవిడ్–19 ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఆయా సంస్థలను గుర్తించాలని, ఒక్కో బృందం 20 సెంటర్లను సందర్శించాలి.
► కోవిడ్–19 కోసం క్వారంటైన్ కేంద్రాలుగా ఉన్న వాటిని మినహాయించాలి.
► ఈనెల 18వ తేదీ నాటికి ఆయా కేంద్రాల సమాచారాన్ని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌కు సమర్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment