Class 10 Telugu Exam Question Paper Leaked In Telangana - Sakshi
Sakshi News home page

టెన్త్‌ పేపర్‌ అవుట్‌

Published Tue, Apr 4 2023 2:46 AM | Last Updated on Tue, Apr 4 2023 1:08 PM

Tenth Exam Telugu Paper Leak In Telangana - Sakshi

ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కార్యాలయం బోర్డు

సాక్షి, హైదరాబాద్‌/ వికారాబాద్‌/ తాండూరు: టెన్త్‌ పరీక్షల తొలిరోజు.. పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. ఓ పాఠశాలలోని ఇన్విజిలేటర్‌ క్వశ్చన్‌ పేపర్‌ ఫొటోలు తీసి వాట్సాప్‌ ద్వారా మరో పాఠశాలలోని టీచర్‌కు పంపాడు. అతను ఇతర గ్రూపులకు పంపడంతో విషయం వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ప్రాథమిక విచారణ అనంతరం ఇద్దరు ఉపాధ్యాయులు సహా నలుగురిపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. ప్రైవేట్‌ స్కూళ్ల పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు విద్యాశాఖ ఆదేశించింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, వికారాబాద్‌ కలెక్టర్‌ వివరాలు వెల్లడించారు. 

అసలేం జరిగింది? 
పదవ తరగతి పరీక్షలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు తెలుగు పరీక్ష కోసం విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 9.30 నుంచి 12.30 గంటల వరకు జరిగే పరీక్ష కోసం 9.30కి ఇన్విజిలేటర్లు వారికి ప్రశ్నపత్రాలు ఇచ్చారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల–1లోని 5వ నంబర్‌ పరీక్ష హాల్లో కూడా అలాగే ఇచ్చారు.

ఆ గదిలో శ్రీనివాసులు ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్నారు. అయితే అదే పాఠశాలలో రిలీవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బందెప్ప రూమ్‌ నంబర్‌ ఐదుకు వచ్చాడు. గైరుహాజరైన ఓ విద్యార్థికి చెందిన క్వశ్చన్‌ పేపర్‌ తీసుకుని శ్రీనివాసులుకు తెలియకుండా తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నాడు. తొలుత పొరపాటున ఓ వాట్సాప్‌ గ్రూప్‌కు పంపి వెంటనే డిలిట్‌ చేశాడు.

9.37 సమయంలో చెంగోల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సమ్మప్పకు వాట్సాప్‌ ద్వారా పంపాడు. అతని ద్వారా ప్రశ్నపత్రం వేరే ఇతర వాట్సాప్‌ గ్రూపులకు,  11: 30 ప్రాంతంలో ఓ మీడియా వాట్సాప్‌ గ్రూప్‌కు వెళ్లింది. విలేకరులు కొందరు మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు అలాంటిదేమీ లేదని అన్నారు. కానీ పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థుల వద్ద ఉన్న పేపర్‌తో పోల్చి చూస్తే నిజమేనని తేలింది. దీంతో వారు అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

క్రిమినల్‌ కేసుల నమోదు 
ఈ వ్యవహారంలో నలుగురిని సస్పెండ్‌ చేశామని, వీరిలో ఇద్దరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి విచారిస్తున్నామని వికారాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి సోమవారం సాయంత్రం విలేకరులకు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, విద్యాశాఖ అధికారులు, అదనపు కలెక్టర్‌ను రంగంలోకి దింపామని తెలిపారు. విచారణలో తాండూరు–1 స్కూల్‌ నుంచి పేపర్‌ లీకైనట్లు గుర్తించామన్నారు.

పేపర్‌ ఫోటోలు తీసిన బందెప్పతో పాటు అతను పేపర్‌ సెండ్‌ చేసిన సమ్మప్పను విధుల నుంచి తొలగించి, క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లను అనుమతించిన సెంటర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ శివకుమార్‌ (ముద్దాయిపేట, యాలాల మండలం), చీఫ్‌ సూపరింటెండెంట్‌ కె.గోపాల్‌ (తాండూరు హైస్కూల్‌–1)ను కూడా సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రశ్నపత్రాన్ని ఫొటోలు తీసిన విషయాన్ని గమనించడంలో విఫలమైన శ్రీనివాస్‌ను ఇన్విజిలేషన్‌ విధుల నుంచి తొలగించటంతో పాటు అతనిపై కూడా తదుపరి విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించామని తెలిపారు. లీకైన పేపర్‌ను ఉపయోగించి మాస్‌ కాపీయింగ్‌ చేసినట్లుగా ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించలేదని కలెక్టర్‌ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్‌ ఫొటోలు తీసి మరో ఉపాధ్యాయుడికి పంపినప్పటికీ.. విద్యార్థులు ఆ పేపర్‌ ద్వారా కాపీయింగ్‌కు పాల్పడినట్టు తేలలేదని స్పష్టం చేశారు.  

ప్రశ్నపత్రం బయటకు వాస్తవమే.. 
టెన్త్‌ ప్రశ్నపత్రం లీక్‌పై పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన స్పందించారు. తాండూరు హైస్కూల్‌–1 నుంచి ప్రశ్నపత్రం మరో టీచర్‌కు వెళ్ళిన మాట వాస్తవమేనని ఆమె తెలిపారు. అయితే పరీక్ష సమయంలో ఇతరులెవరూ లోపలికి రాలేదని, లోపలి నుంచి ఎవరూ బయటకు వెళ్ళలేదని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ సమగ్ర విచారణ జరిపారని, బాధ్యులపై చర్యలు తీసుకున్నారని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. మిగతా పరీక్షలన్నీ యధాతథంగా జరుగుతాయని తెలిపారు.  

ప్రైవేటు స్కూళ్లతో మిలాఖత్‌? 
ప్రశ్నపత్రం బయటకు వెళ్లిన వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు కూడా పరీక్ష హాల్లోకి సెల్‌ఫోన్‌ తీసుకెళ్ళడం నిషేధం. అలాంటిది ఓ ఇన్విజిలేటర్‌ ఎలా తీసుకెళ్ళాడనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. అయితే అతని సెల్‌ఫోన్‌ ద్వారా వెళ్ళిన ప్రశ్నపత్రం ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులకు కూడా వెళ్ళినట్టు అనుమానిస్తున్న పోలీసు వర్గాలు ఈ దిశగా విచారణ చేపట్టాయి.  

ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి యత్నం  
టెన్త్‌ ప్రశ్నపత్రం లీకేజీపై నిరసన వ్యక్తం చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి ప్రయత్నించింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అబిడ్స్‌ పోలీస్టేషన్‌కు తరలించారు. విద్యాశాఖ కార్యాలయం ఎదుట కూడా ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లీకేజీపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆర్‌ఎల్‌ మూర్తి, టి.నాగరాజు డిమాండ్‌ చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు.  

గతంలోనూ వివాదాస్పదుడే.. 
తాండూరు నంబర్‌–1 పాఠశాలలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న బందెప్పకు వివాదాస్పదుడిగా పేరుంది. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు స్కూల్‌ ఆవరణలోనే దేహశుద్ధి చేశారు. అప్పట్లో అతనిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. తాజాగా ప్రశ్నప్రతం లీక్‌ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement