సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల విషయంలో పాఠశాల విద్యాశాఖ డొల్లతనం అడుగడుగున బయటపడుతోంది. ఈ శాఖ నిర్లక్ష్య వైఖరే సమస్యకు కారణమనే వాదన బలపడుతోంది. తెలుగు, హిందీ పేపర్ లీక్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. పరీక్షల నిబంధనలు, విద్యాశాఖ తీసుకున్న జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును ఇంటెలిజెన్స్ ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది.
పరీక్షల సందర్భంగా ఉండే సాధారణ నిబంధనలను క్షేత్రస్థాయికి పంపడం మినహా, ఎక్కడ, ఎలాంటి లోపాలున్నాయో వాకబు చేయడం, దానికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లాంటివేమీ చేపట్టలేని నిఘా వర్గాల పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది. ఈ నివేదికపై సీఎస్ తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారుల వివరణ కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
అంతటా వైఫల్యమే..
హనుమకొండ జిల్లాలో స్కూల్ అవరణలోకి వేరే వ్యక్తి వచ్చి ఫోటోలు తీసే అవకాశం ఉన్న పరిస్థితిని గుర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. పోలీసు పహారా కూడా ఉంటుంది. అయినప్పటికీ పరీక్ష కేంద్రం సమీపంలోకి ఇతరులు రావడం భద్రత వైఫల్యానికి అద్దంపడుతోంది.
పరీక్షా కేంద్రానికి సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలనే ఆదేశాలున్నాయి. కానీ వరంగల్ ఘటనలో ప్రశ్నపత్రాన్ని జిరాక్స్ తీసినట్టు పోలీసు వర్గాల విచారణలో తేలింది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో ఇన్విజిలేటర్ సెల్‌ఫోన్ తీసుకుని వెళ్ళినా, పై అధికారులు గుర్తించకపోవడం, సీసీ కెమెరాలున్నా నిష్ప్రయోజనంగా మారడం వైఫల్యాలకు అద్దం పడుతోంది.
కొన్నేళ్ళుగా నడుస్తోందా?
టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అనేక కొత్త అంశాలను ఇంటెలిజెన్స్ నివేదిక ప్రస్తావించినట్టు తెలిసింది. లీకేజీకి పాల్పడిన టీచర్లకు గతంలో నేర చరిత్ర ఉండటాన్ని ఎత్తి చూపినట్లు చెబుతున్నారు. తాండూరులో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపిన బందెప్పపై గతంలోనే పోక్సో కేసు నమోదయ్యింది. ఇలాంటి టీచర్ల ప్రతి రిమార్క్ కంప్యూటర్‌లో నిక్షిప్తమవుతుంది.
టీచర్ల సర్విస్ రికార్డును పరిశీలించిన తర్వాతే విద్యాశాఖ కీలకమైన బాధ్యతల్లోకి తీసుకుంటుంది. పరీక్షల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కానీ బందెప్ప విషయంలో దీన్ని విస్మరించడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. కాగా లీకేజీల వ్యవహారం కొన్నేళ్ళుగా నడుస్తోందా? అనే అనుమానాలకు కూడా ఇది తావిస్తోందని అంటున్నారు. కాగా ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలనే దానిపై పాఠశాల విద్య వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment