Xerox centers
-
నిర్లక్ష్యం ఫలితమేనా?
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల విషయంలో పాఠశాల విద్యాశాఖ డొల్లతనం అడుగడుగున బయటపడుతోంది. ఈ శాఖ నిర్లక్ష్య వైఖరే సమస్యకు కారణమనే వాదన బలపడుతోంది. తెలుగు, హిందీ పేపర్ లీక్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. పరీక్షల నిబంధనలు, విద్యాశాఖ తీసుకున్న జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును ఇంటెలిజెన్స్ ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. పరీక్షల సందర్భంగా ఉండే సాధారణ నిబంధనలను క్షేత్రస్థాయికి పంపడం మినహా, ఎక్కడ, ఎలాంటి లోపాలున్నాయో వాకబు చేయడం, దానికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లాంటివేమీ చేపట్టలేని నిఘా వర్గాల పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది. ఈ నివేదికపై సీఎస్ తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారుల వివరణ కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంతటా వైఫల్యమే.. హనుమకొండ జిల్లాలో స్కూల్ అవరణలోకి వేరే వ్యక్తి వచ్చి ఫోటోలు తీసే అవకాశం ఉన్న పరిస్థితిని గుర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. పోలీసు పహారా కూడా ఉంటుంది. అయినప్పటికీ పరీక్ష కేంద్రం సమీపంలోకి ఇతరులు రావడం భద్రత వైఫల్యానికి అద్దంపడుతోంది. పరీక్షా కేంద్రానికి సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలనే ఆదేశాలున్నాయి. కానీ వరంగల్ ఘటనలో ప్రశ్నపత్రాన్ని జిరాక్స్ తీసినట్టు పోలీసు వర్గాల విచారణలో తేలింది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో ఇన్విజిలేటర్ సెల్‌ఫోన్ తీసుకుని వెళ్ళినా, పై అధికారులు గుర్తించకపోవడం, సీసీ కెమెరాలున్నా నిష్ప్రయోజనంగా మారడం వైఫల్యాలకు అద్దం పడుతోంది. కొన్నేళ్ళుగా నడుస్తోందా? టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అనేక కొత్త అంశాలను ఇంటెలిజెన్స్ నివేదిక ప్రస్తావించినట్టు తెలిసింది. లీకేజీకి పాల్పడిన టీచర్లకు గతంలో నేర చరిత్ర ఉండటాన్ని ఎత్తి చూపినట్లు చెబుతున్నారు. తాండూరులో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపిన బందెప్పపై గతంలోనే పోక్సో కేసు నమోదయ్యింది. ఇలాంటి టీచర్ల ప్రతి రిమార్క్ కంప్యూటర్లో నిక్షిప్తమవుతుంది. టీచర్ల సర్విస్ రికార్డును పరిశీలించిన తర్వాతే విద్యాశాఖ కీలకమైన బాధ్యతల్లోకి తీసుకుంటుంది. పరీక్షల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కానీ బందెప్ప విషయంలో దీన్ని విస్మరించడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. కాగా లీకేజీల వ్యవహారం కొన్నేళ్ళుగా నడుస్తోందా? అనే అనుమానాలకు కూడా ఇది తావిస్తోందని అంటున్నారు. కాగా ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలనే దానిపై పాఠశాల విద్య వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. -
పది గంటలకే ప్రశ్నపత్రం లీక్
చిలమత్తూరు: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పేపర్-2 పరీక్ష పత్రం ప్రారంభమైన గంటకే బిట్ పేపర్‌తో కలిపి బయటకు వచ్చింది. ఇది జిరాక్స్ సెంటర్లకు చేరుకోవడంతో సమాధానాలు బయట నుంచి పరీక్ష కేంద్రంలోకి వెళ్లిపోయాయి. తెలుగు పేపర్-1 పరీక్ష రోజు కూడా వాట్సప్ ద్వారా ప్రశ్నపత్రం, బిట్ పేపర్ బయటకు వచ్చాయి. ఈ విషయమై పరీక్ష నిర్వహణ అధికారులను ప్రశ్నిస్తే ఎవరు లీక్ చేస్తున్నారో తెలియదన్నారు. మంగళవారం నుంచి పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు. సోమఘట్ట, కొడికొండ, కోడూరు, ఉర్దూ, చిలమత్తూరు, కేజీబీవీ, గురుకుల పాఠశాల, గాడ్రాళ్లపల్లి ఉన్నత పాఠశాల నుంచి దాదాపు 534 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. -
రాజకీయ ‘ఆసరా’
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం కొందరి కారణంగా అభాసుపాలవుతోంది. అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాలనే సర్కారు లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. అర్హులైన వికలాంగ, వృద్ధ, వితంతువులకు పింఛన్లు అందించాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ఆసరా పథకంలో కొందరు నేతల ప్రమేయంతో అనర్హులు సైతం లబ్ధిపొందుతున్నారు. అర్హులు మాత్రం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చివరకు గ్రామ సభల్లో ఏర్పాటు చేసిన జాబితాల్లో రాజకీయ రంగు బయట పడింది. దీంతో ఆయా గ్రామాల్లో రాజకీయ నేతల మధ్య వైరుధ్యాలు మొదలయ్యాయి. రాజకీయ నేతల అండదండలతో.. ఆసరా పథకం అమల్లో పలు గ్రామాల్లో స్థానిక రాజకీయ నాయకుల హవా కొనసాగిందనడానికి నిదర్శనమే అనర్హులకు పింఛన్లు మంజూరు కావడం. పలు పంచాయతీల్లో మండల స్థాయి నాయకులు ఆయా అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేసి తమకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులకు స్థానం కల్పించినట్లు తెలుస్తోంది. పలు పంచాయతీల్లో ఈ పథకంపై పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అనర్హులకు ఎందుకు ఇస్తున్నారని అధికారులను సైతం నిలదీస్తున్నారు. ఒక పార్టీపై ఇతర పార్టీల నేతలు అనర్హుల జాబితాను అధికారులకు అందజేస్తుండటంతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైంది. స్థానిక నాయకులు రాజకీయంగా లబ్ధిపొందేందుకు అనర్హులకు సైతం పింఛన్లు అందించేందుకు అధికారులతో మిలాఖత్ అయ్యి ఈ తతంగానికి తెరతీసినట్లు తెలుస్తోంది. పట్టుబడిన నకిలీలు ‘ఆసరా’ కోసం పలువురు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఆధార్‌లోని వయస్సును మార్చి పట్టుబడిన సంఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ జరుగుతున్నానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చింతకాని మండల నాగులవంచ కేంద్రంగా నకిలీలు సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే ఖమ్మం రూరల్ మండల పరిధిలోని కరుణగిరి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం తదితర ప్రాంతాల్లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు సదరం సర్టిఫికెట్లలో వైకల్యం ఎక్కువగా నమోదు చేస్తూ నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల అడ్డాగా జిరాక్స్ సెంటర్లు ఆసరా పథకంలో అర్హులకు ఓ పక్క అన్యాయం జరుగుతుండగా మరో పక్క అనర్హులకు అవకాశం కల్పిస్తోంది. స్థానిక రాజకీయ నేతలతో పాటు ఆయా ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆసరా పథకంలో వృద్ధుల పింఛన్లు పొందేందుకు ఆధార్‌లో వయస్సు ప్రమాణికంగా తీసుకోవటంతో జిరాక్స్ సెంటర్లలో కార్డులు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయం పలు మండలాల్లో తేటతెల్లమైంది. దీంతో అర్హుల జాబితాలో అనర్హులకు స్థానం లభిస్తోంది. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం ఆసరా పథకంలో అనర్హులకు లబ్ధిచేకూరిందనే ఆరోపణలతో గ్రామాల్లో ఘర్షణవాతావరణం నెలకొంది. లక్షల ఆస్తులు కలిగిన బడా భూస్వాములకు లబ్ధి చేకూర్చడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి రాజకీయ నాయకుల అండదండలే కారణమని ఆరోపిస్తున్నారు. ఆసరా సర్వేలో ఇంటింటికి తిరగకుండా అనర్హులకు లబ్ధికూరేలా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ రాజకీయం తీవ్ర స్థాయిలో వేడిక్కింది. ఒకానొక దశలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు మండల, జిల్లా స్థాయి అధికారులు సైతం ఒకరిపై ఒకరు అనర్హుల జాబితాను అందజేస్తున్నారు. దీంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఇటు అధికార పార్టీ నాయకులకు, ప్రతిపక్ష పార్టీల నాయకులకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. -
బతుకులు కుదేలు!
వికారాబాద్, చేవెళ్ల పట్టణాల్లో జిరాక్స్ సెంటర్లు, ఆన్లైన్ సెంటర్లు, వెల్డింగ్ షాపులు, ఫొటో స్టూడియో ల్యాబ్‌లు, వడ్రంగి షాపులు తదితర విద్యుత్‌తో నడిచే చిన్న పరిశ్రమలు కుదేలవుతున్నాయి. పగటిపూట 8 గంటల కోత విధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా అంతకుమించే సరఫరా ఉండడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. సింగిల్‌ఫేజ్ సరఫరా కూడా నిలిపివేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని గృహ వినియోగదారులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణం. 12 గంటల విద్యుత్ కోతను విధిస్తున్నారు. అంటే పగలు అసలే విద్యుత్ సరఫరా ఉండదన్నమాట. 7 గంటలు ఒట్టిమాట రైతులకు వ్యవసాయానికి ఏడు గంటల కరెంటు సరఫరా చేస్తున్నామన్న ప్రభుత్వం ఇటీవల కాలంలో 6 గంటలకు తగ్గించింది. కానీ ఆరు గంటలు కూడా విద్యుత్ సక్రమ సరఫరా కావడంలేదని రైతులు వాపోతున్నారు. నాలుగు నుంచి ఐదు గంటలే విద్యుత్ సరఫరా అవుతున్నదని వారు పేర్కొంటున్నారు. ఇటు వర్షాలు పడక, అటు అటు విద్యుత్ కోతతో వ్యవసాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసైనా సరే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాగునీటి తిప్పలు గ్రామాల్లో మంచినీటి బోరుమోటార్లు కరెంట్ కోతతో పనిచేయడంలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తాగునీటి ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఉదయం పూట కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులకు, పాఠశాల విద్యార్థులకు ఆలస్యమవుతోంది. రాత్రి వేళల్లో కరెంట్ లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు దోమల బెడదతో బాధపడుతున్నారు. విద్యుత్ కోతలపై అధికారులను అడిగితే కోతలుపై నుంచే ఉన్నాయని పేర్కొంటున్నారు. -
అరె కరెంటు రాదే !
సాక్షి,సిటీబ్యూరో: ఓ వైపు ఉక్కపోత..మరోవైపు ఇష్టానుసారం కరెంటు తీస్తుండడంతో గత కొద్దిరోజులుగా నగరవాసులు నానాయాతన పడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో అధికారిక విద్యుత్తు కోతలు లేనప్పటికీ...ఎమర్జెన్సీ లోడ్‌రిలీఫ్ పేరుతో పగలు,రాత్రి తేడాలేకుండా కరెంటు తీస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా కోర్‌సిటీలో మూడుగంటలు, శివారులో నాలుగు నుంచి ఐదుగంటలపాటు సరఫరా నిలిపివేస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సలు కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరి స్థితి ఉందని వాపోతున్నారు. కోతలతో గృహాలు..వాణిజ్య సముదాయాలు..పరిశ్రమలే కాదు...ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, సినిమాహాళ్లు, పెట్రోలుబంకులు, ట్రాఫిక్ సిగ్నళ్లు, ఐస్క్రీమ్పార్లర్లు, బేకరీలు, చివరకు సెలూన్లు కూడా ఢ‘మాల్’అంటున్నాయి. కోతల వల్ల మోటార్లు పనిచేయకపోవడంతో మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్‌ల ఆదాయానికి గండిపడుతోంది. ఈసేవా కేంద్రాల్లో కరెంట్ లేకపోవడంతో సర్కారుకు వచ్చే ఆదాయం ఆలస్యమవుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతుండగా, బ్యాంకుల్లో సేవలు స్తంభించిపోతున్నాయి. కోతల వల్ల డీజిల్, పెట్రోలు అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీ వత్యాసం ఉంటుండడంతో కరెంటు కోతలు అనివార్యమవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుండటంతో సబ్స్టేషన్లపై భారం పడకుండా ఉండేందుకు ఎమర్జెన్సీలోడ్ రిలీఫ్‌ల పేరుతో ఇష్టం వచ్చినట్లు కరెంటు తీసేస్తున్నారు. పరిశ్రమలకు వాత: ప్రస్తుతం గ్రేటర్‌లోని పరిశ్రమలకు పవర్‌హాలీడే అమల్లో లేకున్నా కాటేదాన్, గగన్‌పహాడ్ పారిశ్రామికవాడల్లో 12 గంటలపాటు సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ఉత్పత్తి నిలిచి యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.