రాజకీయ ‘ఆసరా’ | political leaders mislead aasara scheme | Sakshi
Sakshi News home page

రాజకీయ ‘ఆసరా’

Published Sat, Jan 10 2015 9:22 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM

political leaders mislead aasara scheme

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం కొందరి కారణంగా అభాసుపాలవుతోంది. అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాలనే సర్కారు లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. అర్హులైన వికలాంగ, వృద్ధ, వితంతువులకు పింఛన్లు అందించాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ఆసరా పథకంలో కొందరు నేతల ప్రమేయంతో అనర్హులు సైతం లబ్ధిపొందుతున్నారు. అర్హులు మాత్రం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చివరకు గ్రామ సభల్లో ఏర్పాటు చేసిన జాబితాల్లో రాజకీయ రంగు బయట పడింది. దీంతో ఆయా గ్రామాల్లో రాజకీయ నేతల మధ్య వైరుధ్యాలు మొదలయ్యాయి.
 
 రాజకీయ నేతల అండదండలతో..
 ఆసరా పథకం అమల్లో పలు గ్రామాల్లో స్థానిక రాజకీయ నాయకుల హవా కొనసాగిందనడానికి నిదర్శనమే అనర్హులకు పింఛన్లు మంజూరు కావడం. పలు పంచాయతీల్లో మండల స్థాయి నాయకులు ఆయా అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేసి తమకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులకు స్థానం కల్పించినట్లు తెలుస్తోంది. పలు పంచాయతీల్లో ఈ పథకంపై పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

అనర్హులకు ఎందుకు ఇస్తున్నారని అధికారులను సైతం నిలదీస్తున్నారు. ఒక  పార్టీపై ఇతర పార్టీల నేతలు అనర్హుల జాబితాను అధికారులకు అందజేస్తుండటంతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైంది. స్థానిక నాయకులు రాజకీయంగా లబ్ధిపొందేందుకు అనర్హులకు సైతం పింఛన్లు అందించేందుకు అధికారులతో మిలాఖత్ అయ్యి ఈ తతంగానికి తెరతీసినట్లు తెలుస్తోంది.
 
 పట్టుబడిన నకిలీలు
 ‘ఆసరా’ కోసం పలువురు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఆధార్‌లోని వయస్సును మార్చి పట్టుబడిన సంఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ జరుగుతున్నానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చింతకాని మండల నాగులవంచ కేంద్రంగా నకిలీలు సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే ఖమ్మం రూరల్ మండల పరిధిలోని కరుణగిరి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం తదితర ప్రాంతాల్లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు సదరం సర్టిఫికెట్లలో వైకల్యం ఎక్కువగా నమోదు చేస్తూ నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
 
 నకిలీ సర్టిఫికెట్ల అడ్డాగా జిరాక్స్ సెంటర్లు
 ఆసరా పథకంలో అర్హులకు ఓ పక్క అన్యాయం జరుగుతుండగా మరో పక్క అనర్హులకు అవకాశం కల్పిస్తోంది. స్థానిక రాజకీయ నేతలతో పాటు ఆయా ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆసరా పథకంలో వృద్ధుల పింఛన్లు పొందేందుకు ఆధార్‌లో వయస్సు ప్రమాణికంగా తీసుకోవటంతో జిరాక్స్ సెంటర్లలో కార్డులు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయం పలు మండలాల్లో తేటతెల్లమైంది.  దీంతో అర్హుల జాబితాలో అనర్హులకు స్థానం లభిస్తోంది.
 
 గ్రామాల్లో ఘర్షణ వాతావరణం
 ఆసరా పథకంలో అనర్హులకు లబ్ధిచేకూరిందనే ఆరోపణలతో గ్రామాల్లో ఘర్షణవాతావరణం నెలకొంది. లక్షల ఆస్తులు కలిగిన బడా భూస్వాములకు లబ్ధి చేకూర్చడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి రాజకీయ నాయకుల అండదండలే కారణమని  ఆరోపిస్తున్నారు. ఆసరా సర్వేలో ఇంటింటికి తిరగకుండా  అనర్హులకు లబ్ధికూరేలా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ రాజకీయం తీవ్ర స్థాయిలో వేడిక్కింది. ఒకానొక దశలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు మండల, జిల్లా స్థాయి అధికారులు సైతం ఒకరిపై ఒకరు అనర్హుల జాబితాను అందజేస్తున్నారు. దీంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఇటు అధికార పార్టీ నాయకులకు, ప్రతిపక్ష పార్టీల నాయకులకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement