సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. గవర్నర్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. సీఎం రాజ్‌భవన్‌కు ఎప్పుడు రావాలనేది ఆయన ఇష్టం అని మంత్రి తెలిపారు. గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గవర్నర్ రాజకీయాలు మాని.. తన పని తాను చేసుకోవాలని హితవు పలికారు.
గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై ఆరోపణలు చేయడం గవర్నర్‌కు ఫ్యాషన్‌గా మారిందని ధ్వజమెత్తారు. నిత్యం వార్తల్లో ఉండేందుకు గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
చదవండి: హెలికాప్టర్ అడిగితే ఇవ్వలేదా.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
వరంగల్: గవర్నర్ తమిళిసై బీజేపీ డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గవర్నర్‌గా ఆమె చేష్టలు ప్రజలను బాధపెడుతున్నాయని అన్నారు. హుందాగా ప్రవర్తించాలని గవర్నర్‌ను కోరుతున్నట్లు తెలిపారు. తమిళిసై రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ, ఆ పార్టీ నాయకులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తుండటం వల్లనే తమిళిసైకి తగిన గౌరవం దక్కడం లేదని అన్నారు.
కాగా గవర్నర్ పదవీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాజ్ భవన్ లో తమిళిసై ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ మూడేళ్లలో రాజ్‌భవన్ ప్రజాభవన్‌గా మారిందని గవర్నర్ అన్నారు. రాష్ట్రానికి మంచి చేయాలన్నదే తన అభిలాష అని, ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోయినా తాను పని చేస్తానన్నారు. పలు సమస్యల పరిష్కారానికి సీఎంకు లేఖలు రాశానని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించానని గవర్నర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు ఎవరూ ప్రొటోకాల్ పాటించడం లేదని ఆమె వ్యాఖ్యనించారు.
Comments
Please login to add a commentAdd a comment