
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల అవకతవకలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. విద్యార్థుల రీ వాల్యుయేషన్‌పై ఇంటర్‌బోర్డు తమ నిర్ణయాన్ని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే ఫెయిలైన మూడు లక్షల 20వేలమంది విద్యార్థులకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ జరుపుతామమని బోర్డు హైకోర్టుకు నివేదించింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ను మే 8లోగా పూర్తి చేసి.. వివరాలు తమకు సమర్పించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది.
బోర్డు ఇచ్చిన వివరాలు చూసిన తర్వాత 8వ తేదీ మధ్యాహ్నం ఫిటిషన్‌పై మరోసారి విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది. కాగా, చనిపోయిన విద్యార్థులకు 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు.