సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడిలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ అంగీకరించారు. ఇంటర్ బోర్డు పరీక్షా పత్రాలను పారదర్శకంగా, నాణ్యత కూడిన మూల్యాంకనం చేపట్టిందని, దాదాపు అంతా సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు. ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడిలో అవకతవకలు, ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాల నేపథ్యంలో సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల శ్రేణులు ఇంటర్ బోర్డు ముందు పెద్ద ఎత్తున ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అక్కడక్కడ కొన్ని తప్పిదాలు, పొరపాట్లు జరిగాయని, ముఖ్యంగా ముగ్గురు విద్యార్థుల పరీక్షా పత్రాలకు సంబంధించి మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని చెప్పారు.
అందుకే నవ్యకు సున్నా!
తెలుగులో సున్నా మార్కులు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఫెయిల్ అయిన మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన విద్యార్థిని జి. నవ్య అంశంపై అశోక్‌కుమార్ స్పందించారు. ఓఎమ్మార్ షీట్‌లో మార్కుల విభాగంలో బబ్లింగ్ చేయడంలో ఎగ్జామినర్ చేసిన తప్పిదం వల్లే నవ్యకు సున్నా వచ్చిందని ఆయన తెలిపారు. నవ్యకు 99 మార్కులకు బదులు ఎగ్జామినర్ జీరో బబ్లింగ్ చేశాడని, ఓఎమ్మార్ షీట్‌లో 9,9 అంకెల కిందనే సున్నా, సున్నా అంకెలు ఉంటాయని, 9-9 అంకెలను బబ్లింగ్ చేయడానికి బదులు పొరపాటున 0,0ను బబ్లింగ్ చేశారని, స్కూటినైజర్ కూడా సరిగ్గా పరిశీలించకుండా సున్నా, సున్నానే బబ్లింగ్ చేయడంతో నవ్యకు అలా మార్కులు వచ్చాయని తెలిపారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో వెంటనే స్పందించి.. వెరీఫై చేసి.. ఆ విద్యార్థినికి న్యాయం చేశామన్నారు. ఈ విధంగా మూల్యాంకనంలో తప్పులు, పొరపాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో పొరపాటు చేసిన వారిని ఇప్పటికే వివరణ అడిగామని, వారికి చార్జ్‌మెమో కూడా ఇస్తామని స్పష్టం చేశారు. 99కి బదులు సున్నా మార్కులు వేయడం చాలా పెద్ద తప్పిదమని, దీనిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నవ్య ఓఎమ్మార్ షీట్ మీడియాకు చూపించారు.
ఆ వదంతులు అవాస్తవం..
ఇంటర్ పరీక్షా పత్రాలు గల్లంతైనట్టు వస్తున్న వదంతులు, ఆరోపణలు అవాస్తవమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌బోర్డుకు 12 క్యాంప్ ఆఫీసులు ఉన్నాయని, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ కార్యాలయాల్లోనే పరీక్షా పత్రాల మూల్యంకనం చేపడతామని తెలిపారు. పరీక్షా పత్రాలన్నీ తమ వద్ద భద్రంగా ఉన్నాయని, ఏ ఒక్క పరీక్షా పత్రం మిస్ కాలేదని చెప్పారు. ఆబ్‌సెంట్ అయిన విద్యార్థిని కూడా పాస్ చేశారని వచ్చిన వాదనలు అపోహ మాత్రమేనని, కొందరు విద్యార్థులకు పరీక్షా కేంద్రాల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో రెండు సెంటర్లు కేటాయించామని, అందులో వారు ఒక సెంటర్‌లో ఆబ్‌సెంట్ అయి.. మరో సెంటర్‌లో పరీక్ష రాశారని, అందువల్ల వారికి ఏ-పీ (ఆబ్‌సెంట్-పాస్) అనే కోడ్ వచ్చిందని, రెండు సెంటర్లు వచ్చినవారిలో కొందరు ఫెయిల్ కావడంతో ఏ-ఎఫ్ వచ్చిందని వివరణ ఇచ్చారు. పూర్తిగా ఆబ్‌సెంట్ అయిన వాళ్లను పాస్ చేయడం కానీ, పాస్ అయిన వాళ్లను ఫెయిల్ చేయడం కానీ జరగలేదని తెలిపారు.
15 ఏళ్లుగా మన్‌టెక్ ఇన్ఫో సంస్థ సాంకేతిక సేవలు అందిస్తోందని, 15 ఏళ్లుగా ఒకే సంస్థ ఇస్తుండటంతో మార్చాలని టెండర్లు పిలువగా.. గ్లోబరెనా సంస్థ నుంచి టెండర్ వచ్చిందని, నిబంధనలకు అనుగుణంగానే ఆ సంస్థకు టెండర్ కేటాయించామని, ఆ సంస్థ మూడేళ్లు మాత్రమే ఇంటర్ బోర్డుకు సేవలు అందిస్తుందని, ఆ తర్వాత పూర్తిగా ఇంటర్ బోర్డే ఔట్ సోర్సింగ్ లేకుండా సొంతంగా సాంకేతిక సేవలను సమకూర్చుకుంటుందని అశోక్‌కుమార్ వివరించారు. రీ వాల్యుయేషన్ గడువును పెంచే అంశాన్ని పరిశీలిస్తామని, రీవాల్యుయేషన్‌లో మారిన మార్కులను విద్యార్థుల ఈమెయిల్‌కు పంపుతామని తెలిపారు.
అశోక్‌కుమార్‌ను నిలదీసిన నిరసనకారులు
మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా అశోక్‌కుమార్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు నిలదీశారు. ఇంటర్ బోర్డు తప్పిదాలకు విద్యార్థులకు ఎందుకు బలి కావాలని, 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వచ్చిన విద్యార్థిని.. కలత చెంది.. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యంకనంలో టెక్నికల్ తప్పిదాలు దొర్లాయని సాక్షాత్తూ విద్యామంత్రి జగదీశ్‌రెడ్డే చెప్తున్నారని, అలాంటప్పుడు మీ తప్పిదాలకు విద్యార్థులు నష్టపోవాలా? అని నిలదీశారు. ఒకవైపు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంత పెద్ద పొరపాట్లు, తప్పిదాలా? అని ప్రశ్నించారు. నిరసనకారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో అశోక్‌కుమార్ తడబడ్డారు.
చదవండి : నవ్యకు తెలుగులో 99 మార్కులు
Comments
Please login to add a commentAdd a comment