
విద్యార్థి బలవన్మరణం
ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇద్దరు యువకుల్లో ఒకరు ...
► మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
► ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిల్
► అవ్వడమే కారణం
ఈపూరు : ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇద్దరు యువకుల్లో ఒకరు బలవన్మరణం చెందగా, మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం ఈపూరులో చోటుచేసుకుంది. ఈపూరు గ్రామానికి చెందిన కోతి శామ్యేలు, దీనమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో రెండో కుమారుడు కోతి చిరంజీవి వినుకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివాడు. ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు తెలిసి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. అప్పటి వరకు ఇంటి వరండాలో ముచ్చటించిన చిరంజీవి ఒక్కసారిగా ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకున్నాడు.
చుట్టుపక్కల వారు తలుపు కొట్టినా తీయలేదు. దీంతో తలుపులు తొలగించి లోపలికి వెళ్లి చూడగా చిరంజీవి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే బంధువులు చిరంజీవిని ఈపూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిరంజీవి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పొలంలో పనిచేస్తున్న తల్లి దీనమ్మకు విషయం తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చేతికి అందివచ్చిన కొడుకు ఈ విధంగా మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదన చూపరులకు కంటతడి పెట్టించింది.
వనికుంట గ్రామానికి చెందిన సట్టి శ్రీను, హనీమేరీ కుమారుడు శౌరిరాజు. ప్రకాశం జిల్లా దర్శిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఇంటర్ పరీక్షల ఫలితాల్లో శౌరిరాజు ఫెయిల్ అయినట్లు తెలియడంతో గొంతు, చేతి నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే బంధువులు గమనించి ఈపూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.