సాక్షి, అమరావతి: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... అన్ని సవాళ్లను అధిగమించి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ప్రప్రథమంగా ఫలితాలను మనం విడుదల చేశాం. కరోనా సంక్షోభ సమయంలోనూ ఫలితాలను అనుకున్న సమయానికి విడుదల చేయడమనేది ఇది ఓ చరిత్రాత్మకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకంలో విద్యాశాఖలోని అందరూ అధికారుల సమిష్టి కృషితో ఫలితాలను విడుదల చేశాం. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ నెలరోజుల పాటు వాల్యూయేషన్ పూర్తి చేశాం. ఈ ఏడాది విద్యా వ్యవస్థలో పెనుమూర్పులకు శ్రీకారం చుట్టాం. రానున్న రోజుల్లో రాష్ట్రంలో విద్యా వ‍్యవస్థ అందరికీ ఆదర్శంగా నిలవనుంది.’ అని తెలిపారు. (షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు)
ఈసారి కూడా బాలికలదే పైచేయి
ఇంటర్ ఫలితాలకు వస్తే... మొదటి సంవత్సరంలో 59శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో 63 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలురు కన్నా బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాలువారీగా చూస్తే ఫలితాల్లో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఫలితాలకు సంబంధించి టోల్‌ఫ్రీ నెంబర్‌ను విద్యాశాఖ ఏర్పాటు చేసింది.
ఫలితాలు https://bie.ap.gov.in, www.sakshieducation.com తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. బోర్డు వెబ్‌సైట్లో హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం 5,07,228 మంది, రెండో సంవత్సరం 4,88,795 మంది, ఒకేషనల్ మొదటి సంవత్సరం 39,139 మంది, రెండో సంవత్సరం 29,993 మంది మొత్తం 10,65,155 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్‌లో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసినందున మొదటి సంవత్సరం ఫలితాల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, రెండో సంవత్సరం ఫలితాలు సబ్జెక్టుల వారీగా గ్రేడ్ పాయింట్లలో ప్రకటించనున్నారు. ఇక ఫలితాల షార్ట్ మార్కుల మెమోలు ఈనెల 15వ తేదీ నుంచి విద్యార్థులకు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత పరీక్ష ఫలితాలు వెల్లడించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం.
కాగా సర్వర్‌పై లోడ్ అధికం కావడంతో వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే ఫలితాల కోసం ఒకేసారి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడంతో ఆలస్యం జరుగుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment