సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పిదాలను నిరసిస్తూ బీజేపీ గురువారం (2న) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో 24 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ నేడు తాము చేపట్టబోయే రాష్ట్ర బంద్‌కు ప్రజలు సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పిల్లల భవిష్యత్తు కోసం, ఆందోళనలో ఉన్న విద్యార్థి లోకానికి భరోసా ఇచ్చేందుకు, అమాయక విద్యార్థుల బలిదానమైనా అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, పరీక్షల నిర్వహణ, ప్రాసెసింగ్ లోపాలతో పలువురు విద్యార్థులు ఫెయిలయ్యారని అన్నారు. టాప్ ర్యాంక్ వస్తుందని ఆశించిన వారు, ఫస్టియర్‌లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన వారు, మిగతా సబ్జెక్టుల్లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన వారు కూడా ఫెయిలైన వారి జాబితాలో ఉన్నారని వెల్లడించారు. 50 ఏళ్ల ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోని గందరగోళం, ఘోర వైఫల్యం ఈసారి చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు, బాధిత విద్యార్థులకు న్యాయం చేసేందుకు బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిందని, ఇది రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదని స్పష్టం చేశారు.
నిమ్స్‌లో కొనసాగుతున్న లక్ష్మణ్ దీక్ష..
ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లక్ష్మణ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారంతో మూడో రోజుకు చేరింది. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు సోమవారం ఆయన దీక్షకు కూర్చోగా, పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి నిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. సెలైన్ ఎక్కించేందుకు యత్నించినప్పటికీ ఆయన నిరాకరించి, ఆస్పత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తు న్నారు.
మూడు రోజులుగా ఆయన ఎలాంటి ఆహా రం తీసుకోకపోవడం వల్ల నాలుగు కేజీల బరువు తగ్గారు. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండటం, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కనీస స్పందన లేకపోవడంతో బీజేపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనేక మంది పిల్లల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న గ్లోబరీనా సంస్థ కాంట్రాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని.. విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని, బోర్డుకార్యదర్శి అశోక్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి.
‘బంద్‌కు సహకరించండి’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులను నిరసిస్తూ సోమవారం (2న) బీజేపీ తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ప్రజలను కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ బోర్డులో అవకతవకలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఇంత వరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. నిరసనకు దిగిన ప్రతిపక్షా లపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఒప్పందం లేకుండా గ్లోబరీనా సంస్థ కాంట్రాక్టు ఎలా దక్కించుకుందని ప్రశ్నించారు. పాత్రధారులే న్యాయ నిర్ణేతలుగా ఉన్నారని విమర్శించారు. ఈ విషయం లో తాడోపేడో తేల్చుకునేందుకు తమ పార్టీ సిద్ధమవుతోందని చెప్పారు. తాము చేపట్టనున్న బంద్ రాజకీయం కోసం కాదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment