సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల వెల్లడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని, ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాకు చెందిన నవ్యకు సున్నా మార్కులు ప్రకటించి, మరుసటి రోజే 99 మార్కులు వచ్చాయని పేర్కొనడం ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు.
బోర్డు తప్పులు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే అవి అపోహలంటూ ప్రభుత్వం పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. విద్యార్థుల జవాబు పత్రాల రీవాల్యువేషన్‌కు తల్లితండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడం బోర్డు దివాళాకోరుతనానికి నిదర్శమని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బోర్డు తప్పులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వమే రీవాల్యువేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.
సీమాంతర ఉగ్రవాదానికి నిదర్శనం..
శ్రీలంకలో జరిగిన మారణకాండ అత్యంత హృదయ విదారకరమైందని చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి ఈ దాడులు నిదర్శనమని తెలిపారు. ఈ ఉగ్రవాదుల వెనక ఉన్న ఏ దేశాన్ని అయినా ఇతర దేశాలు నిలదీయాలని సీపీఐ అభిప్రాయపడుతోందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment