సమస్యల ‘చదువు’ | Sakshi Editorial On Telangana Intermediate Results 2019 | Sakshi
Sakshi News home page

సమస్యల ‘చదువు’

Published Sat, Apr 20 2019 1:04 AM | Last Updated on Sat, Apr 20 2019 1:04 AM

Sakshi Editorial On Telangana Intermediate Results 2019

ఏడాది పొడవునా చదువుకొని వార్షిక పరీక్షలు రాశాక, ఫలితం అనుకున్నట్టు రాకపోతే ఎవరికైనా నిరాశానిస్పృహలు కలగడం సహజం. కానీ గురువారం తెలంగాణ ఇంటర్మీడియెట్‌ వార్షిక ఫలి తాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న తీరు ఎంతటివారి నైనా కలచివేస్తుంది. కారణాలేమైనా గతంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 2 శాతం తగ్గిందని గణాం కాలు చెబుతున్నాయి. ఫలితాలు ప్రకటించినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హడావుడి ఏ స్థాయిలో ఉంటుందో తెలియనిది కాదు. నాణ్యమైన విద్య అందిస్తామనే పేరుతో దాన్ని పూర్తి స్థాయి వ్యాపారంగా మార్చిన కార్పొరేట్‌ స్కూళ్లు, కళాశాలలు దాన్ని మరింత విస్తరించుకునేందుకు ప్రయ త్నిస్తాయి. తమ ఘనతను చాటుకుంటూ హోరెత్తిస్తాయి. వెలువడిన ఫలితాల్లో తామే నంబర్‌వన్‌ అని, ర్యాంకులన్నీ తమకేనని మిన్ను విరిగి మీద పడినట్టు అరచి చెబుతాయి. ఇదంతా సహజం గానే ఆ స్థాయిలో నెట్టుకురాలేని విద్యార్థుల్లో లేదా ఫెయిలైనవారిలో ఒక రకమైన అపరాధభావన, న్యూనత కలిగిస్తాయి. తమతోపాటు చదువుకున్నవారిలో కొందరు ఫలితాల తర్వాత అంతెత్తున ఉంటే, అందరూ వారిని అభినందలతో ముంచెత్తుతుంటే... తాము మాత్రం పనికిరానివారిగా మిగి లిపోయామన్న బాధ వెంటాడుతుంది. ప్రతిదీ పోటీతో ముడిపడి ఉండే ఈ ప్రపంచంలో తమ వంటివారికి చోటులేదన్న అభిప్రాయం కలుగుతుంది. మరణం అన్నది విషాదకరమైనది. అది బలవన్మరణమైతే ఇక చెప్పేదేముంది? 

విద్యార్థులకున్న సవాలక్ష సమస్యలు చాల్లేదన్నట్టు ఇంటర్మీడియెట్‌ బోర్డు అదనపు సమస్యలు సృష్టించింది. వందలమంది విద్యార్థుల మార్కుల మెమోలు తప్పుల తడకగా ఉన్నాయి. పరీక్ష రాసినా గైర్హాజరైనట్టు, ఫెయిలైనట్టు చూపడం వంటివి విద్యార్థులనూ, వారి తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మొత్తం 810 మార్కులు వచ్చిన ఒక విద్యార్థికి గణితంలో కేవలం 17 మార్కులే వచ్చినట్టు చూపడం, 831 మార్కులు వచ్చిన మరో విద్యార్థి ఇంగ్లిష్‌–2 పరీక్షకు గైర్హాజరైనట్టు చూపడం ఏ రకం తప్పులనుకోవాలి? అలాంటి ఫలితం వచ్చిన పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందో నిర్వాహకులు ఆలోచించారా?

సామర్థ్యం లేని సాఫ్ట్‌వేర్‌ సంస్థకు పని అప్పగిం చడం వల్లే ఇటువంటి ఫలితాలొచ్చాయని అధ్యాపకులు ఆరోపిస్తున్నారంటే బోర్డు నిర్వాకం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పైగా తలెత్తుతున్న సమస్యల గురించి చాలా ముందుగానే హెచ్చరించినా వినే నాథుడు లేకపోయాడన్నది వారి ఫిర్యాదు. లక్షలమంది పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉండే ప్రక్రియ విషయంలో ఇలాంటి అలసత్వం క్షమార్హం కానిది. ఫలితాలు వెలువడిన 24 గంటల తర్వాత కూడా తాము గట్టెక్కామో, ఫెయిల్‌ అయ్యామో తెలియని అయోమయావస్థలో పిల్లల్ని ఉంచడం ఆ కుటుంబాలను ఎంత ఇబ్బంది పెడుతుందో నిర్వాహకులకు అర్ధంకావడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభించినప్పటినుంచి, అది పూర్తయి వార్షిక పరీక్షలు నిర్వహించేవ రకూ ఏ ఏ దశల్లో ఏం సమస్యలు వస్తాయో, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలేమిటో నిర్వాహకులకు తెలియదనుకోలేం. కానీ పుస్తకాల విడుదల మొదలుకొని పరీ క్షలు నిర్వహించి ఫలితాలు వెలువరించేవరకూ అన్ని దశల్లోనూ ఎక్కడో ఒకచోట సమస్యలు తప్ప డం లేదు. ఏఏ అంశాల విషయంలో ఒకటికి రెండుసార్లు గమనించుకోవాలో కిందిస్థాయిలో ఉన్న పరీక్షల నిర్వహణ సిబ్బంది వరకూ అవగాహన కలిగిస్తే వైఫల్యాలు తగ్గుముఖం పడతాయి. ఏడాది పొడవునా యాంత్రికంగా పనిచేసుకుంటూపోయి, చేయాల్సిన పనులన్నిటినీ అయిందనిపించి లోపాలు బయటపడినప్పుడు నెపం సాఫ్ట్‌వేర్‌పైనో, కింది స్థాయిలో పనిచేసే సిబ్బందిపైనో వేస్తే బాధ్యత తీరిపోదు. 

అటు యూనివర్సిటీ విద్యకు వెళ్లడానికైనా, ఇటు ఉన్నతస్థాయి వృత్తి విద్యా కోర్సులకు వెళ్లడానికైనా ఇంటర్మీడియెట్‌ ఒక కీలకమైన లింకు. ఇక్కడ సక్రమంగా చదువు చెప్పి, సజావుగా పరీక్షలు నిర్వహించి, లోపరహితంగా మూల్యాంకనం జరిపినప్పుడే ఉన్నత విద్యారంగానికి మెరిక ల్లాంటి విద్యార్థులు వెళ్లగలుగుతారు. కానీ ఎంసెట్, నీట్‌ వంటి ఎంట్రెన్స్‌ పరీక్షల నిర్వహణకు చూపేంత శ్రద్ధ ఇంటర్మీడియెట్‌ విద్యలో కనబడటం లేదు. 2018–19 విద్యా సంవత్సరం తొలి దశ జూన్‌ నెలాఖరుకు పూర్తి కావలసి ఉండగా, ఆగస్టు వరకూ అది సాగిందంటున్నారు. ఇంచుమించు ఆ సమయం వరకూ తగినంతమంది గెస్ట్‌ ఫ్యాకల్టీని నియమించలేదని చెబుతున్నారు. ఇక అధ్యా పకుల బదిలీలు సరేసరి. ఇవన్నీ చదువుపట్ల పిల్లలకు ఉండాల్సిన శ్రద్ధను తగ్గిస్తాయి. వారి ఏకాగ్ర తను దెబ్బతీస్తాయి. ఇక మూల్యాంకనం విషయంలోనూ ఏటా అభ్యంతరాలు తప్పడం లేదు. ఇవన్నీ మన ఇంటర్మీడియెట్‌ విద్యకు ఉండాల్సిన ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. 

ఈసారి అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ గురుకులాల్లో చదువుకున్న విద్యా ర్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఏపీలో 96.9 శాతం, తెలంగాణలో 89.8 శాతం ఉత్తీర్ణతతో గురుకుల కళాశాలలు అగ్రభాగాన నిలిచాయి. ప్రభుత్వం శ్రద్ధపెట్టి అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తే విద్యార్థుల సామర్థ్యం, అవగాహన పెరుగుతాయని ఈ ఫలితాలు చాటుతున్నాయి. సాధా రణ జూనియర్‌ కళాశాలలపై సైతం ప్రభుత్వం దృష్టి సారించి, వాటిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తే అట్టడుగు వర్గాల పిల్లలందరూ మెరుగైన భవిష్యత్తును సాధించగలుగుతారు. అంతే కాదు చదువుల పేరుతో తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్‌ కళాశాలల పుణ్యమా అని అలముకున్న అనా రోగ్య వాతావరణం కూడా సమసిపోతుంది. ఇంటర్మీడియెట్‌ దశలోనే ఉన్నత విద్యకు అవసరమైన విశ్లేషణా సామర్థ్యం, విమర్శనాత్మక దృష్టి, పరిశోధనా సంబంధమైన పరిజ్ఞానం విద్యార్థిలో కలి గించేవిధంగా తీర్చిదిద్దితే పిల్లలు నిండైన ఆత్మవిశ్వాసంతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతారు. అప్పుడు ఆత్మహత్యలు, కడుపుకోతలు ఉండవు. ప్రభుత్వాలు ఆలోచించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement