ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరిగిన ఈ పరీక్షా ఫలితాల్లో మన జిల్లా చివరి నుంచి రెండోస్థానం దక్కించుకుంది.
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరిగిన ఈ పరీక్షా ఫలితాల్లో మన జిల్లా చివరి నుంచి రెండోస్థానం దక్కించుకుంది. గతేడాది ఉమ్మడి రాష్ట్రం(తెలంగాణ, సీమాంధ్ర) లోని 23 జిల్లాల్లో అనంతపురం 49 శాతం ఉత్తీర్ణతతో 12వ స్థానంలో నిలి చిన విషయంవిదితమే.
ఈసారి 13 జిల్లా ల ఆంధ్రప్రదేశ్‌లోనూ 12వ స్థానంలోనే నిలిచింది. ఈ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి. జిల్లాలో మొత్తం 32,203 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 17,116 మంది ఉత్తీర్ణత సాధించారు. 16,283 మంది బాలురకు గాను 7,738 మంది (48 శాతం), 15,920 మంది బాలికలకు గాను 9,378 మంది (59 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలబాలికల ఉత్తీర్ణత గతేడాది కంటే 5 శాతం పెరిగింది.
ప్రభుత్వ కళాశాలల్లో 2.12 శాతం పెరిగిన ఉత్తీర్ణత
జిల్లాలోని 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది 40 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాదికంటే 2.12 శాతం పెరిగింది. మొత్తం 7,684 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 3028 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎయిడెడ్ కళాశాలలకు సంబంధించి 46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 44.38 శాతం సాధించారు. ఈసారి 1.62 శాతం పెరిగింది. జిల్లాలోని 6 ఎయిడెడ్ కళాశాలల్లో మొత్తం 2352 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 1038 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషన ల్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 21 కళాశాలల్లో 46 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కూడా ఇంతే శాతం నమోదు చేశారు. మొత్తం 2,050 మంది విద్యార్థులకు గాను 946 మంది పాసయ్యారు.
నెట్ సెంటర్ల వద్ద సందడి
ఫలితాలు ప్రకటిస్తారని తెలియడంతో ఉదయం నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఫలితాలు వెలువడగానే అనంతపురం నగరంతో పాటు హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి, ఉరవకొండ, గుత్తి, పుట్టపర్తి, మడకశిర పట్టణాల్లోని ఇంటర్నెట్ కేంద్రాలు కిటకిటలాడాయి.
తొమ్మిదేళ్లుగా
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలిలా...
సంవత్సరం శాతం
2008 45
2009 33.53
2010 36
2011 44
2012 47
2013 45.5
2014 49
2015 53