ఎంసెట్‌లో మెరిసిన జిల్లా విద్యార్థులు
కర్నూలు(విద్య): ఎంసెట్-2014 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన జిల్లా విద్యార్థులు ఎంసెట్ ఫలితాల్లో కూడా రాణించారు. నీలోఫర్ ఉన్నీసా అనే విద్యార్థిని 151/160 మార్కులతో 108వ ర్యాంకు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది.
అయితే ఇంటర్ మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు ఎంసెట్ ర్యాంకుల విషయంలో కాస్త వెనుకబడ్డారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారి సంఖ్య తగ్గింది. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు విడుదలైన ఎంసెట్ ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులు ఇంటర్‌నెట్ సెంటర్లకు పరుగులు తీశారు. సర్వర్లు మొరాయించడంతో ఆందోళనకు గురయ్యారు.
నారాయణ విద్యార్థుల ప్రభంజనం ..
మెడికల్ విభాగంలో ఫలితాల్లో కర్నూలులోని నారాయణ కళాశాలలో విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. నీలోఫర్ ఉన్నీసా 108వ ర్యాంకు, సాయిపవన్‌కుమార్ 294, ఎం. సంహిత 376, శ్రీనాథరెడ్డి 561, సాయిస్నిగ్దారెడ్డి 571, ఎం. జోత్స్నవిరెడ్డి 898, వైశాఖ్ ఆర్.బచ్చు 987, ఎంబి శారద 1,330, హేమచందన సంతోషి 1,694వ ర్యాంకు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో చిన్నవీరేష్ 396వ ర్యాంకు, వి. హరికృష్ణ 473, కె. వంశీకృష్ణ 689, పి. భార్గవ 1,523, వి. హరివంశీ 1,806 ర్యాంకు సాధించి టాపర్లుగా నిలిచారు.
‘శ్రీచైతన్య’ విజయభేరి: కర్నూలు నగరంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ఎంసెట్ ఫలితాల్లో విజయభేరి మోగించారు. మెడికల్ విభాగంలో కె. కావ్య 224వ ర్యాంకు, ఐ. సాయిచంద్రశర్మ 463, టి. శ్రీహరి 467, ఎం. శ్రావణి 739వ ర్యాంకు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో కె. అజయ్ 447, ఎన్. మురళీకృష్ణ 875, ఆర్. వారాహి 1,046, వంశీ 1,256వ ర్యాంకు సాధించి సత్తాచాటారు.
కార్జియాలజిస్ట్ కావాలన్నదే లక్ష్యం: నీలోఫర్ ఉన్నీసా
కర్నూలు నగరంలోని కొత్తపేటలో నివాసముంటున్న అబ్దుల్ రహమాన్ పాఠశాల హెచ్‌ఎంగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన భార్య ఫాతిమా ఉన్నీసా గృహిణి. వీరికి ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. వీరు ప్రతి ఒక్కరినీ ఉన్నతంగా చదివించారు. ప్రస్తుతం వారి ఐదో కూతురు నీలోఫర్ ఉన్నీసా ఎంసెట్ మెడికల్ విభాగంలో 108వ ర్యాంకు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. ఆమె పదో తరగతిలో 9.8 జీపీఏ పాయింట్లు, ఇంటర్‌లో 984 మార్కులు కైవసం చేసుకుంది. ఎంసెట్ మెడికల్ విభాగంలో 151 మార్కులతో ఏకంగా 108 ర్యాంకు చేజిక్కించుకుంది. తాను కర్నూలు మెడికల్ కాలేజిలో చేరతానని, కార్డియాలజిస్టు కావాలన్నదని తన లక్ష్యమని నీలోఫర్ పేర్కొంది.
ఐఐటీలో చేరడమే లక్ష్యం: వంశీకృష్ణ
ఐఐటీలో చేరడమే తన లక్ష్యమని ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 689వ ర్యాంకు సాధించిన వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇతని తండ్రి సామన్య రైతు. పిల్లలను ఉన్నతంగా చదివించాలన్న ఉద్దేశంతో కర్నూలు నగరం వచ్చి స్థిరపడ్డారు. ఆయన కష్టానికి ఫలితంగా పిల్లలు మంచి మార్కులతో ఉన్నత స్థానానికి దూసుకెళ్తున్నారు. కర్నూలు నగరంలోని వన్‌టౌన్‌లో నివసిస్తున్న కె. బాలాజిప్రసాద్, కె. సావిత్రి దంపతుల స్వగ్రామం ఎమ్మిగనూరు మండలం కనికవీడు గ్రామం. టెన్త్‌లో 9.5 జీపీఏ పాయింట్లు, ఇంటర్‌లో 986 మార్కులు సాధించడంతో పాటు జేఈఈ మెయిన్స్‌లోనూ 208 మార్కులు కైవసం చేసుకున్నాడు. ఐఐటీలో చేరడమే లక్ష్యమని వంశీకృష్ణ చెప్పాడు.