Eamcet -2014
-
ఇంజినీరింగ్ అడ్మిషన్ల కోలాహలం
నల్లగొండ అర్బన్ : ఎంసెట్-2014 ఇంజినీరింగ్ విభాగంలో తొలి విడత ప్రవేశ అనుమతులు కోల్పోయిన ఇంజినీరింగ్ కాలేజీలకు బుధవారం సుప్రీం కోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు తో రెండవ విడత కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. సరైన వసతులు, ఫ్యాకల్టీ తదితర లోపాలను ఎత్తిచూపుతూ జేఎన్టీయూ రాష్ట్రంలోని 174 ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్లను నిరాకరించడంతో మొదటి విడత కౌన్సెలింగ్‌కు అవకాశాన్ని కాల్పోయాయి. ఈ విధంగా జిల్లాలో 34 కాలేజీలు ప్రవేశాలకు దూరమయ్యాయి. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడం, అక్కడ చుక్కెదరుకావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా కాలేజీలకు రెండవ విడత కౌన్సెలింగ్ జరుపుకునేందుకు కోర్టు సమ్మతించడంతో మళ్లీ ప్రవేశాల కోలాహలం మొదలుకానుంది. కోర్టు తీర్పుతో జిల్లాలో దాదాపు 1500 నుంచి 2000 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందవచ్చునని భావిస్తున్నారు. 1500 మందికి ప్రవేశాలు ? జిల్లాలో 34 ఇంజినీరింగ్ కాలేజీలు రెండ విడత కౌన్సెలింగ్‌కు అవకాశం లభించడంతో ఆయా కాలేజీల్లో దాదాపు 1500 నుంచి 2వేల మంది విద్యార్థులు చేరుతారని భావిస్తున్నారు. హైదరాబాద్ తదితర పట్టణాల్లో సీట్లు పొంది పరిస్థితుల ప్రభావంతో చేరలేక డిగ్రీ కోర్సుల్లో చేరిన వారంతా తిరిగి ఇంజినీరింగ్ వైపు రాగలరని ఆశిస్తున్నారు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని భావించి ఇప్పటికే ఆయా విద్యార్థుల చిరునామాల వేటలో పడిన కాలేజీల యాజమాన్యాలు అడ్మిషన్లకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలి సింది. అంతే కాకుండా జిల్లాలోని దేవరకొండ, కోదాడ, మిర్యాలగూడ, భువనగిరి పరిసర ప్రాంతాల్లోని కొన్ని కాలేజీలు మొదటి విడత కౌన్సెలింగ్‌కు ముందే కొందరు విద్యార్థులకు వివిధ రకాల ఆశలు చూపి సర్టిఫికెట్లను, ర్యాంక్ కార్డులను సేకరించాయి. కానీ వారికి మొదటి విడతలో ప్రవేశాలు తీసుకునే అవకాశం లభించకున్నా తరగతులు నిర్వహిస్తున్నాయన్న సమాచారం. ఎలాగూ ఆలస్యంగానైనా అనుమతి లభించగలదనే ధీమాతో వారు తరగతులు కొనసాగించారని తెలిసింది. నవంబర్ 2వ వారం నాటికి ప్రవేశాలు పూర్తి సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రెండవ విడత కౌన్సెలింగ్ అవకాశం పొందిన కాలేజీలు నవంబర్ 2వ వారం నాటికి అడ్మిషన్లను భర్తీ చేసుకోవాలి. మూడవ వారం తరగతులు ప్రారంభించి ఫిబ్రవరి 2వ వారంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల మొదటి సెమిస్టర్ పరీక్షలను, జూన్ 15 నాటికి రెండవ సెమిస్టర్లను పూర్తి చేయాల్సివుంటుంది. మొదటి విడత కాలేజీలకు నిరాశే.. జిల్లాలో 41 ఇంజినీరింగ్ కాలేజీలుండగా మొదటి విడతలో ఎంజీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీతో పాటు మరో ఆరు ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్ లభించింది. దీంతో వారు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను నిర్వహిస్తున్నారు. కొన్ని కోర్సుల్లో సీట్లు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. రెండవ విడతలో అవకాశం వస్తే ఆ సీట్లను భర్తీ చేసుకోవచ్చని ఆశించారు. కానీ సుప్రీం కోర్టు ప్రస్తుతం 34 కాలేజీలకే అవకాశం ఇచ్చింది. వారికి మాత్రమే స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మొదటి విడతలో అవకాశం లభించిన 7 కాలేజీలకు ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. అయితే మొదటి సారి కౌన్సెలింగ్‌కు హాజరై వెబ్ఆప్షన్ ఇవ్వనివారు, ఇచ్చినా సదరు కాలేజీకి అఫిలియేషన్ లేక అలాట్‌కాని వారు మాత్రం అవకాశాన్ని వినియోగించుకునే వీలుంది. కానీ ఇప్పటికే ఏదో ఒక కోర్సులో చేరి తరగతులకు హాజరైన వారు స్లైడింగ్ ద్వారా మరో ప్రాధాన్యత గల కోర్సులోకి చేరాలనుకుంటే మాత్రం అవకాశం లేకుం డా పోయింది. కానీ ఇతర ప్రాంతాల్లోని కాలేజీల్లో చేరి అనారోగ్య కర పరిస్థితులతో చదువులు కొనసాగించలేకపోయిన వారు, మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా కాలేజీలు మార్చుకునేందుకు అవకాశాలుంటాయని సమాచారం. -
కౌన్సెలింగ్..
సర్వం సిద్ధం నేటి నుంచే ధ్రువపత్రాల పరిశీలన నగరంలోని ఐదు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి తొలిరోజు 1 నుంచి 25 వేల ర్యాంక్ వరకు విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంసెట్-2014 కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు నగరంలో ఐదు కేంద్రాలను ఎంపిక చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రోజుకు 30 వేల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఎంసెట్ 2014 కౌన్సెలింగ్ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపడంతో గురువారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన మొదలుకానుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు ఆరు వేల మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. వికలాంగులు, స్పోర్ట్స్, ఎన్సీసీ.. తదితర అభ్యర్థుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలిరోజు 1వ ర్యాంకు నుంచి 25 వేల ర్యాంకుల వరకు పరిశీలన జరుగుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సెలవు. తిరిగి శ నివారం పరిశీలన ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి తీసుకురండి.. ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్ టెన్త్, ఇంటర్ మార్కుల జాబితా ప్రాథమిక, ఉన్నత విద్య స్టడీ సర్టిఫికెట్లు జనవరి 1, 2014 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం తదితర ఒరిజినల్ పత్రాలతో పాటు జిరాక్స్ కాపీలు తప్పనిసరి ఏర్పాట్లు పూర్తి కౌన్సెలింగ్ పక్రియలో భాగంగా మొదట రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఎస్సీ కేటగిరి విద్యార్థులు రూ. 300, ఓసీ, బీసీ కేటగిరీ విద్యార్థులు రూ. 600 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలి. విడతలవారీగా 100 నుంచి 120 మందిని హాలులోకి అనుమతిస్తాం. మైకు ద్వారా విద్యార్థుల పేర్లను పిలుస్తాం. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించేందుకు ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు ఉంటారు. జేఎన్టీయూహెచ్లో ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేశాం, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. - సీతారామరాజు, జేఎన్టీయూహెచ్ అడ్మిషన్స్ డెరైక్టర్ -
ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఎంసెట్-2014 వెబ్ కౌన్సెలింగ్ పక్రియ గురువారం ప్రారంభమైంది. నెల్లూరులోని దర్గామిట్ట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల్లో ఈ పక్రియను చేపట్టారు. ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం వెయ్యికళ్లతో ఎదురుచూసిన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. మహిళా పాలిటెక్నిక్ కళాశాల్లో ముగ్గురు అభ్యర్థులు, బాలుర పాలిటెక్నిక్ కళాశాల్లో 18 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. 1వ ర్యాంకు నుంచి 5వేల ర్యాంకు వరకు చేపట్టిన ఈ పరిశీలన కార్యక్రమంలో రెండు కేంద్రాల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మందకొడిగా సాగిన తొలిరోజు సర్టిఫికెట్ల పరిశీలన పలు సందేహాలకు తావిస్తోంది. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారన్న అనుమానం కలుగుతోంది. యథావిధిగా ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ వెబ్సైట్ మొరాయించడంతో గంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. అభ్యర్థులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పెద్ద ఇబ్బందిలేదని ప్రిన్సిపల్స్ నారాయణ, రామోహన్‌రావు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. పోలీసు బందోబస్తు, తాగునీటి వసతిని కల్పించామన్నారు. శుక్రవారం జరిగే వెబ్ కౌన్సెలింగ్ 5001 నుంచి 7,500 వరకు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో, 7,501 నుంచి 10,000 వేల వరకు బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో అభ్యర్థులు హాజరుకావాలని వారు తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. -
ఎం‘సెట్’ అయ్యింది..!
ఎచ్చెర్ల క్యాంపస్: ఎన్నో అంతరాయాలు..వివాదాల నడుమ ఎట్టకేలకు ఎంసెట్-2014 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించాయి. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పాలిటెక్నిక్ పురుషుల కళాశాలలో కౌన్సెలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్(సహాయ కేంద్రాన్ని) ప్రకటించారు. గురువారం నుంచి ధ్రువీకరణ పత్రాలను పరిశీలన ప్రారంభం కానుంది. తొలి రోజున 1 నుంచి 5 వేల ర్యాంకు వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరగనుంది. విద్యార్థులకు ఊరట ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి గతంలో ప్రకటించిన షెడ్యూల్ మేరకే కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటించడంతో..విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం యూనిట్‌గానే ప్రవేశాలు ఉంటాయని ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈనెల 23 నాటికి పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించే చర్యలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. అంతా సజావుగా సాగితే..ఒకటి నుంచి తరగతులు సైతం ప్రారంభం కానున్నాయి. ఇక్కడ మరో సమస్య కూడా తోడవుతోంది. పాలీసెట్, ఈసెట్-2014 ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయి..నెలలు గడుస్తున్నా..ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్థానికతపై స్పష్టత లేకపోవడంతో..అలాట్ మెంట్లు ప్రకటించలేదు. ఈ కోర్సుకు సంబంధించి.. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారం భం కావాల్సి ఉన్నా..ఇంకా పరిష్కారం కావడం లేదు. -
సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో ఎంసెట్ మాక్ కౌన్సెలింగ్
హైదరాబాద్: ఎంసెట్ 2014లో వచ్చిన ర్యాంకు ఆధారంగా తమకు వచ్చే కాలే జీ, బ్రాంచ్ వివరాలను తెలియజేసే మాక్ కౌన్సెలింగ్ పోర్టల్‌ను సాక్షిఎడ్యుకేషన్.కామ్ ప్రారంభించింది. అభ్యర్థులు ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలలో తమకు సీటు వచ్చే కాలేజీ, బ్రాంచ్ వివరాలను ఈ పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. విద్యార్థులు www.sakshieducation.comలోని ఎంసెట్ మాక్ కౌన్సెలింగ్ లింక్ ఓపెన్‌చేసి తమ ర్యాంకు, ఇతర వివరాలను పొందుపరిచి తమకు ఏ కాలేజీలో, ఏ బ్రాంచిలో సీటు వస్తుందో తెలుసుకోవచ్చు. ఎంసెట్ 2013 కౌన్సెలింగ్‌లో జరిగిన కాలేజీ, బ్రాంచ్ కేటాయింపుల ఆధారంగా ఈ సంవత్సరం ఫలితాలను ఈ పోర్టల్ అంచనా వేస్తుంది. ఐసెట్ మాక్ కౌన్సెలింగ్ పోర్టల్ అలాగే ఐసెట్ 2014లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్లు, కాలేజీల కేటాయింపు వివరాలను తెలియజేసే ప్రత్యేక మాక్ కౌన్సెలింగ్ పోర్టల్‌ను సాక్షిఎడ్యుకేషన్.కామ్ ప్రారంభించింది. అభ్యర్థులు మాక్ కౌన్సెలింగ్ కోసం www.sakshieducation.comని సందర్శించవచ్చు. -
ఎంసెట్‌లో మెరిసిన జిల్లా విద్యార్థులు
కర్నూలు(విద్య): ఎంసెట్-2014 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన జిల్లా విద్యార్థులు ఎంసెట్ ఫలితాల్లో కూడా రాణించారు. నీలోఫర్ ఉన్నీసా అనే విద్యార్థిని 151/160 మార్కులతో 108వ ర్యాంకు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. అయితే ఇంటర్ మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు ఎంసెట్ ర్యాంకుల విషయంలో కాస్త వెనుకబడ్డారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారి సంఖ్య తగ్గింది. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు విడుదలైన ఎంసెట్ ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులు ఇంటర్నెట్ సెంటర్లకు పరుగులు తీశారు. సర్వర్లు మొరాయించడంతో ఆందోళనకు గురయ్యారు. నారాయణ విద్యార్థుల ప్రభంజనం .. మెడికల్ విభాగంలో ఫలితాల్లో కర్నూలులోని నారాయణ కళాశాలలో విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. నీలోఫర్ ఉన్నీసా 108వ ర్యాంకు, సాయిపవన్‌కుమార్ 294, ఎం. సంహిత 376, శ్రీనాథరెడ్డి 561, సాయిస్నిగ్దారెడ్డి 571, ఎం. జోత్స్నవిరెడ్డి 898, వైశాఖ్ ఆర్.బచ్చు 987, ఎంబి శారద 1,330, హేమచందన సంతోషి 1,694వ ర్యాంకు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో చిన్నవీరేష్ 396వ ర్యాంకు, వి. హరికృష్ణ 473, కె. వంశీకృష్ణ 689, పి. భార్గవ 1,523, వి. హరివంశీ 1,806 ర్యాంకు సాధించి టాపర్లుగా నిలిచారు. ‘శ్రీచైతన్య’ విజయభేరి: కర్నూలు నగరంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ఎంసెట్ ఫలితాల్లో విజయభేరి మోగించారు. మెడికల్ విభాగంలో కె. కావ్య 224వ ర్యాంకు, ఐ. సాయిచంద్రశర్మ 463, టి. శ్రీహరి 467, ఎం. శ్రావణి 739వ ర్యాంకు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో కె. అజయ్ 447, ఎన్. మురళీకృష్ణ 875, ఆర్. వారాహి 1,046, వంశీ 1,256వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. కార్జియాలజిస్ట్ కావాలన్నదే లక్ష్యం: నీలోఫర్ ఉన్నీసా కర్నూలు నగరంలోని కొత్తపేటలో నివాసముంటున్న అబ్దుల్ రహమాన్ పాఠశాల హెచ్ఎంగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన భార్య ఫాతిమా ఉన్నీసా గృహిణి. వీరికి ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. వీరు ప్రతి ఒక్కరినీ ఉన్నతంగా చదివించారు. ప్రస్తుతం వారి ఐదో కూతురు నీలోఫర్ ఉన్నీసా ఎంసెట్ మెడికల్ విభాగంలో 108వ ర్యాంకు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. ఆమె పదో తరగతిలో 9.8 జీపీఏ పాయింట్లు, ఇంటర్లో 984 మార్కులు కైవసం చేసుకుంది. ఎంసెట్ మెడికల్ విభాగంలో 151 మార్కులతో ఏకంగా 108 ర్యాంకు చేజిక్కించుకుంది. తాను కర్నూలు మెడికల్ కాలేజిలో చేరతానని, కార్డియాలజిస్టు కావాలన్నదని తన లక్ష్యమని నీలోఫర్ పేర్కొంది. ఐఐటీలో చేరడమే లక్ష్యం: వంశీకృష్ణ ఐఐటీలో చేరడమే తన లక్ష్యమని ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 689వ ర్యాంకు సాధించిన వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇతని తండ్రి సామన్య రైతు. పిల్లలను ఉన్నతంగా చదివించాలన్న ఉద్దేశంతో కర్నూలు నగరం వచ్చి స్థిరపడ్డారు. ఆయన కష్టానికి ఫలితంగా పిల్లలు మంచి మార్కులతో ఉన్నత స్థానానికి దూసుకెళ్తున్నారు. కర్నూలు నగరంలోని వన్‌టౌన్‌లో నివసిస్తున్న కె. బాలాజిప్రసాద్, కె. సావిత్రి దంపతుల స్వగ్రామం ఎమ్మిగనూరు మండలం కనికవీడు గ్రామం. టెన్త్‌లో 9.5 జీపీఏ పాయింట్లు, ఇంటర్లో 986 మార్కులు సాధించడంతో పాటు జేఈఈ మెయిన్స్‌లోనూ 208 మార్కులు కైవసం చేసుకున్నాడు. ఐఐటీలో చేరడమే లక్ష్యమని వంశీకృష్ణ చెప్పాడు. -
ఎంసెట్‌లో ర్యాంకుల పంట
ఎంసెట్-2014 పరీక్షకు జిల్లాలో మొత్తం 11 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 8,800 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 2,200 మంది పరీక్ష రాశారు. ఇంజినీరింగ్‌లో ... ఎంసెట్‌లో ఇంజినీరింగ్ విభాగంలో ర్యాంకుల సాధనలో స్థానిక శ్రీ చైతన్య విద్యార్థులు అగ్రగాములుగా నిలిచారు. ఒంగోలుకు చెందిన కొంపల్లి వెంకటసాయికిరణ్ ఇంజినీరింగ్ విభాగంలో 140/160 మార్కులతో రాష్ట్రస్థాయిలో 195వ ర్యాంకు సాధించారు. అదే విధంగా పసుమర్తి ఎస్.వి. సాయిశిరీష 137/160 మార్కులతో 273వ ర్యాంకు, వారణాసి సత్యలక్ష్మి 125/160 మార్కులతో 757వ ర్యాంకు, మరో ఐదుగురు విద్యార్థులు 2 వేల లోపు ర్యాంకులను సాధించారు. కొడాలి సత్యనారాయణరావు 118/160తో 1288 ర్యాంకు, కనగాల సుస్మిత 115/160 మార్కులతో 1522వ ర్యాంకు, జె.శ్యాంసుందర్ 115/160 మార్కులతో 1637వ ర్యాంకు, కొండపి వెంకటసాయి చైతన్య 114/160 మార్కులతో 1846వ ర్యాంకు, డి.కావ్యశ్రీ 113/160 మార్కులతో 1911వ ర్యాంకులు తెచ్చుకున్నారు. మెడిసిన్‌లో... ఎంసెట్ మెడిసిన్ విభాగంలో పలువురు తమ సత్తా చాటారు. వెయ్యి లోపు ర్యాంకులు సాధించి తమకు తిరుగులేదని నిరూపించారు. ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు ఎయిడెడ్ పాఠశాలలో పని చేస్తున్న పి.శేషిరెడ్డి కుమార్తె శ్రీనిజ 145/160 మార్కులతో 313వ ర్యాంకు సాధించారు. ఒంగోలుకు చెందిన చలువాది మానస మెడిసిన్‌లో 519వ ర్యాంకు సాధించారు. అద్దంకికి చెందిన విజయ సాయికుమార్ 591వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఒంగోలుకు చెందిన తాటిపర్తి కావ్య 140/160 మార్కులతో 592వ ర్యాంకు తెచ్చుకుంది. కావ్య తల్లి నిర్మల నాగులుప్పలపాడు జిల్లా పరిషత్ హైస్కూలులో ఫిజికల్ సైన్స్ స్కూలు అసిస్టెంట్‌గా పని చేస్తుండగా, తండ్రి సుందరరామిరెడ్డి పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో డీఈగా పని చేస్తున్నారు. నారు హరిప్రియరెడ్డి 1667వ ర్యాంకు సాధించారు. స్టేట్ ఫస్ట్ రావడం ఆనందంగా ఉంది సాయి శ్రీనివాస్ తల్లిదండ్రులు డాక్టర్లు మోహన్‌రామ్, రాధిక మా కుమారుడికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. స్టేట్ ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నాం కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తోందని ఊహించలేదు. ప్రతి వారం విజయవాడ శ్రీ చైతన్య క్యాంపస్‌కు వెళ్లి మా అబ్బాయి చదువుతున్న తీరు, మార్కులపై విశ్లేషణ చేసేవాళ్లం. లెక్చరర్స్‌తో మాట్లాడి మెరుగైన ఫలితాల కోసం సూచనలు చేసే వాళ్లం. మంచి డాక్టరై పశ్చిమ ప్రకాశంలో ప్రజలకు సేవ చేయాలని మా అబ్బాయి శ్రీనివాస్‌కు సూచిస్తున్నాం. మొదటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరిచేవాడు. ఇటీవల నిర్వహించిన వెల్లూరు సీఎంసీలో కూడా మెడికల్ సీటు వచ్చింది. బెనారస్ హిందూ యూనివర్శిటీలో కూడా సీటు వచ్చింది. ఎయిమ్స్ పరీక్ష రాశాడు. ఫలితాల కోసం చూస్తున్నాం. ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్‌లో కూడా ర్యాంక్ వచ్చింది. -
ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్-2014) గురువారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగి సింది. 18 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఇంజినీరింగ్ విభాగం వారికి పరీక్ష నిర్వహించారు. ఇందులో 8444 మంది విద్యార్థులు ఉండగా 7984 మంది (94.5 శాతం) హాజరయ్యారు. 460 మంది విద్యార్థులు హాజరు కాలేదు. 8 సెంటర్లలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మెడిసిన్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 3983 మంది విద్యార్థులకు గాను 3681 మంది (92.4శాతం) హాజరయ్యారు. 302 మంది గైర్హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు ప్రచారం చేయడం వల్ల విద్యార్థులు ముందుగానే సెంటర్లకు చేరుకున్నారు. మెడిసిన్ ప్రవేశపరీక్ష కేంద్రాల్లో జామ ర్లు ఏర్పాటు చేశారు. పోలీసులు విస్త్రతంగా నిఘా ఏర్పాటు చేశారు. ఎన్ఫోర్స్మెంట్, పరిశీ లకుల బృందాలు సెంటర్లను తనిఖీ చేశాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులను సహాయకులుగా తీసుకు రావడంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయి. ఎంసెట్‌కు హాజరయ్యే వివిధ ప్రాంతాల విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు. ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసి కళాశాలల నిర్వాహకులు కూడా గ్రామాల నుంచి విద్యార్థులను తమ వాహనాల్లో తరలించి వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. చాలా మంది ద్విచక్రవాహనాలు, కార్లతో తరలిరావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఎన్జీ కాలేజీ నుంచి క్లాక్‌టవర్ వరకు, హైదరాబాద్ రూట్లో తరచూ ట్రాఫిక్ జామ్ అయ్యింది. పట్టణంలోని భోజన హోటళ్లు కూ డా కిటకిటలాడాయి. ఐస్‌క్రీమ్, సోడాబండ్లు, శీతల పానీయాల అమ్మకం దారులకు కూడా మంచి గిరాకీ లభించింది. ప్రత్యేక బస్సులు ఎంసెట్ విద్యార్థుల కోసం ఆర్టీసీ వారు 36 స్పెషల్ బస్సులను నడిపారు. దేవరకొండ నుంచి 2, నల్లగొండ-4, మిర్యాలగూడ-8, కోదాడ-5, సూర్యాపేట 12, యాదగిరి గుట్ట-5 బస్సులను నడిపారు. విద్యార్థుల నుంచి సాధారణ చార్జీలే వసూలు చేసినట్లు డిప్యూటీ సీటీఎం అనిల్‌కుమార్ తెలిపారు. -
ప్రశాంతంగా ఎంసెట్
జేఎన్టీయూ, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్ గురువారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కేంద్రాల పరిసరాల వద్ద జిరాక్స్ కేంద్రాలను కలెక్టర్ ఆదేశాల మేరకు మూసివేశారు. ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 94.12 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్, మెడికల్‌కు సంబంధించి 92.89 శాతం మంది హాజరయ్యారు. అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, షిరిడీసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎస్ఎస్బీఎన్ కళాశాల, ఎస్వీ డిగ్రీ కళాశాల, ఇంటెలెక్చువల్ ఇంజినీరింగ్ కళాశాల, అనంతలక్ష్మి, పాలిటెక్నిక్ కళాశాల, కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో, రైపర్ , ఇంటెల్ కళాశాల, ఎస్ఆర్ఐటీ, పీవీకేకే , ఎస్వీఐటీ కళాశాల, సీఆర్ఐటీ కళాశాలల్లో మొత్తం 8187 మంది హాజరుకావాల్సి ఉండగా 7706 మంది హాజరైనట్లు జేఎన్టీయూ రీజినల్ కో-ఆర్డినేటర్ ఆచార్య కేఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. 482 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించిన మెడిసిన్ ప్రవేశ పరీక్షకు అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో 544, రైపర్ కళాశాలలో 455, కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో 457, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో 920తో కలిపి మొత్తం 2558 మందికిగాను 2,376 మంది అభ్యర్థులు హాజరయినట్లు ఆయన తెలిపారు. 182 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్షకు ఆలస్యంగా ఎవరూ హాజరు కాలేదన్నారు. మాస్‌కాపీయింగ్, నకిలీ అభ్యర్థులు హాజరుకాకుండా గట్టి నిఘాను ఏర్పాటు చేశామన్నారు. కళ్లజోడు, డిజిటల్ వాచీలను అనుమతించలేదన్నారు. -
ఎంసెట్ ప్రశాంతం
వైవీయూ, న్యూస్‌లైన్: కడప నగరంలో గురువారం నిర్వహించిన ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశాల పరీక్ష ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని 12 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 1.30 నుంచి 5.30 గంటల వరకు 4 పరీక్షా కేంద్రాల్లో మెడిసిన్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు గంట ముందుగానే విద్యార్థులను పరీ క్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. ఇంజినీరింగ్ విభాగంలో 6624 మందికి గాను 6306 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదే విధంగా మెడిసిన్ విభాగానికి 2495 మందికి గాను 2355 మంది పరీక్ష రాశారు. నగరంలోని పరీక్షా కేంద్రాలను ఎంసెట్ కడప ప్రాంతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ బి. జయరామిరెడ్డి తనిఖీ చేశారు. వీరితో పాటు మెడికల్ పరీక్షా కేంద్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియమించారు. ఆలస్యం.. అవకాశం మిస్.. ఉదయం జరిగిన ఇంజినీరింగ్ పరీక్షకు నగరశివారులోని స్విస్ట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఒక విద్యార్థి, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో 1 విద్యార్థి ఆలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. అదే విధంగా మధ్యాహ్నం మెడిసిన్ పరీక్షకు ఒక విద్యార్థిని ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. పరీక్ష సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఆయా పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి ఉచితంగా బస్సులు ఏర్పాటు చేయడం విశేషం. సత్యసాయి సేవాట్రస్టు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.. నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద ఎండలో వేచిఉన్న తల్లిదండ్రులకు విద్యార్థులకు సత్యసాయి సేవాట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ, చల్లటి నీరు పంపిణీ చేశారు.