కౌన్సెలింగ్..
సర్వం సిద్ధం
నేటి నుంచే ధ్రువపత్రాల పరిశీలన
నగరంలోని ఐదు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
తొలిరోజు 1 నుంచి 25 వేల ర్యాంక్ వరకు
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంసెట్-2014 కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు నగరంలో ఐదు కేంద్రాలను ఎంపిక చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రోజుకు 30 వేల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.
ఎంసెట్ 2014 కౌన్సెలింగ్ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపడంతో గురువారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన మొదలుకానుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు ఆరు వేల మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. వికలాంగులు, స్పోర్ట్స్, ఎన్‌సీసీ.. తదితర అభ్యర్థుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలిరోజు 1వ ర్యాంకు నుంచి 25 వేల ర్యాంకుల వరకు పరిశీలన జరుగుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సెలవు. తిరిగి శ నివారం పరిశీలన ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి తీసుకురండి..
ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్
టెన్త్, ఇంటర్ మార్కుల జాబితా
ప్రాథమిక, ఉన్నత విద్య స్టడీ సర్టిఫికెట్లు
జనవరి 1, 2014 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం తదితర ఒరిజినల్ పత్రాలతో పాటు జిరాక్స్ కాపీలు తప్పనిసరి
ఏర్పాట్లు పూర్తి
కౌన్సెలింగ్ పక్రియలో భాగంగా మొదట రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఎస్సీ కేటగిరి విద్యార్థులు రూ. 300, ఓసీ, బీసీ కేటగిరీ విద్యార్థులు రూ. 600 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలి. విడతలవారీగా 100 నుంచి 120 మందిని హాలులోకి అనుమతిస్తాం. మైకు ద్వారా విద్యార్థుల పేర్లను పిలుస్తాం. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించేందుకు ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు ఉంటారు. జేఎన్టీయూహెచ్‌లో ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేశాం, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.
- సీతారామరాజు, జేఎన్టీయూహెచ్ అడ్మిషన్స్ డెరైక్టర్