వైవీయూ, న్యూస్‌లైన్: కడప నగరంలో గురువారం నిర్వహించిన ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశాల పరీక్ష ఎంసెట్-2014 ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని 12 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 1.30 నుంచి 5.30 గంటల వరకు 4 పరీక్షా కేంద్రాల్లో మెడిసిన్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు గంట ముందుగానే విద్యార్థులను పరీ క్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు.
ఇంజినీరింగ్ విభాగంలో 6624 మందికి గాను 6306 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదే విధంగా మెడిసిన్ విభాగానికి 2495 మందికి గాను 2355 మంది పరీక్ష రాశారు. నగరంలోని పరీక్షా కేంద్రాలను ఎంసెట్ కడప ప్రాంతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ బి. జయరామిరెడ్డి తనిఖీ చేశారు. వీరితో పాటు మెడికల్ పరీక్షా కేంద్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను నియమించారు.
ఆలస్యం.. అవకాశం మిస్..
ఉదయం జరిగిన ఇంజినీరింగ్ పరీక్షకు నగరశివారులోని స్విస్ట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఒక విద్యార్థి, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో 1 విద్యార్థి ఆలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. అదే విధంగా మధ్యాహ్నం మెడిసిన్ పరీక్షకు ఒక విద్యార్థిని ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. పరీక్ష సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్‌లను మూసివేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఆయా పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి ఉచితంగా బస్సులు ఏర్పాటు చేయడం విశేషం.
సత్యసాయి సేవాట్రస్టు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ..
నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద ఎండలో వేచిఉన్న తల్లిదండ్రులకు విద్యార్థులకు సత్యసాయి సేవాట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ, చల్లటి నీరు పంపిణీ చేశారు.
ఎంసెట్ ప్రశాంతం
Published Fri, May 23 2014 1:42 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement