టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్), అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్-2017 షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి తెలిపారు.
మార్చి 3 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 7 నుంచి 20వ తేదీ వరకు అప్లికేషన్లో మార్పులు చేసుకోవచ్చు. ఐదు వందల రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 12వ తేదీ వరకు, వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 21వ తేదీ వరకు, ఐదువేల రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 29వ తేదీ వరకు, పదివేల రూపాయల అపరాధ రుసుముతో మే 8వ తేదీ వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
హాల్‌టికెట్లను మే 1వ తేదీ నుంచి 9వ తేదీ మధ్య అభ్యర్థులు వెబ్‌సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 12వ తేదీన ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ కీ మే 13వ తేదీన విడుదల చేస్తారు. ప్రిలిమినరీ కీ పై ఆబ్జెక్షన్లు మే 18వ తేదీ వరకు స్వీకరిస్తారు. మే 22 వ తేదీన ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పరీక్ష ఫీజు 250 రూపాయలు, మిగితావారందరికి 500 రూపాయలుగా నిర్ణయించారు.