Eamcet-2017
-
ప్రారంభమైన టీ.ఎంసెట్ ప్రవేశపరీక్ష
హైదరాబాద్ : ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్–17 పరీక్ష శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఎంసెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఉదయం ఎంసెట్ కోడ్ జె-1ను విడుదల చేశారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం జరగనున్న ఎంసెట్ 2017 అగ్రికల్చర్, ఫార్మసీ ఇతర విభాగాల పరీక్ష కోసం సెట్ కోడ్ S2 ను విడుదల చేశారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న ఇంజినీరింగ్ పరీక్షకు లక్షా 41వేల 163 మంది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరిగే అగ్రి, ఫార్మసీ, వెటర్నరీ పరీక్షకు 79,46 మంది హాజరు అవుతున్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు 246 పరీక్ష కేంద్రాలు, అగ్రి, ఫార్మాకు 154 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను గంట ముందుగానే అనుమతి ఇచ్చారు. ఇక ఈ ఎంసెట్‌కు ఏపీ నుంచి 35 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. -
మే 5న ఏపీ ఎంసెట్ ఫలితాలు
- కన్వీనర్ సాయిబాబు వెల్లడి - మెయిళ్ల ద్వారా అభ్యర్థులకు జవాబుపత్రాలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్–2017 ఫలితాలు మే 5న విడుదల చేయనున్నామని కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ని వెబ్సైట్లో పొందుపరిచామని కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఈ కీపై అభ్యంతరాలు ఉంటే మే 1వ తేదీ సాయంత్రం అయిదు గంటల వరకు స్వీకరిస్తామని చెప్పారు. ఈ అభ్యం తరాలను వెబ్సైట్లో నిర్దేశించిన ఫార్మా ట్లోనే పంపిం చాలని సూచిం చారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షకు సంబంధించి విద్యార్థుల జవాబు పత్రాన్ని వారి ఈమెయిల్ అడ్రస్‌కు పంపిస్తున్నామని, వెబ్సైట్లోనూ పొందుపరుస్తు న్నామని చెప్పారు. ఎంసెట్ ఫలితాలను మే 5న విడుదల చేయాలని నిర్ణయించి నందున ఇంటర్మీడియెట్ కాకుండా సీబీఎస్ఈ, ఏపీఓఎస్ఎస్, ఎన్ఐఓఎస్, డిప్లొమో, ఆర్జేయూకేటీ, ఐఎన్‌సీ, ఇంట ర్మీడియెట్ ఒకేషనల్ ఇతర బోర్డుల ధ్రువ పత్రాలతో పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ప్రత్యేక డిక్లరేషన్ ఫారాలను, మార్కుల జాబితాలను తమకు ముందుగా పంపాలన్నారు. -
15 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
► షెడ్యూలు జారీ.. ► రేపు అందుబాటులోకి నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్(ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్–2017 పరీక్షను మే 12న నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. ఈ మేరకు శనివారం ఎంసెట్ షెడ్యూలు జారీ చేశారు. ఈనెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని, ఆన్లైన్లోనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి షెడ్యూలు, నోటిఫికేషన్‌ను ఈనెల 13న విడుదల చేయనున్నట్లు వివరించారు. తమ వెబ్సైట్లోనూ (www.eamcet.tsche.ac.in) నోటిఫికేషన్ అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. గత నెల 27న నోటిఫికేషన్ జారీ చేసి, ఈనెల 3 నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ సర్వీస్ ప్రొవైడర్ సమస్య కారణంగా ఆలస్యమైంది. దరఖాస్తుల తేదీలు మారాయి. పరీక్ష తేదీ మాత్రం మారలేదు. ముందు ప్రకటించినట్లుగానే మే 12న పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 250, ఇతరులు రూ. 500 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రెండు పరీక్షలకు హాజరవాలనుకునే విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలైతే రూ. 500, ఇతరులు రూ. 1,000 చెల్లించాలి. టీఎస్ ఆన్లైన్/ఏపీ ఆన్లైన్/మీసేవా/ఈసేవా/క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు/నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. పరీక్షల నిర్వహణకు తెలంగాణలో 16, ఏపీలో 3 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పాలిసెట్ ఏప్రిల్ 22న.. 14నుంచి దరఖాస్తులు నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్బీటీఈటీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు పాలి టెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవే శాల కోసం పాలిసెట్–2017 పరీక్షను ఏప్రిల్ 22న నిర్వహించేందుకు సాంకేతిక విద్యా, పరిశోధన మండలి (ఎస్బీటీఈటీ) చర్యలు చేపట్టింది. ఈ మేరకు శనివారం పాలిసెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 50 పట్టణాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు, ప్రభుత్వ కాలేజీలు, డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించింది. హెల్ప్‌లైన్ కేంద్రాలు, టీఎస్, ఏపీ ఆన్లైన్ కేంద్రాలు, నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్/ డెబిట్ కార్డులతో పరీక్ష ఫీజు చెల్లించి దర ఖాస్తు చేసుకోవాలంది. జనరల్,బీసీ విద్యార్థులు రూ.350.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 పరీక్ష ఫీజు చెల్లించా లని తెలిపింది. ఏప్రిల్ 22 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే పాలిసెట్‌లో మ్యాథమెటిక్స్‌లో 60, ఫిజిక్స్‌లో 30, కెమెస్ట్రీలో 30 మార్కుల కు ప్రశ్నలు ఉంటాయంది. మొత్తంగా 120 ప్రశ్నలకు 120 మార్కులుంటాయని, 36 మార్కులొస్తే అర్హత సాధించినట్లు పరిగణన లోకి తీసుకుంటామని పేర్కొంది. పదో తరగతి పూర్తయి పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పరీక్ష రాయొచ్చ ని, రాష్ట్రవ్యాప్తంగా 53,470 సీట్లను పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు వివరించింది. ఓపెన్ కోటాలో సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరు కావచ్చని ఎస్బీటీఈటీ తెలిపింది. గతేడాది 1,24,747 మంది పరీక్షకు హాజరవగా.. 1,03,001 మంది అర్హత సాధించారు. ఈసెట్ షెడ్యూలు విడుదల.. 13న నోటిఫికేషన్.. 16 నుంచి దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) విద్యార్థులు.. బీఈ/బీటెక్/బీఫార్మా కోర్సుల ద్వితీయ సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ) చేరేందుకు నిర్వహించే ఈసెట్–2017 రివైజ్డ్ షెడ్యూలును సెట్ కన్వీనర్ గోవర్దన్ శనివారం జారీచేశారు. గత నెల 27వ తేదీనే నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నప్పటికీ సర్వీస్ ప్రొవైడర్ సమస్య కారణంగా ఈనెల 13న ఈసెట్ నోటిఫికేషన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని వివరించారు. మే 6న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలైతే రూ. 400, ఇతరులు రూ. 800 నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు. -
మార్చి 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
-
మార్చి 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
ఏప్రిల్ 3 వరకు ఆన్లైన్లో స్వీకరణ మే 12న పరీక్ష.. అదేనెల 22న ర్యాంకుల ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2017 షెడ్యూల్ జారీ అయింది. మే 12న నిర్వహించనున్న ఎంసెట్‌కు వచ్చేనెల 3 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. సోమవారమిక్కడ జేఎన్టీయూహెచ్లో జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.250 చెల్లించాలి. ఇతర విద్యార్థులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్ నిర్వహణ కోసం 25 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 6, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో 16, ఆంధ్రప్రదేశ్‌లో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో కర్నూలులోనూ సమన్వయ కేంద్రం ఏర్పాటు చేసినా.. ఈసారి ఇవ్వలేదు. మహబూబ్‌నగర్, వనపర్తి సమన్వయ కేంద్రాలు సమీపంలోనే ఉండటం, కర్నూలులో పరీక్ష రాసే వారి సంఖ్య తక్కువగా ఉన్నందున అక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని విలేకరుల సమావేశంలో పాపిరెడ్డి తెలిపారు. ఈసారి కొత్తగా నిర్మల్, భువనగిరి, శంషాబాద్, పెద్దపల్లిలో సమన్వయ కేంద్రా లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్‌లో 2 జోనల్ కేం ద్రాలను తగ్గించినట్లు పేర్కొ న్నారు. గతేడాది ఎంసెట్ లీకేజీ నేపథ్యంలో ప్రశ్నపత్రాల ముద్రణ, పరీక్షల నిర్వహణలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుం టున్నట్లు వెల్లడిం చారు. సమావేశంలో ఎంసెట్ కమిటీ చైర్మన్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.మల్లేశం, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య, కో కన్వీనర్ ప్రొఫెసర్ మంజూర్, ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్, కో–కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయుష్‌పై ఆరోగ్య శాఖకు లేఖ రాస్తాం నీట్ పరిధిలోకి ఆయుష్ కోర్సులు వెళ్లే విషయంలో తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని పాపిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల తోపాటు ఆయుష్ (ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, నేచురోపతి, యోగా) కోర్సులకు ఎంసెట్ చేపడుతున్నామన్నారు. ఆయుష్‌పై స్పష్టత కోసం వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాస్తామన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ నిర్వహిస్తారా? తాము ఎంసెట్ నిర్వహించాలా? అన్న అంశాన్ని అడుగుతామని, వారి నుంచి వచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు చేపడతామన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుతించబోమని, విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈసారి గంట ముందు నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలా? వద్దా? అన్నది తర్వాత నిర్ణయిస్తామన్నారు. మే నెలాఖరుకల్లా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించామని, ఈసారి త్వరగా ప్రవేశాలు చేపట్టి జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 2018 నుంచి జాతీయ స్థాయి పరీక్షల ద్వారా ప్రవేశాలపై కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలతో మాట్లాడాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్‌లో ఆన్లైన్ పరీక్షలు భవిష్యత్‌లో ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో చేప ట్టేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి తెలి పారు. గతేడాది అగ్రికల్చర్ ఎంసెట్‌ను ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో నిర్వ హించినా... ఈసారి ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. ఏపీలో అన్ని పరీక్షలను ఆన్లైన్లో నిర్వ హించేందుకు చర్యలు చేపట్టారని, అక్కడి ఫలి తాలను పరిశీలించి, భవిష్యత్‌లో అవసర మైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈసారి ఈసెట్, పీజీఈసెట్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిం చేందుకు చర్యలు చేపట్టామన్నారు. -
టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్), అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్-2017 షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి తెలిపారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 7 నుంచి 20వ తేదీ వరకు అప్లికేషన్లో మార్పులు చేసుకోవచ్చు. ఐదు వందల రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 12వ తేదీ వరకు, వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 21వ తేదీ వరకు, ఐదువేల రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 29వ తేదీ వరకు, పదివేల రూపాయల అపరాధ రుసుముతో మే 8వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్‌టికెట్లను మే 1వ తేదీ నుంచి 9వ తేదీ మధ్య అభ్యర్థులు వెబ్సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 12వ తేదీన ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ కీ మే 13వ తేదీన విడుదల చేస్తారు. ప్రిలిమినరీ కీ పై ఆబ్జెక్షన్లు మే 18వ తేదీ వరకు స్వీకరిస్తారు. మే 22 వ తేదీన ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పరీక్ష ఫీజు 250 రూపాయలు, మిగితావారందరికి 500 రూపాయలుగా నిర్ణయించారు. -
20న ఎంసెట్ నోటిఫికేషన్!
-
20న ఎంసెట్ నోటిఫికేషన్!
ఏర్పాట్లను పూర్తి చేసిన జేఎన్టీయూ 20న ఎంసెట్ కమిటీ సమావేశం అదే రోజున షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడంపై తర్జన భర్జన హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్–2017 ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 20వ తేదీన నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఉన్నత విద్యా మండలి సర్వం సిద్ధం చేస్తోంది. పరీక్షకు ముందు, తరువాత చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన ప్రక్రియను కూడా ఖరారు చేసింది. ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ, ప్రాసెసింగ్, ఫీజు చెల్లింపు వంటి ఆన్లైన్ సేవలపై గురువారం ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశమై చర్చించింది. ఆన్లైన్ సేవలు అందించే వెండర్లను ఖరారు చేసింది. మరోవైపు ఈ నెల 20న ఎంసెట్ పరీక్ష కమిటీ (సెట్ కమిటీ) సమావేశం నిర్వహించేందుకు జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. ఆ సమావేశంలో విధి విధానాలను ఖరారు చేయడంతోపాటు, ఎంసెట్ షెడ్యూల్, నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంది. ఆ రోజున వీలు కాకపోతే తర్వాతి రోజున షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లపై ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య దృష్టి సారించారు. నోటిఫికేషన్లో ఉండాల్సిన నిబంధనలు, దరఖాస్తు తేదీలు, ఫీజు వివరాలు, అర్హతలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. ఇక ఎంసెట్ పరీక్ష ఫీజులో మార్పు చేయవద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు రూ. 250, బీసీలు, ఇతరులకు రూ. 500 పరీక్ష ఫీజునే ఈసారి కూడా కొనసాగించాలని భావిస్తున్నారు. ఆన్లైన్లో పరీక్ష అవసరమా? జేఎన్టీయూ గతేడాది ఎంసెట్‌లో ఆన్లైన్ పరీక్షా విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇంజనీ రింగ్‌ను మినహాయించి అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సులకు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్లైన్ లోనూ పరీక్ష నిర్వహించింది. కానీ కేవలం 500 మంది విద్యార్థులే ఆన్లైన్ పరీక్షకు హాజర య్యారు. ఈసారి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర మెడికల్ కోర్సులన్నీ ‘నీట్’ పరిధిలోకి వెళ్లిపోయాయి. వాటిలో నీట్ ద్వారానే ప్రవేశాలు చేపట్టనున్నారు. దీంతో ఎంసెట్‌లో ఇంజనీరింగ్ తో పాటు బీఫార్మా, బీటెక్ బయోటెక్నాలజీ (బైపీసీ), ఫార్మ్‌డీ (బైపీసీ), బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, బీఎఫ్ఎస్సీ, బీటెక్ (ఎఫ్ఎస్టీ), బీఎస్సీ (సీఏ, బీఎం)వంటి కోర్సులకే ఎంసెట్‌ను నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్‌కు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజ రవుతారు. దానిని మినహాయిస్తే మిగతా కోర్సు ల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ పరీక్ష అవసరమా? రాతపరీక్ష నిర్వహిస్తే సరిపోతుందా? అన్న దానిపై తర్జన భర్జన సాగుతోంది. దీనిపై ఈ నెల 20న తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
మాకొద్దంటే మాకొద్దు
ఎంసెట్ కన్వీనర్ బాధ్యతలు తీసుకునేందుకు సీనియర్ ప్రొఫెసర్ల వెనుకంజ ఇతర సెట్లదీ అదే పరిస్థితి 2016 ఎంసెట్ లీకేజీ నేపథ్యంలో కొత్త కన్వీనర్ల ఎంపికలో జాగ్రత్తలపై దృష్టి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2016 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్–2017 కన్వీనర్ బాధ్యతలు స్వీకరించేందుకు సీనియర్ ప్రొఫెసర్లే జంకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకేజీ ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో.. కష్టపడి పని చేసి, అభాసుపాలు కావడమెందుకన్న ధోరణి ప్రొఫెసర్లలో ఏర్పడింది. అందుకే ఈసారి ఎంసెట్ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు సీనియర్ ప్రొఫెసర్లు అంతగా సానుకూలత వ్యక్తం చేయడం లేదని తెలిసింది. ఎంసెట్‌ను నిర్వహించే జేఎన్టీయూహెచ్లోని ఏ ప్రొఫెసర్‌కు ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలన్న విషయంలో వర్సిటీ కూడా తర్జనభర్జన పడుతోంది. ఎంసెట్–2017 నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూహెచ్కు అప్పగిస్తూ ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు ఎంసెట్ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించేందుకు ముగ్గురి పేర్లను జేఎన్టీయూహెచ్ ఉన్నత విద్యా మండలికి సిఫారసు చేయాల్సి ఉంది. అయితే ఈ విషయంలో గతంలో ఎంసెట్‌ను నిర్వహించిన ప్రొఫెసర్లు, ఇతర ప్రొఫెసర్లతో జేఎన్టీయూ హెచ్ సంప్రదింపులు జరుపుతోంది. అయితే గతంలో కన్వీనర్లుగా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు, ప్రొఫెసర్ యాదయ్య ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది అయితే యూనివర్సిటీ మాత్రం వారిద్దరితోపాటు మరొకరి పేరును సిఫారసు చేసే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకటీ రెండు రోజుల్లో ఎంసెట్ కన్వీనర్ ఎవరన్న విషయంలో స్పష్టత రానుంది. మరోవైపు ఈసారి ఎంసెట్ నిర్వహణ విషయంలో గతంలో కంటే మరింత పకడ్బం దీ చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఆ దిశగా యూనివర్సిటీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుత జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి ఎంసెట్–2017కు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈసారి సెట్స్‌కు కొత్త కన్వీనర్లే! మరోవైపు ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. దీంతో మొత్తానికి ఈసారి సెట్స్‌కు పాత వారికంటే కొత్త కన్వీనర్లే ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఎడ్‌సెట్, పీజీఈసెట్, పీఈసెట్‌కు కొత్త కన్వీనర్లే వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ఎడ్‌సెట్ నిర్వహించిన ప్రొపెసర్ ప్రసాద్, పీఈసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ ప్రభాకర్ రావు పదవీ విరమణ పొందారు. గత ఏడాది పీజీఈసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ రామచంద్రం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అయ్యారు. దీంతో ఆ మూడు సెట్ల నిర్వహణ బాధ్యతలను కొత్తవారికే అప్పగించే అవకాశం ఉంది. కాకతీయ యూనివర్సిటీకి అప్పగించిన ఐసెట్, లాసెట్, పీజీలాసెట్‌ను గత ఏడాది నిర్వహించిన ప్రొఫెసర్ ఓంప్రకాశ్, ప్రొఫెసర్ రంగారావులకే అప్పగించే అవకాశం ఉంది. -
ఎంసెట్ పరీక్షకు తేదీ ఖరారు!
-
మే 12న ఎంసెట్
► ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి ► పీజీఈసెట్, ఈసెట్‌లను ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయం ► సంక్రాంతి అనంతరం కన్వీనర్లు, ఇతర వివరాల ప్రకటన సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యా కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం (2017–18) ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా మిగతా అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సులు, ఇంజనీరింగ్‌లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం మే 12న ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. దీంతోపాటు బీఈ/బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, యూజీడీపీఈడీ, బీపీఈడీ, మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎంఈ/ ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ప్లానింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల తేదీలనూ ఖరారు చేశామని నిర్వహణ విద్యా సంస్థలను ఎంపిక చేశామన్నారు. ఏపీలో ఆలస్యమయ్యే పరిస్థితి ఉన్నందునే..: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేశాక.. రాష్ట్రంలో తేదీలను ఖరారు చేయాలని తొలుత ఉన్నత విద్యా మండలి భావించింది. అయితే పరీక్షలపై ఏపీ అధికారులు కసరత్తు చేసినా ఇంకా తేదీలను ప్రకటించలేదు. దీంతో తామే ముందుగా తేదీలను ఖరారు చేశామని పాపిరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలకు కొన్ని రోజులు అటూఇటుగా ఏపీ పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. ఆన్లైన్లో పీజీఈసెట్, ఈసెట్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) మే 6వ తేదీన నిర్వహించే ఈసెట్ పరీక్షను.. ఎంటెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షను ఈ సారి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సంక్రాంతి తర్వాత కన్వీనర్లు, పరీక్ష వేళలు ఖరారు! ప్రవేశ పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలను ఖరారు చేసిన ఉన్నత విద్యా మండలి.. ఆయా పరీక్షలను నిర్వహించే కన్వీనర్లు, పరీక్ష వేళలపై కసరత్తు చేస్తోంది. శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు ఉన్నందున.. ఈనెల 17 లేదా 18వ తేదీన వీటిని ఖరారు చేయనుంది. కన్వీనర్లకు సంబంధించి ఒక్కో సెట్‌కు ఆయా యూనివర్సిటీలు ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలి. అందులోంచి కన్వీనర్లను ఖరారు చేస్తారు.