15 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
► షెడ్యూలు జారీ..
► రేపు అందుబాటులోకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్(ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్–2017 పరీక్షను మే 12న నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. ఈ మేరకు శనివారం ఎంసెట్ షెడ్యూలు జారీ చేశారు. ఈనెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని, ఆన్‌లైన్‌లోనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి షెడ్యూలు, నోటిఫికేషన్‌ను ఈనెల 13న విడుదల చేయనున్నట్లు వివరించారు. తమ వెబ్‌సైట్‌లోనూ (www.eamcet.tsche.ac.in) నోటిఫికేషన్ అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. గత నెల 27న నోటిఫికేషన్ జారీ చేసి, ఈనెల 3 నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ సర్వీస్ ప్రొవైడర్ సమస్య కారణంగా ఆలస్యమైంది.
దరఖాస్తుల తేదీలు మారాయి. పరీక్ష తేదీ మాత్రం మారలేదు. ముందు ప్రకటించినట్లుగానే మే 12న పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 250, ఇతరులు రూ. 500 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రెండు పరీక్షలకు హాజరవాలనుకునే విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలైతే రూ. 500, ఇతరులు రూ. 1,000 చెల్లించాలి. టీఎస్ ఆన్‌లైన్/ఏపీ ఆన్‌లైన్/మీసేవా/ఈసేవా/క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు/నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. పరీక్షల నిర్వహణకు తెలంగాణలో 16, ఏపీలో 3 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
పాలిసెట్ ఏప్రిల్ 22న..
14నుంచి దరఖాస్తులు
నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్‌బీటీఈటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు పాలి టెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవే శాల కోసం పాలిసెట్–2017 పరీక్షను ఏప్రిల్ 22న నిర్వహించేందుకు సాంకేతిక విద్యా, పరిశోధన మండలి (ఎస్‌బీటీఈటీ) చర్యలు చేపట్టింది. ఈ మేరకు శనివారం పాలిసెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 50 పట్టణాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు, ప్రభుత్వ కాలేజీలు, డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించింది. హెల్ప్‌లైన్ కేంద్రాలు, టీఎస్, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలు, నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్/ డెబిట్ కార్డులతో పరీక్ష ఫీజు చెల్లించి దర ఖాస్తు చేసుకోవాలంది. జనరల్,బీసీ విద్యార్థులు రూ.350.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 పరీక్ష ఫీజు చెల్లించా లని తెలిపింది.
ఏప్రిల్ 22 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే పాలిసెట్‌లో మ్యాథమెటిక్స్‌లో 60, ఫిజిక్స్‌లో 30, కెమెస్ట్రీలో 30 మార్కుల కు ప్రశ్నలు ఉంటాయంది. మొత్తంగా 120 ప్రశ్నలకు 120 మార్కులుంటాయని, 36 మార్కులొస్తే అర్హత సాధించినట్లు పరిగణన లోకి తీసుకుంటామని పేర్కొంది. పదో తరగతి పూర్తయి పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పరీక్ష రాయొచ్చ ని, రాష్ట్రవ్యాప్తంగా 53,470 సీట్లను పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు వివరించింది. ఓపెన్ కోటాలో సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరు కావచ్చని ఎస్‌బీటీఈటీ తెలిపింది. గతేడాది 1,24,747 మంది పరీక్షకు హాజరవగా.. 1,03,001 మంది అర్హత సాధించారు.
ఈసెట్ షెడ్యూలు విడుదల..
13న నోటిఫికేషన్..
16 నుంచి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) విద్యార్థులు.. బీఈ/బీటెక్/బీఫార్మా కోర్సుల ద్వితీయ సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ) చేరేందుకు నిర్వహించే ఈసెట్–2017 రివైజ్డ్ షెడ్యూలును సెట్ కన్వీనర్ గోవర్దన్ శనివారం జారీచేశారు. గత నెల 27వ తేదీనే నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నప్పటికీ సర్వీస్ ప్రొవైడర్ సమస్య కారణంగా ఈనెల 13న ఈసెట్ నోటిఫికేషన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని వివరించారు. మే 6న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలైతే రూ. 400, ఇతరులు రూ. 800 నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు.