20న ఎంసెట్ నోటిఫికేషన్!
ఏర్పాట్లను పూర్తి చేసిన జేఎన్టీయూ
20న ఎంసెట్ కమిటీ సమావేశం
అదే రోజున షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం
ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడంపై తర్జన భర్జన
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్–2017 ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 20వ తేదీన నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఉన్నత విద్యా మండలి సర్వం సిద్ధం చేస్తోంది. పరీక్షకు ముందు, తరువాత చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన ప్రక్రియను కూడా ఖరారు చేసింది. ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ, ప్రాసెసింగ్, ఫీజు చెల్లింపు వంటి ఆన్‌లైన్ సేవలపై గురువారం ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశమై చర్చించింది. ఆన్‌లైన్ సేవలు అందించే వెండర్లను ఖరారు చేసింది. మరోవైపు ఈ నెల 20న ఎంసెట్ పరీక్ష కమిటీ (సెట్ కమిటీ) సమావేశం నిర్వహించేందుకు జేఎన్టీయూ చర్యలు చేపట్టింది.
ఆ సమావేశంలో విధి విధానాలను ఖరారు చేయడంతోపాటు, ఎంసెట్ షెడ్యూల్, నోటిఫికేషన్‌లను జారీ చేసే అవకాశం ఉంది. ఆ రోజున వీలు కాకపోతే తర్వాతి రోజున షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లపై ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య దృష్టి సారించారు. నోటిఫికేషన్‌లో ఉండాల్సిన నిబంధనలు, దరఖాస్తు తేదీలు, ఫీజు వివరాలు, అర్హతలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. ఇక ఎంసెట్ పరీక్ష ఫీజులో మార్పు చేయవద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు రూ. 250, బీసీలు, ఇతరులకు రూ. 500 పరీక్ష ఫీజునే ఈసారి కూడా కొనసాగించాలని భావిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో పరీక్ష అవసరమా?
జేఎన్టీయూ గతేడాది ఎంసెట్‌లో ఆన్‌లైన్ పరీక్షా విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇంజనీ రింగ్‌ను మినహాయించి అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సులకు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్ లోనూ పరీక్ష నిర్వహించింది. కానీ కేవలం 500 మంది విద్యార్థులే ఆన్‌లైన్ పరీక్షకు హాజర య్యారు. ఈసారి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర మెడికల్ కోర్సులన్నీ ‘నీట్’ పరిధిలోకి వెళ్లిపోయాయి. వాటిలో నీట్ ద్వారానే ప్రవేశాలు చేపట్టనున్నారు.
దీంతో ఎంసెట్‌లో ఇంజనీరింగ్ తో పాటు బీఫార్మా, బీటెక్ బయోటెక్నాలజీ (బైపీసీ), ఫార్మ్‌డీ (బైపీసీ), బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్ (ఎఫ్‌ఎస్‌టీ), బీఎస్సీ (సీఏ, బీఎం)వంటి కోర్సులకే ఎంసెట్‌ను నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్‌కు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజ రవుతారు. దానిని మినహాయిస్తే మిగతా కోర్సు ల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ పరీక్ష అవసరమా? రాతపరీక్ష నిర్వహిస్తే సరిపోతుందా? అన్న దానిపై తర్జన భర్జన సాగుతోంది. దీనిపై ఈ నెల 20న తుది నిర్ణయం తీసుకోనున్నారు.