రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్–2017 ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 20వ తేదీన నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఉన్నత విద్యా మండలి సర్వం సిద్ధం చేస్తోంది. పరీక్షకు ముందు, తరువాత చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన ప్రక్రియను కూడా ఖరారు చేసింది. ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ, ప్రాసెసింగ్, ఫీజు చెల్లింపు వంటి ఆన్‌లైన్ సేవలపై గురువారం ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశమై చర్చించింది. ఆన్‌లైన్ సేవలు అందించే వెండర్లను ఖరారు చేసింది. మరోవైపు ఈ నెల 20న ఎంసెట్ పరీక్ష కమిటీ (సెట్ కమిటీ) సమావేశం నిర్వహించేందుకు జేఎన్టీయూ చర్యలు చేపట్టింది.