మే 12న ఎంసెట్ | Eamcet-2017 on May12th Announced by Higher Education Council | Sakshi
Sakshi News home page

మే 12న ఎంసెట్

Published Fri, Jan 13 2017 1:56 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

మే 12న ఎంసెట్ - Sakshi

మే 12న ఎంసెట్

ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి
పీజీఈసెట్, ఈసెట్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయం
సంక్రాంతి అనంతరం కన్వీనర్లు, ఇతర వివరాల ప్రకటన  


సాక్షి, హైదరాబాద్‌: వృత్తి విద్యా కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం (2017–18) ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ మినహా మిగతా అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కోర్సులు, ఇంజనీరింగ్‌లో (బీఈ/బీటెక్‌) ప్రవేశాల కోసం మే 12న ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. దీంతోపాటు బీఈ/బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, యూజీడీపీఈడీ, బీపీఈడీ, మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ,     ఎంఈ/ ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ప్లానింగ్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల తేదీలనూ ఖరారు చేశామని నిర్వహణ విద్యా సంస్థలను ఎంపిక చేశామన్నారు.

ఏపీలో ఆలస్యమయ్యే పరిస్థితి ఉన్నందునే..: ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేశాక.. రాష్ట్రంలో తేదీలను ఖరారు చేయాలని తొలుత ఉన్నత విద్యా మండలి భావించింది. అయితే పరీక్షలపై ఏపీ అధికారులు కసరత్తు చేసినా ఇంకా తేదీలను ప్రకటించలేదు. దీంతో తామే ముందుగా తేదీలను ఖరారు చేశామని పాపిరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలకు కొన్ని రోజులు అటూఇటుగా ఏపీ పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందన్నారు.

ఆన్‌లైన్‌లో పీజీఈసెట్, ఈసెట్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్‌ ఎంట్రీ) మే 6వ తేదీన నిర్వహించే ఈసెట్‌ పరీక్షను.. ఎంటెక్‌ తదితర    
కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్‌ పరీక్షను ఈ సారి ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

సంక్రాంతి తర్వాత కన్వీనర్లు, పరీక్ష వేళలు ఖరారు!
ప్రవేశ పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలను ఖరారు చేసిన ఉన్నత విద్యా మండలి.. ఆయా పరీక్షలను నిర్వహించే కన్వీనర్లు, పరీక్ష వేళలపై కసరత్తు చేస్తోంది. శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు ఉన్నందున.. ఈనెల 17 లేదా 18వ తేదీన వీటిని ఖరారు చేయనుంది. కన్వీనర్లకు సంబంధించి ఒక్కో సెట్‌కు ఆయా యూనివర్సిటీలు ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలి. అందులోంచి కన్వీనర్లను ఖరారు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement