వాంటెడ్ జాబ్స్
లక్షల్లో నిరుద్యోగులు వందల్లో ఉద్యోగాలు
ఓటీఆర్‌లో 1,27,656 మంది నమోదు
ఓటీఆర్ చేసుకోని నిరుద్యోగులు ఎక్కువే
గ్రూప్-2కు 80,442 దరఖాస్తులు
ఒక్కో పోస్టుకు 1285 మంది పోటీ
కానిస్టేబుల్ దరఖాస్తులు 60వేల పైనే
జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీతోపాటు వివిధ కోర్సులు చదివిన పట్టభద్రులు ఏళ్ల తరబడిగా ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా కొత్త రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు. స్వరాష్ట్రంలో మన వనరులు మనకు.. మన ఉద్యోగాలు మనకు వస్తాయని చాలా మంది ఆశపడ్డారు. ప్రత్యేకరాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు అంతంత మాత్రమే వెలువడ్డాయి. ఉద్యోగాలు వేలల్లో ఉంటే దరఖాస్తులు చేసుకునే వారు లక్షల్లో ఉన్నారంటే.. ఉద్యోగాల కోసం ఎంత మంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్ డిగ్రీ, పీజీ చదివిన వారితో పాటు ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఎంసీఏ, ఎంబీఏ, బీఈడీ చదివిన వారు సైతం గ్రూప్-2, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారంటే.. దాని అర్థం ఉద్యోగాల ఆకలి నిరుద్యోగులకు అంతలా ఉందని. - బోయినపల్లి
ఓటీఆర్‌లో 1,27,656 మంది
ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ)పై నిరుద్యోగులు ఎంతో భరోసాతో ఉన్నారు. దీనికి ఇటీవల టీపీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో పెద్ద సంఖ్యలో నమోదు చేసుకోవడమే నిదర్శనం. నిరుద్యోగులు ఒకసారి ఓటీఆర్‌లో తమ వివరాలు నమోదు చేసుకుంటే వారి విద్యార్హతలను బట్టి టీపీఎస్‌సీ విడుదల చేసే ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన సమాచారం అందుతుంది. ఇందులో గత బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా నిరుద్యోగులు నమోదు చేసుకుంటే.. మన జిల్లానే ప్రథమస్థానంలో ఉండటం విశేషం. ఓటీఆర్‌లో జిల్లా నుంచి 1,27,656 మంది నమోదు కాగా.. ఇందులో పురుషులు 79,998, మహిళలు 47,658 ఉన్నారు. వీరిలోనూ అత్యధికంగా ఇంజనీరింగ్, పీజీ పట్టభద్రులే ఉండటంతో ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ తగిన ఉద్యోగాలు రావడం లేదనే విష యం స్పష్టమవుతోంది. ఓటీఆర్‌లో నమోదు చేసుకో ని వారు లక్షన్నరపైగా ఉన్నారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది యువతీ యువకులు ఉద్యోగాన్వేషణలో ఉన్నట్లు అంచనా.
గ్రూప్-2కు 80,442 దరఖాస్తులు
టీపీఎస్సీ 439 గ్రూప్-2 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో పై ఉద్యోగాల కోసం 80,442 మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల నుంచి 5,64,431 మంది దరఖాస్తు చేసుకుంటే.. మన జిల్లా నుంచే అధికంగా దరఖాస్తులు వచ్చారుు. ఇందులో 2,03,379 మంది మహిళా అభ్యర్థులు, 3,61,052 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 1,285మంది పోటీ పడుతున్నారు. గ్రూప్-2 పోస్టుల్లో గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ 19, ఏసీటీవో 110, గ్రేడ్-2 సబ్‌రిజిస్ట్రార్ 23, పంచాయతీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ 67, ఎక్సైజ్ ఎస్సై 220 ఉన్నాయి. వీటికి ఏప్రిల్ 24, 25 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించేందుకు టీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-2 ఉద్యోగాలకు డిగ్రీ, పీజీ అభ్యర్థులతో పాటు ఇతర డిగ్రీలు చేసిన వారుసైతం దరఖాస్తులు చేసుకున్నారు. ఆరు నెలల క్రితం సుమారు 9 వేల ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఇంజనీరింగ్ చదవిన నిరుద్యోగులు ఎక్కువగా ఉండి, పోస్టులు తక్కువగా ఉండటంతో అందులో ఉద్యోగాలు రాని వారు ఇపుడు గ్రూప్-2కు దరఖాస్తులు చేసుకున్నారు.
పోలీస్ ఉద్యోగాలకు పోటాపోటీ
రాష్ట్రంలో 9281 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేయగా, సుమారు 5.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జిల్లా నుంచి సుమారు 60వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా. వీరిలో పదో తరగతి నుంచి పీజీ దాకా, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సులు చేసిన వారూ ఉన్నారు. జిల్లాకు 130 సివిల్, 160 ఏఆర్ పోస్టులు కేటాయించగా వీటికోసం పోటీపడుతున్న నిరుద్యోగులు మాత్రం పెద్ద సంఖ్యలో ఉండటం విశేషం. అలాగే ఇటీవల రాష్ట్రంలో 539 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. అభ్యర్థులు ఈ నెల 10 నుంచి మార్చి 3వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ఇవి కాకుండా 18,252 ఆర్‌ఆర్‌బీ ఉద్యోగాలు, 700 ఎల్‌ఐసీ ఏఏఓ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 70 ఏఈఓ పోస్టులు భర్తీ చేయడానికి ఉద్యోగ ప్రకటన వెలువరించారు. వీటన్నింటికి లక్షల్లో నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
పక్షం రోజుల కిందే ఎస్సీ స్టడీ సర్కిల్
నిరుద్యోగులకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఉండగా, ఎస్సీ స్టడీ సర్కిల్‌ను ఇరవై రోజుల కింద ఏర్పాటు చేసింది. బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్స్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌ల్లో ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు ఇందులో గ్రూప్-2 ఉద్యోగాలకు శిక్షణ ఇస్తారు. ఎస్సీ స్టడీ సర్కిల్ ఇటీవలే ఏర్పాటు చేయడంతో అందులో శిక్షణ ఇపుడిపుడే ప్రారంభం అవుతోంది. అందులో శిక్షణ పొందేవారు పరీక్షల తేదీ పెంచాలని కోరుతున్నారు.
ఇటీవల విడుదలైన ఉద్యోగ ప్రకటనలు ఇవి
గ్రూప్-2 పోస్టులు 439
పోలీస్ కానిస్టేబుల్ 9281
ఆర్‌ఆర్‌బీ పోస్టులు 18252
ఎస్సై ఉద్యోగాలు 539
ఎల్‌ఐసీ ఏఏఓ 700