siva srinivas
-
ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ అన్నా రు. ప్రజావాణిలో భాగంగా సోమవారం జిల్లా పరిషత్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజావాణికి హాజరవుతారని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కొణిజర్ల మండలం బస్వాపురం గ్రామానికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు ఇటీవల కాలంలో పిడుగుపడి తన రెండు ఆవులు మృతి చెందాయని, ఆవుల ద్వారా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనకు న్యా యం చేయాలని విన్నవించారు. బీసీ హాస్టల్లో వాచ్మెన్ ఉద్యోగం కోసం సీఎం కార్యాలయంలో సంప్రదించగా అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని సూచించారని కల్లూరుకు చెందిన షేక్ గఫార్ డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. సీఎం కార్యాలయం నుంచి ఇచ్చిన ప్రతులను చూపించారు. డీఆర్వో ఉన్నతాధికారుల ఆదేశానుసారం సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. పలువురు వినతిపత్రాలు సమర్పించగా, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నగేష్ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని..... ఇంటి స్థలం కోసం తిరుగుతున్నా స్వాతంత్య్ర సమరయోధురాలిగా ఉన్న పెండ్యాల శేషారత్నం ఇంటి స్థలం ఇప్పించాలని డీఆర్వోకు విన్నవించారు. గతంలో కలెక్టర్, జేసీలను కలిసి సమస్యను విన్నవించానన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చినట్లు శేషారత్నం తెలిపారు. -శేషారత్నం, ఖమ్మం ఇల్లు కోసం వినతి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనకు ఇంటి స్థలం ఇచ్చి ఆదుకోవాలని ప్రజావాణిలో డీఆర్వోకు విన్నవించినట్లు నగరంలోని విజయనగర్ కాలనీకి చెందిన బి.అప్పారావు తెలిపారు. గతంలో కూడా సమస్యను విన్నవించానని, సమస్య పరిషష్కారం కాకపోవటంతో తిరిగి విన్నవించినట్లు వెల్లడించారు. -అప్పారావు, విజయనగర్‌కాలనీ, ఖమ్మం ఆగిన పెన్షన్ ఇవ్వాలని కోరా తనకు ఇస్తున్న పెన్షన్ ఆరు నెలలుగా నిలిచిపోయిందని, మండల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోకపోవటంతో ప్రజావాణిలో పెన్షన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన డీఆర్వో సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. -పాశం వెంకటరెడ్డి, కూసుమంచి మండలం -
కలెక్టరేటా.. చెత్తకుండీనా..?
* సీమాంధ్ర ఉద్యోగుల జాబితా ఏది..? * మయపాలన పాటించాలిపరిష్కృతి ఫిర్యాదులు * రిపీట్ కావొద్దు అధికారులకు అక్షింతలు వేసిన కొత్త కలెక్టర్ * బాధ్యతల స్వీకరణ రోజునే ఇలంబరితి మార్కు ఖమ్మం జెడ్పీసెంటర్: ఇది జిల్లా పరిపాలన కార్యాలయమా..! చెత్త కుండీనా..! .ఏమిటి ఈ చెత్త..! ఈ వాహనాల పార్కింగ్ ఏంటి .. ? సీమాంధ్ర ఉద్యోగుల జాబితా ఏది..? ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పరిష్కృతి ఫిర్యాదుల నమోదు ఉందా...! హైదరాబాద్‌లో ఉండే రాష్ట్రస్థాయి అధికారులు ఈ విభాగంపై దృష్టి సారిస్తారు....ఈ విషయం తెలుసా.. ? అని ప్రశ్నల వర్షం కురిపించారు జిల్లా కలెక్టర్ ఇలంబరితి. జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె.ఇలంబరితి తొలిరోజే అధికారులకు అక్షింతలు వేశారు. శుక్రవారం ఉదయం 5.36గంటలకు బాధ్యతలు స్వీకరించిన ఆయన తిరిగి బయటకు వెళ్తూ డీఆర్వో శివశ్రీనివాస్‌ను పలు అంశాలపై ప్రశ్నించారు. జిల్లా అధికారులు సమయ పాలన పాటించాలని ...కలెక్టరేట్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ..తీరు మార్చుకోవాలని అగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలన పాటిస్తే అన్ని పనులు సత్వరం జరుగుతాయని హితబోధ చేశారు. ముందు మీరు సమయ పాలన పాటించాలని డీఆర్వోకు చెప్పారు. జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల జాబితాను తాను హైదరాబాద్ వెళ్లే వరకు తెలపాలన్నారు. పరిష్కృతిలో ఫిర్యాదుల నమోదు సక్రమంగా జరగాలన్నారు. రెండు రోజుల్లో ఫిర్యాదుదారులకు సమాధానం తెలియాలన్నారు. గ్రీవెన్స్ ఫిర్యాదులను హైదరాబాద్ స్థాయిలో పరిశీలిస్తారని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ ఆదర్శవంతంగా నిలవాలని చెప్పారు. వాహనాల పార్కింగ్ సక్రమంగా నిర్వహించాలన్నారు. కలెక్టర్ వస్తారని తెలిసినా.... జిల్లా కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తించాల్సిన డీఆర్వోనే జిల్లా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆలస్యంగా రావడం చర్చనీయాంశమయింది. కలెక్టర్ కార్యాలయానికి వీఐపీలు వచ్చినప్పుడు తన సిబ్బందితో కలిసి కలెక్టరేట్ పోర్టికో వరకు వెళ్లి వీఐపీలకు పుష్పగుచ్ఛం అందజేసి వారిని గౌరవప్రదంగా కలెక్టరేట్‌లోకి తీసుకొస్తారు డీఆర్వో. కాగా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఇలంబరితికి అలాంటి ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఉదయం 5 గంటలకు కలెక్టరేట్‌కు వచ్చి బాధ్యతలు స్వీకరిస్తానని కలెక్టర్ ప్రకటించినా జిల్లా రెవెన్యూ అధికారి సమయానికి కలెక్టరేట్‌కు రాలేదు. కలెక్టర్ చాంబర్లోకి వచ్చిన 30 నిమిషాలకు డీఆర్వో రావడం, కనీసం స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛం ఇవ్వకపోవడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.