కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టరాదనే డిమాండ్‌తో జిల్లా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె కారణంతో రెండో రోజు శుక్రవారం కూడా పాలన స్తంభించింది. జిల్లా పాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్‌లో కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి మినహా అధికారులు, సిబ్బంది మొత్తం సమ్మెలో పాల్పంచుకున్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక శాఖలతో పాటు జిల్లా పంచాయతీ అధికారి, మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయాలకు ఏకంగా తాళాలుపడ్డాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రామక్రిష్ణారెడ్డి, జిల్లా నాయకులు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి, శ్రీరాములు, పి.రామక్రిష్ణారెడ్డి, లక్ష్మన్న, సుధాకర్‌రెడ్డి, బలరామిరెడ్డి, రఘుబాబు తదితరులు సమ్మెను పర్యవేక్షించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశాన్ని అడ్డుకున్నారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు గ్రూపులుగా విడిపోయి ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసివేయించారు. ఆ తర్వాత ఉద్యోగులంతా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆత్మకూరు, నందికొట్కూరుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. తాలుకా ఎన్‌జీఓ నేతల నేతృత్వంలో ఉద్యోగులు బిల్లుకు వ్యతిరేకంగా నినదించారు. వివిధ శాఖల ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలు ఇంకా సమ్మెలో పాల్గొనాలని పిలుపునివ్వకపోయినా విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటున్నారు. అయితే గతంలో 66 రోజుల సమ్మెతో పోలిస్తే ఇప్పుడు ఉత్సాహం, పట్టుదల లోపించినట్లు కనిపిస్తోంది. కలెక్టరేట్ మినహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సమ్మె ప్రభావం అంతగా కనిపించకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.
ఈ విషయమై జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి స్పందిస్తూ అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతుండటంతో రాష్ట్ర నాయకత్వం హడావుడిగా సమ్మె నిర్ణయం తీసుకోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. సోమవారం నుంచి సమ్మె తీవ్రం అవుతుందని తెలిపారు. రాష్ట్ర విభజనను అడ్డుకోకపోతే కేంద్ర మంత్రులు, ఎంపీలకు రాజకీయంగా మనుగడ ఉండదని హెచ్చరించారు. రాబోయే వారం రోజులు ఎంతో కీలకమని, విభజనను అడ్డుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
సమైక్య హోరు
Published Sat, Feb 8 2014 3:47 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement