ప్రజాప్రతినిధుల చుట్టూ కొందరు ఉద్యోగులు ప్రదక్షిణలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎన్నికల క్రతువు ముగిసి కొత్త పాలకులు కొలువుదీరిన నేపథ్యంలో వారి వద్దకు పైరవీల జాతర మొదలైంది. వారికి ప్రభుత్వ ఉద్యోగిని వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా నియమించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో తాజాగా ప్రజాప్రతినిధుల చుట్టూ కొందరు ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందులో అగ్రభాగంలో ప్రభుత్వ టీచర్లుండడం విశేషం.
వాస్తవానికి విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సహాయకులుగా నియమించుకునే అవకాశం లేదు. కానీ జిల్లాలో మాత్రం ఇప్పటికే ముగ్గురు టీచర్లను వ్యక్తిగత సహాయకులుగా నియమించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వారిని ప్రస్తుత విధులనుంచి రిలీవ్ చేయాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారికి సూచనలు పంపడం గమనార్హం.
ఆర్టీఈ ప్రకారం....
విద్యాహక్కు చట్టం 2010 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను బోధనేతర విధుల బాధ్యతలు అప్పగించొద్దు. ఎన్నికలు, జనగణనలాంటి కీలక విధులు మినహా మిగతా పనులకు ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకునే వీలు లేదు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఈ అంశాలను గుర్తు చేస్తూ ఇటీవల రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా విద్యాశాఖ అధికారులకు ప్రత్యేకంగా సర్కులర్లను పంపింది. ఇంత స్పష్టంగా విషయాన్ని వివరించినప్పటికీ.. జిల్లా యంత్రాంగం ఈ అంశాన్ని గాలికొదిలేసినట్లుంది.
ఎప్పటిలాగే ముగ్గురు టీచర్లకు పీఏలుగా నియమించేందుకు చర్యలు తీసుకుంది. వారిని విధులనుంచి రిలీవ్ చేయాలంటూ జిల్లా రెవెన్యూ అధికారి, డీఈఓకు ఆదేశించారు. ఇందులో ఒక టీచరు రాష్ట్ర మంత్రికి పీఏగా, మరో టీచర్‌ను అధికారపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడికి పీఏగా, మరో టీచర్‌ను ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పీఏగా నియమితులైనట్లు సమాచారం. మొత్తమ్మీద ఆర్టీఈ నిబంధనలకు పాతరేస్తూ ఉపాధ్యాయులను పీఏలుగా నియమించినప్పటికీ.. వారికి జిల్లా విద్యాధికారి రిలీవ్ చేస్తారా.. లేదా అనేది వేచిచూడాల్సిందే.