అధికారికంగా ‘తెలంగాణ విమోచన’
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్
సిద్దిపేట జోన్: తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అందుకోసం పట్టుబడుతామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ప్రభుత్వం ఎంఐఎంతో కుమ్మక్కయి విమోచన దినోత్సవాన్ని నిర్లక్ష్యం చేస్తుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ గతంలో మాట్లాడిన సీడీలు, పేపర్ కట్టింగ్‌లతో రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్, ఆర్‌డీవోలకు వినతిపత్రాలు అందజేస్తామని, కలెక్టరేట్‌లను దిగ్బంధిస్తామన్నారు. మరోవైపు అన్ని గ్రామాల సర్పంచ్‌లకు లేఖలు రాయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15న హెదరాబాద్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుందని, 16న పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.