లేదంటే టీఆర్ఎస్కు కాంగ్రెస్ గతే: డాక్టర్ లక్ష్మణ్
అధికారికంగా ‘సెప్టెంబర్ 17’ ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిన సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించకుంటే టీఆర్‌ఎస్ సర్కార్‌కు, సీఎం కేసీఆర్‌కు అధికారంలో కొనసాగే నైతికహక్కు ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సెప్టెంబర్ 17 ఉత్సవాలను నిర్వహించకుంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే టీఆర్‌ఎస్‌కు కూడా పడుతుందన్నారు. తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులను కించపరిచే విధంగా మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత మాట్లాడుతున్నారని, దీనిపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు.
చీము నెత్తురు ఉంటే రాజీనామా చేసి బయటకు రావాలని సమైక్య రాష్ర్టంలో అప్పటి తెలంగాణ మంత్రులను డిమాండ్ చేసిన విషయం కేసీఆర్ మరిచిపోయారా అని ప్రశ్నించా రు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో కేసీఆర్ వీడియో ప్రసంగాల క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. శనివారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో నిర్వహించే చాకలి ఐలమ్మ వర్ధంతికి కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్‌జ్యోతి హాజరవుతారని లక్ష్మణ్ తెలిపారు.