మత కోణంలో చూడొద్దు: కోదండరాం
హైదరాబాద్: సెప్టెంబర్ 17ను విలీనదినంగా జరుపుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం తమ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, ప్రభుత్వం ప్రకటన చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. రేపు విలీన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా జరపాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.
విలీనదినాన్ని మత కోణంలో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విలీనదినాన్ని అధికారికంగా జరపాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాము రేపు గోల్కొండలో జాతీయ జెండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఎంఐఎం ఒత్తిడితోనే విలీన దినోత్సవాన్ని నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకాడుతోందని ఆయన ఆరోపించారు.