సాయుధ పోరుకు పురుడు పోసింది జనగామనే
Published Mon, Sep 19 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
జనగామ : నిజాం సర్కారుకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి పురుడు పోసిన జనగామను జిల్లా చేయాల్సిందేనని నాటి పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. జిల్లా సాధన కోసం జేఏసీ తలపెట్టిన రిలే దీక్షలను ఆదివారం ఆమె ప్రారంభించారు. అంతకు ముందు జేఏసీ చైర్మెన్ ఆరుట్ల దశమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాటు అయితే భవిష్యత్ తరాలకు బతుకుదెరువు కలుగుతుందన్నారు. జిల్లా కోసం డివిజన్‌లోని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు ఏడాది కాలంగా ఉద్యమం చేస్తుంటే, పాలకులు పట్టించు కోకపోవడం బాధాకరమని అన్నారు. ప్రజా ఉద్యమాన్ని చులకనగా చూస్తే అగ్నికణమవుతుందని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలను గ్రహించాలని కేసీఆర్‌కు సూచించారు. దళితులకు మూడెరకాల భూపంపిణీ అటకెక్కిందని విమర్శించారు. అనంతరం విస్నూరు దొరను జనగామ రైల్వేస్టేన్‌లో హత్య చేసిన ధర్మాపురం గ్రామానికి చెందిన 106 ఏళ్ల దర్గానాయక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, బూడిద గోపి, ఉడుత రవి, గొళ్లపల్లి బాపురెడ్డి, మిట్యానాయక్, క్రిష్ణ, బొట్ల చిన శ్రీనివాస్, ఇర్రి అహల్య, మంగళ్లపల్లి రాజు, రెడ్డి రత్నాకర్‌రెడ్డి, మిద్దెపాక సుధాకర్, ధర్మపురి శ్రీనివాస్ ఉన్నారు.
Advertisement