Nizam government
-
భాగ్యనగరి...సౌభాగ్య సిరి!
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరి..427 ఏళ్ల క్రితమే సౌభాగ్యసిరిగా విలసిల్లింది. ముచుకుందానది ఒడ్డున రాజసౌధాలు, పరిపాలన భవనాలు, ప్రజలకోసం సుమారు 14 వేల నిర్మాణాలతో ఈ మహానగరం అప్పట్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నగర నిర్మాణ సమయంలో కుతుబ్‌షా ప్రత్యేక ప్రార్థన చేస్తూ ‘వీలైనంత త్వరగా నా రాజ్యం సుసంపన్నం కావాలి. అందరికీ సంతృప్తికరమైన జీవితానికి కేంద్రం కావాలి. సకల జాతులజనంతో నిండిపోయి, ఈ సుందర నగరం ప్రపంచంలోని దేశాల్లోకెల్లా..మహానగరమై కలికితురాయిగా మెరిసిపోవాలి. సముద్రంలో చేప పిల్లల్లా ..మత, జాతి, లింగ వివక్ష లేకుండా ప్రజలంతా కలకాలం కలిసి ఉండాలి’ అని వేడుకున్నారట! కులీ కుతుబ్‌షా ప్రార్థన ఫలించి హైదరాబాద్ పుట్టుకతోనే నగరమై, ఆపై మహానగరమైంది. అపురూప ప్రేమకు తీపి గురుతుగా, వివిధ జాతులు, సమూహాల సమైక్యతకు చిహ్నంగా ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేకతను చాటుకున్న మహానగరం... అసఫ్ జాహీల పాలనలో మరింత విస్తృతమైు అప్ఘనిస్తాన్ నుండి పఠాన్లు, కాబూలీ వాలాలు, మక్కా, మదీనాల నుంచి అరబ్బులు, లండన్ నుంచి ఆంగ్లేయులు, ఆఫ్రికా దేశాల చావూస్‌లు, ఇథిహోపియా హబ్సీలు, ఇరాన్, ఇరాక్‌ల నుంచి తరలివచ్చిన షియా, సున్నీ, బోరాలతో హైదరాబాద్ అత్యంత భద్రతా వ్యవస్థతో ప్రపంచస్థాయి కేంద్రమైంది. ఢిల్లీ నుంచి కాయస్తులు, గుజరాత్, రాజస్థాన్ల జైన్లు, మార్వాడి, అగర్వాళ్లు, పార్సీలు, కోల్‌కతా నుండి బెంగాళీలు, పంజాబ్ నుండి సిక్కులు, బుందేల్‌ఖండ్ లోథాలు, పార్థీలు, మదరాసు నుండి తమిళలు, మైసూర్ కన్నడిగులు ముంబై నుండి మరట్వాడాలు, రుహేల్‌ఖండ్ నుంచి రోహిళ్లాలు, ఇంకా అనేక జాతుల కాందీశీకులు దక్షిణాది ముఖ ద్వారమైన భాగ్యనగరికి చేరుకుని చేరుకుని ఇక్కడి సంస్కృతి, నాగరికతలో పాన్‌సుపారీలా కలిసిపోయారు. కుతుబ్‌షాహీల అనంతరం హైదరాబాద్ సంస్థానాన్ని 1724–1948 సెప్టెంబర్ 16వ తేదీ వరకూ పాలించిన..అసఫ్జాహీలు ఎవరు.? వారిప్పుడు ఏం చేస్తున్నారు.. తెలుసుకోవాలంటే.. వివరాల్లోకి వెళ్లండి.. హైదరాబాద్ రాజధానిగా పాలించిన అసఫ్‌జాహీల(నిజాం) ఆనవాళ్లు నగరంలో వీధివీధికి కనిపిస్తాయి. 1724 నుండి 1948 వరకు హైదరాబాద్ స్టేట్ మీర్ ఖమ్రుద్దిన్ ఖాన్, నిజాంఅలీ ఖాన్, అక్బర్అలీ ఖాన్, ఫరూకుద్దీన్ అలీఖాన్, తినాయత్ అలీఖాన్, మీర్ మహబూబ్ అలీఖాన్, మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ల ఏలుబడిలో ఉండేది. మహబూబ్ అలీఖాన్, ఉస్మాన్ అలీఖాన్‌ల పాలనా సమయంలో నగరం అనేక మార్పులకు లోనైంది. 1948, సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానం అంతరించి దేశంలో కలిసిపోయింది. అయినా ఉస్మాన్ అలీఖాన్ 1956 వరకు రాజ్‌ప్రముఖ్‌గా పదవులు నిర్వహించారు. తనకు వారసత్వంగా వచ్చిన హైదరాబాద్ చుట్టూ 23 వేల ఎకరాల సర్ఫేఖాస్ భూములతోపాటు, ఇప్పటీకీ వాహ్..వా అనిపించే చౌమహల్లా, ఫలక్‌నుమా, చిరాన్, నజ్రీబాగ్, పరేడ్‌విల్లా, ఫెర్న్‌విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్ ప్లజెంట్ తదితర ప్యాలెస్‌లతో పాటు విలువైన వజ్ర ,వైఢూర్యాలు నిజాం ఫ్యామిలీ సొంతమయ్యాయి. నగరం వెలుపల ఢిల్లీ, ముంబై, ఊటీ, చెన్నై, కోల్‌కతా, మహాబలేశ్వరం తదితర ప్రాంతాల్లో 630కి పైగా ఖరీదైన భవంతులు నిజాం సొంత ఆస్తుల్లో చేరాయి. నిజాంల పరివారం ఇదీ... చివరి నిజాం: మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమారులు: ఆజంజా, మౌజం జా, కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం ఆజంజా పరివారం: భార్య, దుర్రేషెవార్(టర్కీ) కుమారులు: ముకర్రం, ముఫకంజా మౌజం జా పరివారం: భార్యలు నీలోఫర్(టర్కీ), రజియాబేగం, అన్వరీబేగం సంతానం: ఫౌతిమా, ఫాజియ అమీనా, ఓలియా, శ్యామత్‌అలీఖాన్ ఆస్ట్రేలియాలో... ఎనిమిదవ నిజాం: ఆజంజా,మోజం జా వారసులంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ముకర్రం ఝా ఆస్ట్రేలియాలో, ముఫకం జా లండన్‌లో స్థిరపడ్డారు. అడపాదడపా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. వీరిలో ముక్రరంజా ఐదు పెళ్లిల్లు చేసుకున్నారు. ఎనిమదవ నిజాంగా ప్రకటించుకున్న ముకర్రం జా ఆధీనంలోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యధిక ఆస్తులున్నాయి. ఫలక్‌నుమా, చౌమహల్లా, చిరాన్ ప్యాలెస్‌లున్నాయి. లండన్ డూన్ స్కూల్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుండి పట్టాలు అందుకున్న ముకర్రంజా జీవితాన్ని విలాసవంతంగా గడిపేస్తున్నాడు. అక్టోబర్ 6, 1933లో పుట్టిన ముకరంజా తొలుత టర్కీ యువరాణి ఎస్త్రాబర్గిన్‌ను(1959–75), అనంతరం ఎయిర్‌హోస్టెస్ హెలెన్(1980–90), ఆపై అప్పటి మిస్ టర్కీ మనోలియా ఒనోర్‌ను(1990–96) పెళ్లిచేసుకుని వివిధ కారణాల తో ‘తలాక్’ చెప్పేశాడు. ప్రస్తుతం మొరాకోకు చెందిన జమీలా, టర్కీకి చెందిన ప్రిన్సెస్ ఒర్చిడ్‌లతో కలిసి ఉంటున్నాడు. మొత్తంగా చూస్తే మొదటి భార్య ద్వారా ఇద్దరు(కూతురు, కొడుకు), రెండవ భార్య ద్వారా ఇద్దరు కొడుకులు, మూడవ భార్య కూతురు(నీలోఫర్), నాల్గవ భార్య ద్వారా ఓ కుమార్తె ఉన్నారు. వీరంతా టర్కీ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో స్థిరపడ్డారు. లండన్‌లో ముఫకంజా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండవ మనవడే ముఫకంజా. ప్రస్తుతం లండన్‌లో నివాసం ఉంటున్నారు. టర్కీకి చెందిన ఏసెన్‌ను పెళ్లి చేసుకున్న ముఫకంజా నగరంలో నిజాం మ్యూజియం, సిటీ నిజాం మ్యూజియంల నిర్వహణను చూస్తున్నారు. -
చారిత్రకం.. కళాత్మకం
కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల హయాంలోనే ఆధునిక హైదరాబాద్ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. ఓవైపు రాచరిక, నియంతృత్వ పరిపాలన కొనసాగినప్పటికీ... మరోవైపు అద్భుతమైన, కళాత్మకమైన భవనాలు, రహదారుల నిర్మాణమూ జరిగింది. నగరం నలుమూలలనుఅనుసంధానం చేసే రోడ్లు...ఆ రోజుల్లోనే అందుబాటులోకి వచ్చాయి. చార్మినార్ కేంద్రంగావిస్తరించుకున్న హైదరాబాద్,హుస్సేన్‌సాగర్ చెరువుకు ఉత్తరాన అభివృద్ధి చెందిన సికింద్రాబాద్... రెండూ జంటనగరాలుగా, విభిన్న సాంస్కృతిక జీవన సముదాయాలుగా విలసిల్లాయి. వైవిధ్యమైన నగరఆవిష్కరణకు ఈ సంస్కృతులు దోహదం చేశాయి. ఈ విశిష్టమైన సాంస్కృతిక జీవనంలో భవనాలు, రోడ్లు భాగమయ్యాయి. అప్పట్లోనిర్మించిన ఎన్నో కట్టడాలు నేటికీ చెక్కుచెదరకుండా నగర చరిత్రను చాటి చెబుతున్నాయి. రహదారులు ప్రముఖుల స్మారకంగా నిలుస్తున్నాయి. నేడు నిజాం రాజ్యం భారత్‌లో విలీనమైన దినం(సెప్టెంబర్ 17) సందర్భంగాఆనాటి భవనాలు, రోడ్లపై‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్ :మూడో నిజాం ‘సికిందర్ జా’ పేరుతో ఏర్పాటైన సికింద్రాబాద్ మొదటి నుంచే ఆధునికతను సంతరించుకుంది. బ్రిటీష్ ప్రభుత్వంతో నిజాం సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 1806లో హుస్సేన్‌సాగర్‌కు ఉత్తరాన ఉన్న 4 చదరపు మైళ్ల ప్రాంతాన్ని బ్రిటీష్ సైనిక పటాలలకు ఇచ్చేశారు. మొదట్లో 5వేల బ్రిటీష్ బలగాల విస్తరణ కోసం ఏర్పాటైన ఈ ప్రాంతం బ్రిటీష్ కంటోన్మెంట్‌గా అనతి కాలంలోనే విస్తరించింది. ఆ తరువాత 17 చదరపు మైళ్లకు విస్తరించింది. 50వేల బలగాలకు స్థావరమైంది. మిలటరీ ప్రాంతాలతో పాటు సాధారణ ప్రజల నివాసాలు కూడా అభివృద్ధి చెందాయి. సికింద్రాబాద్ ఏర్పడినప్పటి నుంచి 1948 వరకు ఈ ప్రాంతం బ్రిటీష్ ప్రభుత్వ హయాంలోనే ఉంది. దీంతో ఇక్కడ నిర్మించిన రోడ్లు బ్రిటీష్ ప్రముఖులు, స్వాతంత్య్రోద్యమ నేతల పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. రాష్ట్రపతి రోడ్ హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబురాజేంద్రప్రసాద్ తొలిసారి నగర పర్యటనకు వచ్చారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న తొలి రాష్ట్రపతి ప్రయాణించిన సికింద్రాబాద్‌లోని ఒక దారికి రాష్ట్రపతి రోడ్‌గా నామకరణం చేశారు. హరిహర కళాభవన్ చౌరస్తా, సికింద్రాబాద్ ప్రధాన తపాలా కార్యాలయం, ప్యాట్నీ సెంటర్ మీదుగా కర్బలామైదాన్ వరకు ఉన్న రహదారిని రాష్ట్రపతి రోడ్‌గా వ్యవహరిస్తారు. ఆర్పీ రోడ్డు ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలకు పెట్టింది పేరు. అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఇక్కడ లభిస్తాయి. మదీనా బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో నిర్మించారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా నగరాల్లో ఉన్న పుణ్యక్షేత్రాల నిర్వహణకు పంపించేవారు. అప్పట్లో సౌదీ అరేబియా చాలా పేద దేశం. హైదరాబాద్ సంస్థానం ధనికమైనది. దీంతో సౌదీ అరేబియాలోని ముస్లింల పుణ్యక్షేత్రాల నిర్వహణకు నిజాం పాలకులు ఈ బిల్డింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంపించేవారు. సెంట్రల్ లైబ్రరీ 1891లో నయాపూల్‌కు సమీపంలో మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్గామీ తన సొంత పుస్తకాలతో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఇదే ప్రదేశంలో 1932లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ప్రస్తుతమున్న భవనం నిర్మించారు. ఇది 1955 వరకు ఆసిఫియా లైబ్రరీగా ఉండగా, ప్రస్తుతం సెంట్రల్ లైబ్రరీగా పిలుస్తున్నారు. బ్రిటీష్ రెసిడెన్సీ 1798లో అప్పటి బ్రిటీష్ రాయబారి జేమ్స్ అచిల్లెస్ కిర్క్‌ప్యాట్రిక్ దీనిని నిర్మించాడు. అత్యంత విలాసవంతమైన ఈ భవనంలో నిజాం సంస్థానంలో ఉండే బ్రిటీష్ ప్రతినిధులు ఉండేవారు. నిజాం సంస్థానం భారత్‌లో విలీనం అనంతరం 1949లో ఈ భవనంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు. సరోజినీదేవి రోడ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని మహాత్ముడు పిలిచిన స్వాతంత్య్రోద్యమ నాయకురాలు, కవయిత్రి సరోజినీ నాయుడు కొంతకాలం పాటు సికింద్రాబాద్‌లో నివసించారు. స్వాతంత్య్రానంతరం పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా సరోజినీనాయుడు నియమితులయ్యాక సికింద్రాబాద్ నుంచి మకాం మార్చారు. ఆమె జ్ఞాపకార్థం నామకరణం చేసిన సరోజినీదేవి రోడ్డు జనజీవనంలో భాగమైంది. ఎస్డీ రోడ్డుగా పిలిచే ఈ రహదారిలోనే సంగీత్ చౌరస్తా, మంజు, నటరాజ్ థియేటర్లు, క్లాక్‌టవర్, మినర్వా, చంద్రలోక్, సూర్యలోక్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మినిస్టర్ రోడ్ బేగంపేట్ విమానాశ్రయం నుంచి నగరంలోకి వచ్చే ప్రముఖులు, మంత్రులు రాకపోకలు సాగించిన మార్గం మినిస్టర్ రోడ్‌గా స్థిరపడింది. కేంద్రం నుంచి నగరానికి వచ్చే మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ రహదారి నుంచే రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం రసూల్‌పురా చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్‌కు కలిపే రహదారి ఇది. ఈ రహదారికి ట్యాంక్‌బండ్‌తో పాటు నెక్లెస్ రోడ్‌ను కూడా అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఈ రహదారి మొత్తం కార్ల డెకరేషన్‌కు అవసరమైన దుకాణాలకు నిలయంగా మారింది. నగరంలో చెప్పుకొదగిన కిమ్స్ ఆసుపత్రి కూడా ఇదే రహదారిలో ఉంది. సర్దార్ పటేల్ రోడ్ దేశవ్యాప్తంగా జరిగిన స్వాతంత్య్రోద్యమం హైదరాబాద్ ప్రజల కంటే సికింద్రాబాద్ ప్రజలనే ఎక్కువగా ప్రభావితం చేసింది. హైదరాబాద్ ప్రత్యక్షంగా నిజాం పరిపాలనలో ఉంటే సికింద్రాబాద్ పరోక్షంగా బ్రిటీష్ కంటోన్మెంట్‌గా కొనసాగుతుండేది. దీంతో ఇక్కడి ప్రజలు భారత స్వాతంత్య్రోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యకు సికింద్రాబాద్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారత సైనిక బలగాలను సమున్నతంగా స్వాగతించారు. ఈ మొత్తం పరిణామానికి కేంద్రబిందువు అప్పటి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన ఆదేశం మేరకు సైన్యం రంగంలోకి దిగి నిజాం పాలనకు చరమగీతం పాడింది. సికింద్రాబాద్ సెయింట్‌జాన్స్ చర్చి ముందున్న ఈశ్వరీబాయి విగ్రహం నుంచి బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ వరకు గల రహదారికి సర్దార్ పటేల్ రోడ్ (ఎస్పీ రోడ్డు)గా నామకరణం చేశారు. హరిహరకళాభవన్, యాత్రినివాస్ హోటల్, బేగంపేట్ విమానాశ్రయం, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్, బేగంపేట్ పోలీస్‌స్టేషన్, హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల కార్యాలయం ఈ రహదారిలోనే ఉన్నాయి. జేమ్స్ స్ట్రీట్–ఎంజీ రోడ్ లక్షలాది జనసందోహంతో, వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే జేమ్స్ స్ట్రీట్ సికింద్రాబాద్‌కు హాట్‌లైన్ వంటిది. నిజాం రాజు సికిందర్ జాతో ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటీష్ సైనిక అధికారి మేజర్ జనరల్ జేమ్స్ అచిల్లెస్ కిర్క్‌ప్యాట్రిక్ పేరుతో ఇది జేమ్స్ స్ట్రీట్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. సైనికులకు అవసరమయ్యే వస్తువుల కొనుగోళ్లకు ఇది ప్రధాన మార్కెట్‌గా ఉండేది. క్రమంగా జనరల్ బజార్, రెజిమెంటల్ బజార్, పాట్ బజార్ తదితర ప్రాంతాలకు మార్కెట్ విస్తరించింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం దేశవ్యాప్త పర్యటనలు చేసిన మహాత్మాగాంధీ సికింద్రాబాద్‌కు వచ్చారు. కర్బలా మైదానంలో ప్రసంగించేందుకు ఆయన అప్పటి జేమ్స్ స్ట్రీట్ గుండా పాదయాత్ర చేశారు. మహాత్ముడు నడిచిన ఈ జేమ్స్ స్ట్రీట్‌కు స్వాతంత్య్రానంతరం ‘మహాత్మాగాంధీ రోడ్’ (ఎంజీ రోడ్డు)గా నామకరణం చేశారు. ఇందుకు గుర్తుగా ఇక్కడి వ్యాపారులు ఎంజీ రోడ్లో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 2కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రహదారి స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వ్యాణిజ్య ప్రాంతం. ప్యారడైజ్ హోటల్, చర్మాస్, కేఎఫ్‌సీ, రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్, రాణిగంజ్ బస్‌డిపో ఈ రహదారిలోనే ఉన్నాయి. చార్మినార్ గోల్కొండ కేంద్రంగా కుతుబ్‌షాహీల పాలన కొనసాగింది. అయితే అప్పటికే గోల్కొండలో జనం పెరిగిపోయారు. జనాభాకు సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో ఐదో కులీకుతుబ్ షా కొత్త నగరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. మూసీ నదికి కూతవేటు దూరంలో 1591లో చార్మినార్ కట్టడాన్ని నిర్మించాడు. అలా చార్మినార్ కేంద్రంగా హైదరాబాద్ నగరం ఉనికిలోకి వచ్చింది. నగర ఏర్పాటుతో ప్రజల సౌకర్యార్థం రోడ్లు, ప్రభుత్వ దవాఖానాలు, మార్కెట్ తదితర ఏర్పడ్డాయి. పత్తర్‌గట్టీ చార్మినార్ ఉత్తర దిశలో మూసీ నది వైపు గుల్జార్‌హౌస్ కేంద్రంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ఆసఫ్జాహీ పాలకులు నిర్ణయించారు. ఇక్కడ బంగారం, వెండితో పాటు దుస్తుల విక్రయాలు జరగాలని.. అందుకు అనుగుణంగా పత్తర్‌గట్టీ మార్కెట్‌ను రాళ్లతో నిర్మించారు. పత్తర్ అంటే రాయి, గట్టీ అంటే సున్నం, బంక మిశ్రమం. వీటితోనే ఈ మార్కెట్‌ను నిర్మించారు. అందుకే దీన్ని పత్తర్‌గట్టీ మార్కెట్ అంటారు. ఇది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మొజంజాహీ మార్కెట్ 1935లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన చిన్న కుమారుడు మొజంజాహీ బహదూర్ పేరుతో ఈ మార్కెట్‌ను నిర్మించారు. అప్పటికే నగరంలో వివిధ మార్కెట్లో ఉన్నాయి. అయితే పండ్ల విక్రయాలకు ప్రత్యేక మార్కెట్ ఉండాలని మొజంజాహీ మార్కెట్ ఏర్పాటు చేశారు. 1980 వరకు ఇక్కడ ఎక్కువ శాతం పండ్ల విక్రయాల షాపులుండేవి. తర్వాత పండ్ల మార్కెట్‌ను కొత్తపేట్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ మార్కెట్లో పండ్ల, ఇతర షాపులు కొనసాగుతున్నాయి. అబిడ్స్ మార్కెట్ ఆర్మేనియా దేశస్థుడు అల్బర్ట్ అబిడ్స్ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు దుస్తులు తయారు చేసేందుకు వచ్చాడు. వివిధ దేశాల వస్తువులను దిగుమతి చేసుకొని నిజాం రాజుకు ఇచ్చేవాడు. అలా ప్రస్తుతమున్న అబిడ్స్ జీపీవోకు ఎదురుగా ‘అబిడ్స్ షాప్’ పేరుతో విదేశీ వస్తువుల దుకాణాన్ని ప్రారంభించాడు. అప్పటి నుంచి దీనికి అబిడ్స్‌గా పేరొచ్చింది. గన్‌ఫౌండ్రీ ఆరు, ఏడో నిజాంల హయాంలో ఎడ్యుకేషన్ హబ్‌గా కొనసాగిన గన్‌ఫౌండ్రీకి ఎంతో చరిత్ర ఉంది. 1768లో ఫ్రెంచ్ జనరల్ మైఖేల్ జోచిం మేరీ రేమండ్ ఆయుధాలను నిల్వ చేయాడానికి గన్‌ఫౌండ్రీలో కర్మాగారం నిర్మించారు. నిజాం పాలనా కాలంలో ఇదే ఏకైక ఆయుధాల నిల్వ ప్రదేశం. తర్వాత నిజాం పాలకులు ఇక్కడ వివిధ ప్రభుత్వ సంస్థలు నిర్మించారు. హుస్సేన్‌సాగర్ హుస్సేన్‌సాగర్ నగరం నడిబొడ్డున నిర్మించిన సరస్సు. 1562లో ఇబ్రహీం కులీకుతుబ్ షా పాలనా కాలంలో ఈ జలాశయ నిర్మాణం చేపట్టారు. అయితే పర్యవేక్షణ మాత్రం ఆయన అల్లుడు హుస్సేన్ షా వలీ చూసుకునేవాడు. చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవడంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. దీనికి ఇబ్రహీం సాగర్ అని పేరు పెట్టాలని కుతుబ్‌షా అనుకున్నాడు. కానీ ప్రజలు హుస్సేన్ షా పేరు మీదుగా హుస్సేన్‌సాగర్ అని పిలవడం ప్రారంభించారు. అప్పట్లో ఇది నగర ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చింది. సాగర్ మధ్యలోని ఏకశిల బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. అఫ్జల్‌గంజ్ మార్కెట్ ఐదో నిజాం హయాంలో అఫ్జల్‌గంజ్ మార్కెట్ నిర్మించారు. అప్పటి వరకు పాతబస్తీలోని షా గంజ్, షంషీర్గంజ్, మిస్రీ గంజ్ ఉండేవి. నగర జనం పెరగడంతో నయాపూల్ పడమర వైపు విశాలమైన ప్రదేశంలో సకల సౌకర్యాలతో అఫ్జల్‌గంజ్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. దీని కేంద్రంగా సిద్ధంబర్ బజార్, బేగం బజార్, ఉస్మాన్‌గంజ్ మార్కెట్లు వెలిశాయి. ఈ మార్కెట్లు నేటికీ కొనసాగుతున్నాయి. -
సాయుధ పోరుకు పురుడు పోసింది జనగామనే
జనగామ : నిజాం సర్కారుకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి పురుడు పోసిన జనగామను జిల్లా చేయాల్సిందేనని నాటి పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. జిల్లా సాధన కోసం జేఏసీ తలపెట్టిన రిలే దీక్షలను ఆదివారం ఆమె ప్రారంభించారు. అంతకు ముందు జేఏసీ చైర్మెన్ ఆరుట్ల దశమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాటు అయితే భవిష్యత్ తరాలకు బతుకుదెరువు కలుగుతుందన్నారు. జిల్లా కోసం డివిజన్లోని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు ఏడాది కాలంగా ఉద్యమం చేస్తుంటే, పాలకులు పట్టించు కోకపోవడం బాధాకరమని అన్నారు. ప్రజా ఉద్యమాన్ని చులకనగా చూస్తే అగ్నికణమవుతుందని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలను గ్రహించాలని కేసీఆర్‌కు సూచించారు. దళితులకు మూడెరకాల భూపంపిణీ అటకెక్కిందని విమర్శించారు. అనంతరం విస్నూరు దొరను జనగామ రైల్వేస్టేన్లో హత్య చేసిన ధర్మాపురం గ్రామానికి చెందిన 106 ఏళ్ల దర్గానాయక్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, బూడిద గోపి, ఉడుత రవి, గొళ్లపల్లి బాపురెడ్డి, మిట్యానాయక్, క్రిష్ణ, బొట్ల చిన శ్రీనివాస్, ఇర్రి అహల్య, మంగళ్లపల్లి రాజు, రెడ్డి రత్నాకర్‌రెడ్డి, మిద్దెపాక సుధాకర్, ధర్మపురి శ్రీనివాస్ ఉన్నారు. -
భాగ్యనగర సిగలో ఆకాశవాణి
1932లో హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఓ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అదే భాగ్యనగర్ రేడియో కేంద్రం స్థాపన. అప్పట్లో ఈ కేంద్రం నుంచి ప్రసారాలు జరపడమే విశేషం. స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాగా పుల్లారెడ్డి నాయకత్వంలో దీన్ని స్థాపించారు. ప్రతిరోజూ సాయంత్రం అప్పటి నిజాం ప్రభుత్వ రేడియో అయిన ‘దక్కన్ రేడియో’ ప్రసారాలతో పాటే భాగ్యనగర్ రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యేవి. ఈ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి నిజాం ప్రభుత్వం చాలా తికమకపడడం గమనార్హం. ఈ యంత్ర సామగ్రిని వనపర్తికి చెందిన రఘనాథరెడ్డి, కోదండరామిరెడ్డిలు అమర్చారు. స్టేట్ కాంగ్రెస్ నాయకత్వంలో జరుగుతున్న విముక్తి ఉద్యమాన్ని దీని ద్వారా ప్రజల్లో విరివిగా ప్రసారం చేయగలిగారు. -
పోరు మాగాణం
ఓరుగల్లు ఓ ఆయుధం.. ఓ తూటా.. ఓ సైనికుడు.. పోరాటాలకు దిశానిర్దేశం చేసిన గడ్డ. నైజాం నవాబును, ఆయన తొత్తులు.. రజాకార్లు, దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన చోటు. చాకలి ఐలమ్మ శౌర్యం, దొడ్డి కొమురయ్య ధీరత్వం, బందగీ అమరత్వం పుణికిపుచ్చుకున్న భూమి. దొరల పెత్తందారీ, భూస్వామ్య వ్యవస్థపై సమరశంఖం పూరించిన మాగాణం. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు చేసిన సాయుధ గెరిల్లా పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇంకెందరికో ఉత్తేజాన్నిచ్చింది. సుమారు 900 మంది వీరుల రక్తంతో తడిసిన ఈ గడ్డమీది నుంచే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మెుదలైంది. తొలిసారిగా 1969లో ఉద్యమ బీజాలు పడ్డారుు. ఆ తర్వాత 2001 నుంచి ఉద్యమం మహా కెరటమై ఎగిసింది. పల్లె, పట్నం కదం తొక్కాయి. 143 మంది విద్యార్థులు, యువకులు ఆత్మార్పణ చేసుకున్నారు. నాడు నిజాం పాలన నుంచి విముక్తి పొందితే.. నేడు ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరింది. సాయుధ పోరులో.. స్వరాష్ట్ర ఉద్యమంలో జిల్లా ప్రజలు చూపిన ధైర్యసాహసాలు చిరస్మరణీయం. రజాకార్ల దురాగతాలపై అక్షర సమరం కేసముద్రం : రజాకార్ల ఆగడాలను ఎదిరించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఒద్దిరాజు సీతారామచందర్‌రావు, రాఘవరంగారావు ‘తెనుగు పత్రిక’ను స్థాపించారు. ఈ తెలుగు పత్రిక తొలి సంచికను 1922 ఆగస్టు 22న అప్పటి నిజాం ప్రభుత్వం హయంలో కుగ్రామంగా ఉన్న కేసము ద్రం మండలం ఇనుగుర్తిలోనే ముద్రించారు. అప్పటి వరకు తెలుగు పత్రికలు లేవు. ఇదే తొలి పత్రిక. ఒద్దిరాజు సోదరు లు పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. వీరిద్దరూ కవిత్వంలో దిట్టకావడంతో జంటకవులుగా ప్రసిద్ధికెక్కారు. నిజాంకు వణుకు పుట్టించిన పత్రిక నిజాం పాలనలో అన్ని రకాలుగా అణిచివేతకు గురైన తెలంగాణ ప్రజలందరినీ మేల్కొలిపి వారిని చైతన్యవంతులుగా చేయడానికి ఒద్దిరాజు సోదరులు తమ కలానికి పదునుపెట్టారు. వారు రాసిన అనేక శీర్షికలు నిజాం, రజాకారుల గుండెల్లో గుబులు పుట్టించడమేకాక, అణచివేతకు గురైన ప్రజలను ఉత్తేజపరిచాయి. పత్రికకు చందాదారులు లేకపోవడంతో సోదరులిద్దరూ స్వయంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, సూర్యాపేట, విజయవాడ, బందరు, చైన్నై, మానుకోట తదితర ప్రాంతాలలో చందాదారులను చేర్పించారు. పత్రికలో వచ్చిన కథనాలకు మంచి స్పందనరావడంతో హైదరాబాద్‌కు చెందిన బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హన్మంతరావు, కొదాటి రామకృష్ణారావు, వెంకటేశ్వర్రావు లాంటి ప్రముఖులు తెనుగు పత్రికలో వార్తలు, వ్యాసాలు రాయడానికి ముందుకొచ్చారు. వారి స్ఫూర్తితో ఒద్దిరాజు సోదరుల సమీప బంధువు నల్గొండకు చెందిన షబ్నాలీస్ వెంకటనర్సింహారావు ‘నీలగిరి’ పత్రికను 1923లో స్థాపించారు. ఇనుగుర్తిలో రజాకార్ల దాడులు తెనుగు పత్రికలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా వస్తున్న వార్తలకు మండిపడ్డ రజాకార్లు ఇనుగుర్తి గ్రామానికి చేరుకుని దాడులకు దిగారు. ఒద్దిరాజు సోదరులకు చెందిన గ్రంథాలను, ముద్రణ మిషన్లను ధ్వంసం చేసి తగుల బెట్టారు. ఈ క్రమంలో స్నేహితుల సహకారంతో పత్రిక నిర్వహణను జిల్లా కేంద్రానికి మార్చారు. తర్వాత కొద్ది నెలలకు పలు కారణాల వల్ల పత్రిక ప్రచురణ నలిచిపోయిం ది. మొత్తం మీద తెనుగు పత్రిక ఆరు సంవత్సరాల పాటు విజయవంతంగా ప్రచురితమైంది. గోలకొండ పత్రిక తెనుగు పత్రిక తర్వాత పుట్టిన గోలకొండ పత్రిక కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్ దక్కన్ కేంద్రంగా ప్రతీ సోమ, గురువారాల్లో వెలువడిన ఈ పత్రికలో జవహర్లాల్ నెహ్రూ వ్యాసాలతో పాటు ఆ సమయంలో జరుగుతున్న పోరాటాల తీరు, వార్తా కథనాలను ప్రచురించారు.