మహ్మదాపూర్‌లోని అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి సమాధులు
హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరుల జ్ఞాపకాలను నేటి ప్రజలు మరిచి పోవడం లేదు. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన వీరుల జ్ఞాపకార్థం గుట్ట కింద అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిల సమాధులు నిర్మించి ప్రతి ఏటా సెప్టెంబర్ 17న, మార్చి 14 కమ్యూనిస్టులు నిర్వహించే సభలకు ప్రజలు పార్టీలకు అతీతంగా హాజరై వీరులకు నివాళులర్పించి ఆనాటి జ్ఞాపకాలను నేమరువేసుకుంటారు.
మహ్మదాపూర్ శివారులోని ఎతైన గుట్టలు, ప్రకృతి సోయగాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకొనే ప్రకృతి సౌందర్యం కోటగిరి గుట్టల సొంతం. ప్రతీ శ్రావణమాసంలో పర్యటకులు గుట్టల ప్రదేశానికి వనభోజనాలకు వచ్చి ఆనందంగా గడిపి ఆనాటి తెలంగాణ వీరు త్యాగాలను స్మరించుకుంటారు. ప్రతీ ఏటా సీపీఐ అధ్వర్యంలో హుస్నాబాద్ నుంచి మహ్మదాపూర్ వరకు భారీ ర్యాలీ తీసి అమరుల వర్ధంతి సభను ఘనంగా జరుపుకుంటారు. 2016 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పేరున భారీతీయ జనతా పార్టీ మహ్మదపూర్‌లోని అమరుల వీర భూమిని సందర్శించి పర్యటక కేంద్రంగా మార్చుతామని చెప్పినా నేటికి ఆచరణలో అమలుకు నోచుకోలేదు.
14 మంది వీరుల మరణానికి గుర్తుగా నిర్మించిన శిలా ఫలకం
సాయుధ వీరులకు స్థావరం ఈ కోటలు....
తెలంగాణ పేద ప్రజల విముక్తి కోసం నిజాం ప్రభుత్వ అరాచక పాలనను ఎదిరించిన తెలంగాణ సాయుధ పోరాట వీరులకు, హుస్నాబాద్ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. సాయుధ పోరాటంలో పేదల విముక్తి కోసం పోరు చేసిన కమ్యూనిస్టులు పోలంపల్లికి చెందిన అనభేరి ప్రభాకర్‌రావు, íసిరిసిల్ల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన సింగిరెడ్డి భూపతిరెడ్డిల దళాలు రజాకార్ల పోరు చేస్తూ మహ్మదాపూర్‌కు చేరుకున్నాయి. 14 మార్చి 1948లో పేద ప్రజలకు చైతన్యం చేస్తున్నక్రమంలో మహ్మదాపూర్‌లో సమావేశం అయినప్పుడు రజాకార్లు సమాచారం తెలుసుకొని సాయుధ దళాలపై దాడులు చేశాయి.
రజాకార్ల తో పోరు చేస్తూ గుట్టలకు వెల్లుతున్న సాయుధులను రజాకార్లు వెంటబడి వేటాడి కాల్పులు జరుపడంతో అక్కడే 12 మంది వీరులు వీరమరణం పొందారు. దీంతో హుస్నాబాద్ ప్రాంతానికి ప్రత్యేకత చోటు చేసుకుంది. వీరుల జ్ఞాపకార్థం ఆనాటి దళనాయకులైన అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి పేరుతో రెండు సమాధులు నిర్మించారు. ప్రతి ఏటా వర్ధతి రోజున సీపీఐ ఆధ్వర్యంలో సభలు నిర్వహిస్తూ వీరుల త్యాగలను గుర్తు చేసుకుంటారు.
పర్యాటక కేంద్రం చేయాలి..
ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రం చేయాలని ఆనాటి ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ప్రతిపాదనలు పంపించారు. పర్యటక కేంద్రానికి వైఎస్ సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆ దిశగా ప్రయత్నం సాగుతున్న క్రమంలో ఆయన మరణంతో పర్యటక కేంద్రం అక్కడే ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి పర్యటక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment