singi reddy
-
వార్తా శీర్షికలలో చిరంజీవి సినారె
సి.నారాయణ రెడ్డి పాటలు తెలుగు హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. విద్యాలయాల్లో సారస్వత శాఖలు మూతపడి విద్యార్థులలో భాషాధ్యయనం తగ్గి, కవిత్వం రాసే వాళ్లు తగ్గుతున్న ఒక దశలో భాషాభిమానులు తెలుగు సాహిత్యం క్షీణదశకు చేరిందని ఆవేదన చెందుతున్న సమయంలో ‘కవిత్వం ఎక్కడికి పోతుంది? నిత్యనూతనంగా వర్థిల్లుతూనే ఉంటుంది. ప్రతి రోజూ దినపత్రికల వార్తా శీర్షికల్లో..’ అని సినారె వ్యాఖ్యానించారు. సామాన్య పదబంధాలతో అనన్య సామాన్య భావ సృష్టి చేయడం సినారెకే చెల్లింది. అందువల్లనే పత్రికల వార్తలకు ఆయన పాటలలోని పదాలు చక్కగా అమరేవి. ఎందరో పాత్రికేయులు.. ఎన్నో పత్రికల డెస్కులలో అర్ధరాత్రి వార్తలు, వార్తా కథనాలు ముందు పెట్టుకుని శీర్షికల కోసం తపన పడుతుంటే ముందుగా సినారెనే వారి తలపులోకొచ్చేవారు. ఇలా ఎందరో ఎన్నెన్నో వార్తలను సినారె గీతమాలికలతో అలంకరించారు. నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలపై ఆయన ఆవేదనగా రాసిన పాట పల్లవి ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’ (తాత మనవడు) ఎన్ని మానవీయ కథనాలకు పత్రికలలో వాడుకున్నారో చెప్పలేం. మూడేళ్ల పాప బొద్దుగా.. ముద్దుగా ఉంది. ఓ తిరుణాలలో తప్పిపోయింది.. ఆ వార్తకు ఓ పాత్రికేయుడు ఇచ్చిన శీర్షిక.. ‘ఎవరో.. ఏవూరో.. ఎవరు కన్నారో..!’ అని ఆత్మబంధువు సినిమా కోసం సినారె రాసిన గీతం. అంతే.. ఆ వార్త చూసిన పాప తల్లిదండ్రులు ఆ పత్రిక కార్యాలయానికి ఉరికారు. పాప ఫొటో చిన్నగా వేయడం వల్ల చూడలేదని, పాటను శీర్షికగా చూసి ఆవార్త చది వామని వారు చెప్పడం విశేషం. అసలు కవిత్వం ఎంతమాత్రమూ సరిపడని సందర్భానికి కూడా సినారె గీతంలోని పదబంధాన్ని తగిలించి కాదేదీ కవిత కనర్హం అనిపించిన సందర్భం ఉంది. పోలీసులు కేసులు పెట్టి సీజ్ చేసిన కొన్ని వందల వాహనాల వల్ల తుప్పు పట్టి నాశనమవుతుంటే, ఓ విలేకరి రాసిన వార్తకు ‘కదలలేవు.. మెదలలేవు.. పెదవి విప్పి పలుకలేవు..’ అని సినారె అమరశిల్పి జక్కన చిత్రంలో రాసిన పాటలోని చరణాలు శీర్షికగా పెడితే పై అధికారులు స్పందించి, వెంటనే ఆ వాహనాలు వేలం వేసి కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరిగింది. అలాగే, ఓ ప్రభుత్వ అధికారి ఉండేవారు. ఏ శాఖలో పనిచేస్తున్నా ఆయన మీద ఉద్యోగినులపట్ల అనుచిత ప్రవర్తన ఆరోపణలతో బదిలీ చేసేవారు. ఆయన్ని ఒకసారి ఉద్యానవన శాఖకు బదిలీ చేశారు. ఆ శాఖలో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారట. దీనిపై అక్కడి సిబ్బంది ఆందోళన చెంది ఆయన మాకొద్దు.. వేరేవారిని వెయ్యండని పై అధికారులకు అర్జీ పెట్టుకున్నారట. దీన్ని పసిగట్టి ఇచ్చిన వార్తకు సినారె రాసిన పాట పల్లవి రామబాణంలా పనిచేసింది. ‘తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా..’ (బుద్ధిమంతుడు) ఆ పట్టణంలో వార్త వచ్చిన వారం రోజులదాకా పాఠకులు శీర్షికను తలుచుకుంటూనే ఉన్నారు. పై అధికారులు ఆ తుంటరి తుమ్మెదను తూనికలు, కొలతల శాఖకు పంపారు. సమాజంలో అధోగతిలో బతుకుతున్న వేశ్యల జీవితాలపై మానవుడు–దానవుడు సిని మాలో సినారె ఓ పాట రాశారు. ‘ఎవరో కాదు.. వీరెవరో కాదు.. మన రక్తం పంచుకున్న ఆడపడచులు.. మనం జారవిడుచుకున్న జాతి పరువులు..’ చాలా శక్తివంతమైన ఈ పదబంధాలను వేశ్యవాటికల మీద, వారి హృదయవిదారకమైన జీవితాల మీద రాసిన వార్తా వ్యాసాలకు శీర్షికలుగా, ప్రవేశికలుగా ఆరోజుల్లో చాలా పత్రికలు వాడుకున్నాయి. సరిలేరు నీకెవ్వరూ పాట యువతలో సై్థర్యం నింపేది. సినారె చెప్పినట్లు మీడియా వార్తలలో కవిత్వమే కాదు ఆయన కూడా నిత్యనూతనంగా వెలుగొందే చిరంజీవి. (డాక్టర్ సి.నారాయణరెడ్డి తొలి వర్ధంతి సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని త్యాగరాజ గానసభలో అచంట కళాంజలి సభ) అచంట సుదర్శనరావు, అధ్యక్షులు, అచంట కళాంజలి ‘ 90005 43331 -
వీరులారా వందనం
హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరుల జ్ఞాపకాలను నేటి ప్రజలు మరిచి పోవడం లేదు. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన వీరుల జ్ఞాపకార్థం గుట్ట కింద అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిల సమాధులు నిర్మించి ప్రతి ఏటా సెప్టెంబర్ 17న, మార్చి 14 కమ్యూనిస్టులు నిర్వహించే సభలకు ప్రజలు పార్టీలకు అతీతంగా హాజరై వీరులకు నివాళులర్పించి ఆనాటి జ్ఞాపకాలను నేమరువేసుకుంటారు. మహ్మదాపూర్ శివారులోని ఎతైన గుట్టలు, ప్రకృతి సోయగాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకొనే ప్రకృతి సౌందర్యం కోటగిరి గుట్టల సొంతం. ప్రతీ శ్రావణమాసంలో పర్యటకులు గుట్టల ప్రదేశానికి వనభోజనాలకు వచ్చి ఆనందంగా గడిపి ఆనాటి తెలంగాణ వీరు త్యాగాలను స్మరించుకుంటారు. ప్రతీ ఏటా సీపీఐ అధ్వర్యంలో హుస్నాబాద్ నుంచి మహ్మదాపూర్ వరకు భారీ ర్యాలీ తీసి అమరుల వర్ధంతి సభను ఘనంగా జరుపుకుంటారు. 2016 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పేరున భారీతీయ జనతా పార్టీ మహ్మదపూర్లోని అమరుల వీర భూమిని సందర్శించి పర్యటక కేంద్రంగా మార్చుతామని చెప్పినా నేటికి ఆచరణలో అమలుకు నోచుకోలేదు. 14 మంది వీరుల మరణానికి గుర్తుగా నిర్మించిన శిలా ఫలకం సాయుధ వీరులకు స్థావరం ఈ కోటలు.... తెలంగాణ పేద ప్రజల విముక్తి కోసం నిజాం ప్రభుత్వ అరాచక పాలనను ఎదిరించిన తెలంగాణ సాయుధ పోరాట వీరులకు, హుస్నాబాద్ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. సాయుధ పోరాటంలో పేదల విముక్తి కోసం పోరు చేసిన కమ్యూనిస్టులు పోలంపల్లికి చెందిన అనభేరి ప్రభాకర్‌రావు, íసిరిసిల్ల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన సింగిరెడ్డి భూపతిరెడ్డిల దళాలు రజాకార్ల పోరు చేస్తూ మహ్మదాపూర్‌కు చేరుకున్నాయి. 14 మార్చి 1948లో పేద ప్రజలకు చైతన్యం చేస్తున్నక్రమంలో మహ్మదాపూర్లో సమావేశం అయినప్పుడు రజాకార్లు సమాచారం తెలుసుకొని సాయుధ దళాలపై దాడులు చేశాయి. రజాకార్ల తో పోరు చేస్తూ గుట్టలకు వెల్లుతున్న సాయుధులను రజాకార్లు వెంటబడి వేటాడి కాల్పులు జరుపడంతో అక్కడే 12 మంది వీరులు వీరమరణం పొందారు. దీంతో హుస్నాబాద్ ప్రాంతానికి ప్రత్యేకత చోటు చేసుకుంది. వీరుల జ్ఞాపకార్థం ఆనాటి దళనాయకులైన అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి పేరుతో రెండు సమాధులు నిర్మించారు. ప్రతి ఏటా వర్ధతి రోజున సీపీఐ ఆధ్వర్యంలో సభలు నిర్వహిస్తూ వీరుల త్యాగలను గుర్తు చేసుకుంటారు. పర్యాటక కేంద్రం చేయాలి.. ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రం చేయాలని ఆనాటి ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ప్రతిపాదనలు పంపించారు. పర్యటక కేంద్రానికి వైఎస్ సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆ దిశగా ప్రయత్నం సాగుతున్న క్రమంలో ఆయన మరణంతో పర్యటక కేంద్రం అక్కడే ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి పర్యటక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
సీపీఐ కార్యకర్తపై హత్యాయత్నం
హుస్నాబాద్‌రూరల్,న్యూస్‌లైన్: హుస్నాబాద్‌లో కిరాయి గూండాలు పెట్రేగిపోతున్నారు. వారి ఆగడాలు మితిమీరుతున్నా అదుపు చేసే వారే కరువయ్యారు. గురువారం రాత్రి సీపీఐ కార్యకర్త రాగుల శ్రీనివాస్‌పై ఇదే గూండాలు హత్యాయత్నం చేశారు. శ్రీనివాస్‌కు తన బంధువు ఒకరితో భూ సంబంధమైన గొడవ జరిగింది. ఇద్దరూ వాదులాడుకోవడంతో స్థానికులు వారించారు. అయితే కొద్దిసేపటికే శ్రీనివాస్ బంధువు కిరాయి గూండాలతో వచ్చి శ్రీనివాస్‌వాస్‌పై దాడి చేయించాడని ఆయన బంధువులు తెలిపారు. కర్రలతో తలపై తీవ్రంగా కొట్టడంతో కుప్పకూలిపోయిన శ్రీనివాస్‌ను హుస్నాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కరీంనగర్‌కు తరలించాలని సూచించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడవెంకట్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు స్థానిక నాయకులు పరామర్శించారు. ఈ సంఘటనపై పోలీసుల నుంచి వివరాలు రావాల్సి ఉంది. కొన్నేళ్ల క్రితం పట్టణంలోని ఎల్లంబజార్‌లో కూడా ఈ తరహా గూండాలు జనం చూస్తుండగానే ఓ యువకుడి గొంతు కోసి చంపారు. మరో యువకుడిని దారుణంగా కొట్టి ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించారు. ప్రధాన కూడళ్లలో, మద్యం దుకాణాల ముందు వీరంగం సృష్టిస్తూ రోజుకొక గొడవకు కారణమవుతున్న ఈ గూండాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.