సి.నారాయణ రెడ్డి పాటలు తెలుగు హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. విద్యాలయాల్లో సారస్వత శాఖలు మూతపడి విద్యార్థులలో భాషాధ్యయనం తగ్గి, కవిత్వం రాసే వాళ్లు తగ్గుతున్న ఒక దశలో భాషాభిమానులు తెలుగు సాహిత్యం క్షీణదశకు చేరిందని ఆవేదన చెందుతున్న సమయంలో ‘కవిత్వం ఎక్కడికి పోతుంది? నిత్యనూతనంగా వర్థిల్లుతూనే ఉంటుంది. ప్రతి రోజూ దినపత్రికల వార్తా శీర్షికల్లో..’ అని సినారె వ్యాఖ్యానించారు.
సామాన్య పదబంధాలతో అనన్య సామాన్య భావ సృష్టి చేయడం సినారెకే చెల్లింది. అందువల్లనే పత్రికల వార్తలకు ఆయన పాటలలోని పదాలు చక్కగా అమరేవి. ఎందరో పాత్రికేయులు.. ఎన్నో పత్రికల డెస్కులలో అర్ధరాత్రి వార్తలు, వార్తా కథనాలు ముందు పెట్టుకుని శీర్షికల కోసం తపన పడుతుంటే ముందుగా సినారెనే వారి తలపులోకొచ్చేవారు. ఇలా ఎందరో ఎన్నెన్నో వార్తలను సినారె గీతమాలికలతో అలంకరించారు. నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలపై ఆయన ఆవేదనగా రాసిన పాట పల్లవి ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’ (తాత మనవడు) ఎన్ని మానవీయ కథనాలకు పత్రికలలో వాడుకున్నారో చెప్పలేం. మూడేళ్ల పాప బొద్దుగా.. ముద్దుగా ఉంది. ఓ తిరుణాలలో తప్పిపోయింది.. ఆ వార్తకు ఓ పాత్రికేయుడు ఇచ్చిన శీర్షిక.. ‘ఎవరో.. ఏవూరో.. ఎవరు కన్నారో..!’ అని ఆత్మబంధువు సినిమా కోసం సినారె రాసిన గీతం. అంతే.. ఆ వార్త చూసిన పాప తల్లిదండ్రులు ఆ పత్రిక కార్యాలయానికి ఉరికారు.
పాప ఫొటో చిన్నగా వేయడం వల్ల చూడలేదని, పాటను శీర్షికగా చూసి ఆవార్త చది వామని వారు చెప్పడం విశేషం. అసలు కవిత్వం ఎంతమాత్రమూ సరిపడని సందర్భానికి కూడా సినారె గీతంలోని పదబంధాన్ని తగిలించి కాదేదీ కవిత కనర్హం అనిపించిన సందర్భం ఉంది. పోలీసులు కేసులు పెట్టి సీజ్ చేసిన కొన్ని వందల వాహనాల వల్ల తుప్పు పట్టి నాశనమవుతుంటే, ఓ విలేకరి రాసిన వార్తకు ‘కదలలేవు.. మెదలలేవు.. పెదవి విప్పి పలుకలేవు..’ అని సినారె అమరశిల్పి జక్కన చిత్రంలో రాసిన పాటలోని చరణాలు శీర్షికగా పెడితే పై అధికారులు స్పందించి, వెంటనే ఆ వాహనాలు వేలం వేసి కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరిగింది.
అలాగే, ఓ ప్రభుత్వ అధికారి ఉండేవారు. ఏ శాఖలో పనిచేస్తున్నా ఆయన మీద ఉద్యోగినులపట్ల అనుచిత ప్రవర్తన ఆరోపణలతో బదిలీ చేసేవారు. ఆయన్ని ఒకసారి ఉద్యానవన శాఖకు బదిలీ చేశారు. ఆ శాఖలో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారట. దీనిపై అక్కడి సిబ్బంది ఆందోళన చెంది ఆయన మాకొద్దు.. వేరేవారిని వెయ్యండని పై అధికారులకు అర్జీ పెట్టుకున్నారట. దీన్ని పసిగట్టి ఇచ్చిన వార్తకు సినారె రాసిన పాట పల్లవి రామబాణంలా పనిచేసింది. ‘తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా..’ (బుద్ధిమంతుడు) ఆ పట్టణంలో వార్త వచ్చిన వారం రోజులదాకా పాఠకులు శీర్షికను తలుచుకుంటూనే ఉన్నారు. పై అధికారులు ఆ తుంటరి తుమ్మెదను తూనికలు, కొలతల శాఖకు పంపారు.
సమాజంలో అధోగతిలో బతుకుతున్న వేశ్యల జీవితాలపై మానవుడు–దానవుడు సిని మాలో సినారె ఓ పాట రాశారు. ‘ఎవరో కాదు.. వీరెవరో కాదు.. మన రక్తం పంచుకున్న ఆడపడచులు.. మనం జారవిడుచుకున్న జాతి పరువులు..’ చాలా శక్తివంతమైన ఈ పదబంధాలను వేశ్యవాటికల మీద, వారి హృదయవిదారకమైన జీవితాల మీద రాసిన వార్తా వ్యాసాలకు శీర్షికలుగా, ప్రవేశికలుగా ఆరోజుల్లో చాలా పత్రికలు వాడుకున్నాయి. సరిలేరు నీకెవ్వరూ పాట యువతలో సై్థర్యం నింపేది. సినారె చెప్పినట్లు మీడియా వార్తలలో కవిత్వమే కాదు ఆయన కూడా నిత్యనూతనంగా వెలుగొందే చిరంజీవి.
(డాక్టర్ సి.నారాయణరెడ్డి తొలి వర్ధంతి సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని త్యాగరాజ గానసభలో అచంట కళాంజలి సభ)
అచంట సుదర్శనరావు, అధ్యక్షులు, అచంట కళాంజలి ‘ 90005 43331
Comments
Please login to add a commentAdd a comment