అమెరికన్ యువ కవితాపీఠంపై పరిమళిస్తున్న తెలుగుదనం | ramya ramana elected as new york poet | Sakshi
Sakshi News home page

అమెరికన్ యువ కవితాపీఠంపై పరిమళిస్తున్న తెలుగుదనం

Published Tue, Sep 2 2014 10:43 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

అమెరికన్ యువ కవితాపీఠంపై పరిమళిస్తున్న తెలుగుదనం - Sakshi

అమెరికన్ యువ కవితాపీఠంపై పరిమళిస్తున్న తెలుగుదనం

ఒక భావనకు ఆలోచన వచ్చినప్పుడు...
ఆ ఆలోచనకు మాటలు వచ్చినప్పుడు పుట్టేదే కవిత్వం    - రాబర్ట్ ఫ్రాస్ట్, కవి

 
రెండు పదులు కూడా నిండని రమ్యారమణ 2013-14 సంవత్సరానికిగానూ న్యూయార్క్ రాష్ట్రానికి యువ ఆస్థాన కవయిత్రిగా ఎన్నికయింది! పేరును బట్టి అర్థమయ్యే ఉంటుంది కదా, ఆమె భారతీయురాలని. స్పష్టంగా చెప్పాలంటే మన తెలుగమ్మాయి! ఆ పదవికి ఎంపికయినవారిలో ఆమె మొట్టమొదటి భారతీయురాలు కావడం విశేషం. ఆమె ఈ పదవికి ఎలా ఎన్నికయిందంటే...
 
రమ్యారమణ తల్లి శ్రీవిద్య, తండ్రి పిళ్లయార్ రమణబాబు. తమిళనాడులోని రాజ పాళ్యంలో ఉంటున్న వీరి కుటుంబం తెలుగు సంతతి చెందినవారు. స్థిరపడింది మాత్రం అమెరికాలో. ఆమె తండ్రితో సహా ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడతారు. రమ్య తన చిన్నప్పుడు ఇండియాలోని అమ్మమ్మ దగ్గరే పెరిగింది. కర్ణాటక సంగీతం, భరతనాట్యం నేర్చుకుంది. తర్వాత తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. రమ్య మాత్రం తెలుగు కన్నా ఇంగ్లీషే బాగా మాట్లాడుతుంది. ఆమె న్యూయార్క్‌లోని స్టోనీబ్రూక్‌లో చదివే సమయంలో... అక్కడ అంతా తెల్లవారే కావటంతో రమ్య తన పాఠశాలలో తీవ్ర వివక్షకి గురయ్యింది.
 
 ‘‘తెల్లవారిలా దుస్తులు ధరిస్తే, వారిలా జుట్టు కట్ చేయించుకుంటే, వారిలాగే ఉచ్చారణ ఉంటే నన్ను ఏడిపించకుండా ఉంటారనుకున్నాను. అయితే వారి ప్రవ ర్తనలో ఎటువంటి మార్పూ లేదు. అప్పటినుంచే నా మనసులోని భావాలను కవితల రూపంలో వ్యక్తం చేయడం అలవాటయ్యింది’’ అంటూ తాను కవయిత్రిగా మారడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు రమ్య. ఆమె రాసిన కవితలను చదివిన తలిదండ్రులు, ఆమెను అర్బన్ వర్డ్ న్యూయార్క్ సిటీ అనే సంస్థలో చేర్పించి, తాను రాసే కవిత్వానికి తానే మెరుగులు దిద్దుకునేందుకు అవకాశం కల్పించారు.
 
అప్పుడే ఆమె అనుకోకుండా ఒకసారి నిక్స్ పొయెట్రీ స్లామ్ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. అందులో ఆమె ఎంత ప్రతిభ కనబరిచిందంటే ఆమె  చదువుకయ్యే ఖర్చునంతటినీ స్కాలర్‌షిప్ రూపంలో సంస్థ వారే భరించేందుకు ముందుకు వచ్చేంతగా!
రెండేళ్ల క్రితం నీనా దావులూరిని మిస్ అమెరికాగా ఎంపిక చేయడంతో జాత్యహంకారంతో అక్కడ ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రమ్య మనసులోని భావసంఘర్షణ అక్షరరూపంలో ఇలా పెల్లుబుకింది.
 
నా దేశంలో 390 భాషలు మాట్లాడతారు.
అందులో ఒకటైన తెలుగు భాష మేము మాట్లాడతాము.
వారికి చెప్పండి ఈ భూమి మీదని,
వారికి చెప్పండి ఈ జెండా మీదని,
వారికి చెప్పండి మీ జన్మపత్రాలు మీవని,
ఈ కుల వ్యవస్థ గురించి మాట్లాడ వద్దని
గాంధీ గురించి మాట్లాడండి.
నెహ్రూ గురించి మాట్లాడండి
స్త్రీల గురించి మాట్లాడండి...


(ఇవి రమ్య రాసిన కవితలో కొన్ని పంక్తులు మాత్రమే)
యూత్ పొయెట్ లారెట్‌కి ఫైనల్‌గా జరిగిన పోటీలో ఎంతో ఆవేశంతో ఈ కవితను చదివింది రమ్య. అంతే! మిన్నుముట్టిన కరతాళ ధ్వనుల మధ్య న్యాయనిర్ణేతలు ఆమెనే ఈ పదవికి ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు.
 
న్యూయార్క్ ప్రభుత్వం వారు యూత్ పొయెట్ లారెట్ పథకం కింద రమ్య రాసే కవితలను పుస్తకంగా ప్రచురిస్తారు. యువతను చైతన్యవంతం చేయడంలో, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా మలచడంలో ప్రభుత్వంతో పాలుపంచుకోవడం రమ్య ముందున్న కర్తవ్యాలు.
 
ప్రస్తుతం రమ్య న్యూయార్క్‌లోని సెయింట్ జాన్స్ యూనివర్శిటీలో తత్త్వశాస్త్రం, రాజనీతిశాస్త్రాలను అధ్యయనం చేస్తోంది. జాతివివక్షతకు, అణచివేతకు గురవుతున్న ప్రజల పక్షాన కవిత్వం రాయడమే కాదు, వారు చేస్తున్న పోరాటాల్లోనూ చురుగ్గా పాలు పంచుకుంటున్న రమ్య అమెరికాలో ఉంటున్న ఎంతోమంది తెలుగు యువతీ యువకులకు స్ఫూర్తిదాయకం అవుతుందని ఆశిద్దాం.
 -డి. కనకదుర్గ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement